సమావేశంలో మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్
జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీషీటర్లు వీరంగం వేస్తున్నారు
ఉప ఎన్నికపై సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
ఈ ఎన్నికలో రౌడీషీటర్ గెలిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఏంటి?
ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి అడగండి
రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది
బీజేపీ గురించి జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించడం లేదు
బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైంది.. భారీ మెజారిటీయే మన లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు.
ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి
ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి.
కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్‌లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు.
ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి
ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్‌చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.


