
నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై మరోమారు విరుచుకు పడ్డారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంనని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’.. అని రాజగోపాల్‌రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి.