
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవని.. వాటిని తట్టుకుని నిలబడితేనే నిలదొక్కుకోగలమని హుజూరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవా? అనే చర్చ జోరందుకుంది.
సాక్షి, మేడ్చల్-మల్కాజ్‌గిరి: హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల ఆవేదన తనకు అర్ధం అయ్యిందని.. వాళ్ల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో తాను లేనని అన్నారాయన.
శనివారం శామీర్‌పేట నివాసంలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ రాదు. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం రాదు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు.
హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. మనకు మనంగా భీఆర్‌ఎస్ నుంచి బయటకు రాలేదు. 2021లో ఆ పార్టీ నుంచి నరకం అనుభవించా. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి.. అవి తట్టుకుందాం. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. అయితే హుజురాబాద్‌లో ఓడిపోతా అని ఊహించలేదు.
శత్రువుతో నేరుగా కోట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో ఉంటా. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది.
కాలం చాలా గొప్పది. హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. హుజురాబాద్‌లో 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 53 వేల మెజార్టీ వచ్చింది. వ్యక్తులు ఎదకుండా ఏ పార్టీ బలపడలేదు. కార్యకర్తల ఆవేదన అర్ధం అయ్యింది. వాళ్ల రాజకీయా అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను.
కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. అబద్ధపు పునాదులపై బతుకుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. వీధి పోరాటాలు మనకు అవసరం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. నేను రాకముందు బీజేపీకి హుజురాబాద్‌లో కేడరే లేదు. నేను వచ్చాకే కరీంనగర్‌లో బీజేపీకి 50వేల మెజారిటీ. హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో మనవాళ్లే ఉంటారు.
కురుస స్వభావులను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదు. ఉన్నదాంట్లో గుర్తించి మనకి పదవులు వస్తాయి. ఎవరి దయాదక్షిణ్యాలు మనకు అవసరం లేదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండి..
హుజురాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని గెలిపించుకుంటా. ఇక నుంచి పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తలు మరుగుజ్జులు కాదు.. కుంగిపోవద్దు. రోశయ్య ,కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళతోనే కొట్లాడిన. సముద్రంలో తుపాను వచ్చే ముందు సైలెంట్‌గా ఉంటుంది. నాలాంటి వాళ్ళు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుంది. నేను ప్రజల నుంచి వచ్చిన వాడ్ని. ప్రజలే నాకు న్యాయ నిర్ణేతలు’’ అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లపై బీజేపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.