ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయమాటలు చెప్పి మోసం చేశావ్
ఎన్నికల ముందు వేడుకొని, వాడుకొని, అధికారంలోకి వచ్చాక వదిలేశావ్
‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై చర్చించేందుకు పోలీసు భద్రత లేకుండా అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రాగలవా?’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు, నిరు ద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను వేడుకొని, వాడుకొని.. అధికారంలోకి వచ్చాక వదిలేశారని ధ్వజమెత్తారు.
శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ఆవిష్కరణ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు కానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జాబ్‌లు నింపాలని అడిగితే.. జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గల్లా పెట్టెలు నింపుకుంటున్నారని మండిపడ్డారు.
రెండు లక్షల జాబ్ కేలండర్ ఎక్కడ?
జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ కేలండర్ విడుదల చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని సీఎంను ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ అయిందని, రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలని పిలుపునిచ్చారు. విద్య, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని.. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో 1.64 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు.
‘నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్టు పెట్టింది, ఎంపిక చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం అయితే... నియామకపత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇక గుర్తు పెట్టుకో రేవంత్.. ఈరోజు నుంచి నీకు చుక్కలు చూపిస్తాం’అని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్ధన్, ఇందిర నాయక్, పురుషోత్తం యాదవ్, నవీన్ పటా్నయక్, మోతీలాల్, తిరుపతి, సింధురెడ్డి, లలిత రెడ్డి, శింబు, శంకర్ నాయక్, బాలకోటి, మహేందర్, కుమార్, రాడపాక రవి తదితరులు పాల్గొన్నారు.


