సాక్షి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం ఏంటి? అని ప్రశ్నించారు. సంజయ్ ఎవరు కాంగ్రెస్ వ్యవహారాలో జోక్యం చేసుకోవడానికి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే సంజయ్ రాజ్యంగా నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడాన్ని స్వాగతిస్తున్నా. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యమే కరెక్ట్ కాదు.
1983 ఎన్నికల్లో టీడీపీ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నేను ఎమ్మెల్యే, మంత్రిగా జగిత్యాలకు సేవ చేశాను. టీడీపీలో చంద్రబాబు ఆధిపత్యంతో విభేదించి నాదెండ్ల వర్గంలో చేరాను. అప్పుడు నాకు నేనుగా మంత్రి పదవికి రాజీనామా చేశాను. 1985లో పార్టీ ఫిరాయింపు చట్టం అమలులోకి వచ్చింది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు సంజయ్. పార్టీ ఫిరాయింపులపై గత దశాబ్ద కాలంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. సంజయ్ అభివృద్ధి గురించి నేను నేర్చుకోవాలా?. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ అడుగుపెట్టాడు. కార్యకర్తల కాళ్లలో కట్టెలు పెట్టి మా హక్కులను కాజేశాడు. కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానానికి వ్యక్తం చేశాను. సంజయ్ ఎవరు మా పార్టీ వ్యవహారాల్లో తల దూర్చడానికి..’ అని ప్రశ్నించారు.


