
హైదరాబాద్. రాష్ట్రంలో తమ ఫోన్లు సహా పలువురు ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించడమే కాకుండా దీనిపై లైడిటెక్టర్ పరీక్షలు రావాలంటూ సవాల్ చేశారు. ఈ అంశానికి సంబంధించి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? మగాడివైతే రా అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు కేటీఆర్. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్-బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ‘ మగాడివైతే రా అని కేటీఆర్ సవాల్ చేయడం సూట్ కాలేదు. ఇది మా డైలాగ్.. నువ్వు కాపీ కొట్టావ్’ అంటూ చమత్కరించారు. ‘రేవంత్ రెడ్డి వస్తే...నువ్వు తట్టుకోగలవా కేటీఆర్. రేవంత్ రెడ్డి నాటు కోడి , కేటీఆర్ బ్రాయిలర్ కోడి. కేటీఆర్ మీ హాయాంలో బెడ్‌రూమ్‌లోకి పోయి అరెస్ట్ చేస్తారు.. అప్పుడు ఏం చేశావ్. గత ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంను మేము విమర్శిస్తే.. దానికి కారణం ఉంది.
కేసీఆర్ ప్రభుత్వంలో అమలు కాని హామీలపైనే విమర్శలు చేశాం. అసెంబ్లీలో ప్రశ్నిస్తే కోమటిరెడ్డి, సంపత్‌లను సస్పెండ్ చేశారు. మాకైతే అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమే ఇవ్వలేదు. మల్లన్న సాగర్‌లకు పోయేవారి పైన లాఠీలు విరగొట్టారు. పదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారు. హరీష్ రావు మీ నియోజకవర్గ ప్రజలు ఎన్ని సార్లు ఫ్రీ బస్సు వాడుకున్నారో లెక్క తీద్దమా. సీఎం రేవంత్ వస్తారు.. కేసీఆర్‌ను రమ్మనండి,. గజ్వేల్‌లో మహిళలు ఫ్రీ బస్సు ఎక్కారో లేదో తేల్చుకుందాం. గతంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరిగేవి. ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి.
.మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడా.?, రూ.500కే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పై చర్చకు సిద్దమా కేటీఆర్. మహిళా సంఘాలకు మా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం బిఆర్ఎస్ నేతలకు ఉందా?, సంపన్నులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్నాం. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య అందించేందుకు ఓక్కో నియోజకవర్గంలో రూ. 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఏరోజైనా కేసీఆర్ చేసాడా?, అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.