
ఢిల్లీ: పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శకాలు తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి 46సార్లు ఢిల్లీకి వచ్చినా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదని విమర్శించారు.
ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అపాయింట్‌మెంట్ అడిగితే అప్పుడు రేవంత్‌రెడ్డికి సమయం ఇచ్చారన్నారు. మరి మీ పార్టీ సీఎంకు మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు రామచందర్‌రావు. తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు.
తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని, న్యాయపరమైన చిక్కులు తెలిసి ... బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రామచందర్‌రావు స్పష్టం చేశారు.