
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇది అభివృద్ధి పాలనకు, అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక
సునీత గోపీనాథ్‌కు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి వారంతా ఎదురుచూస్తున్నారు
బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నిక పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని పదేళ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండేళ్ల రాక్షస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతోందని చెప్పారు. బుధవారం తమ పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరే ముందు బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.
గోపీనాథ్ విశేష సేవలందించారు
‘లక్షల మంది రైతన్నలు, నిరుద్యోగులు సునీత గెలవాలని కోరుకుంటున్నారు. తమ ఇళ్లు కూలగొట్టడం లాంటి అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలని, ఆ అరాచకాలకు అడ్డుకట్ట పడాలని నగర పేదలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాద్‌లో కట్టలేదు.. కానీ నగరంలో కేసీఆర్ కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ ప్రజలకు గుర్తున్నాయి. బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్ని విషయాల్లో మోసపోయామని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గుర్తించారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి వారితో పాటు మైనారిటీలు కూడా సిద్ధంగా ఉన్నారు. దళితబంధు, అభయహస్తం అమలుకాక దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రతిఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్. ఆయన అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయన సతీమణి సునీతకు టికెట్ కేటాయించారు.
రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతిఒక్కరూ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి..’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా సునీత గోపీనాథ్ బుధవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.