శంషాబాద్: అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోబోయే ఇండిగో విమానాన్ని బాంబుతో పేల్చివేయనున్నట్లు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమర్ సపోర్ట్‌కు వచ్చిన మెయిల్ కలకలం రేపింది. బుధవారం ఉదయం పోర్ట్‌బ్లెయిర్ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 6ఈ 6306 శంషాబాద్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.
సమయానికి రెండు గంటల ముందు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ వేసి విస్తృతంగా తనిఖీలు చేశారు. 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విమానాన్ని వెంటనే నిర్మానుష్య ప్రాంతానికి తరలించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేల్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. భద్రతాధికారుల ఫిర్యాదు మేరకు ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గణతంత్ర దిన వేడుకల్లో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. అంతర్గత భద్రతతో పాటు విమానాశ్రయం ప్రహరీ చుట్టూ కూడా అణువణువునా పరిశీలిస్తున్నారు. డిపార్చర్, అరైవల్ టెర్మినళ్లతో పాటు రోటరీల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. పాస్‌ల జారీ తదితర అంశాలపై కూడా ఆంక్షలు విధించారు.


