
బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరతాం: డిప్యూటీ సీఎం భట్టి
అసెంబ్లీలో ఇచ్చిన మద్దతు పార్లమెంట్‌లో కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది
బీసీ రిజర్వేషన్లు సహేతుకమని భావించే అన్ని పార్టీలనూ కలుస్తాం
రాహుల్ ఆలోచనను కేంద్రం ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది
దేశంలో ఎక్కడ, ఎప్పుడు కులగణన జరిగినా తెలంగాణనే మోడల్‌గా ఉండబోతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి
దళితులన్నా... బీసీలన్నా చులకన భావం ఉన్నట్టుంది
లీగల్ నోటీసులకు భట్టి భయపడడు...నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వెనుక బడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోసం ప్రయత్నిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహేతుకమని భావించే ప్రతీ రాజకీయ పార్టీని కలుస్తామన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరతామని, అందరి మద్దతూ కూడగడతామని చెప్పారు.
మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి పార్టీలను కలిసి మద్దతు కోరతామని చెప్పారు. శతాబ్దాల నుంచి అన్యాయం జరుగుతున్న వర్గాలకు న్యాయం చేసే దిశలో తాము మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉందని చెప్పారు.
ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ కూడా మద్దతిచ్చాయని, ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా ఆ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అన్నీ వివరిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతులను దేశంలోని పార్లమెంట్ సభ్యులకు వివరిస్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అన్ని విషయాలను తెలియజేస్తామన్నారు.
గతంలో జరిగిన సర్వేల అనుభవాలు, తాము నిర్వహించిన పైలట్ సర్వే, సర్వే ప్రశ్నావళి రూపకల్పన, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాలు, ఎన్యూమరేషన్ ప్రక్రియ, డేటా ఎంట్రీతోపాటు ఈ సర్వేను స్వతంత్ర నిపుణల కమిటీతో అధ్యయనం చేయించిన తీరును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామన్నారు.
మొత్తం 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైన కులగణన సమాచారాన్ని సరళీకృతం చేసిన అనంతరం అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించామని చెప్పారు. నిపుణల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీలో, కేబినెట్‌లో పెట్టి ఆమోదించిన తర్వాత ప్రజల ముందుకు తెస్తామని వెల్లడించారు.
ఆయన అడ్డుకునేలా మాట్లాడతారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు దళితులన్నా, బీసీలన్నా చిన్నచూపు ఉన్నట్టుందని భట్టి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా వర్గాలకు మేలు చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరిగినా ఆయన అడ్డుకునే విధంగా మాట్లాడతారన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము చెప్పామని, చేశామని అన్న భట్టి.. తామే చెప్పాం కాబట్టి తామే చేసుకోవాలని రాంచందర్‌రావు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. తామేమీ బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి అడగడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ప్రక్రియ గురించి అడుగుతున్నామని చెప్పారు. రాంచందర్‌రావు పంపిన లీగల్ నోటీసులు అందాయా అన్న ప్రశ్నకు భట్టి సీరియస్‌గా స్పందించారు.
‘లీగల్ నోటీసులకు భట్టి భయపడడు. నేను ఏం మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నా. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా, వ్యక్తిగా ఏం చెప్పాలో తెలుసు’ అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే ఇంత ప్రక్రియ ఎందుకు చేస్తామని, ఈ అంశాన్ని ఇంత దూరం తీసుకొచ్చామంటేనే తమ చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని భట్టి చెప్పారు.
నాడు అవసరం లేదన్న వారే..
అసలు కులగణన అవసరమే లేదని పార్లమెంటులో చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణలో జరిగిన సర్వే అనంతరం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయానికి వచ్చారని భట్టి చెప్పారు. ‘తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన (సీప్యాక్స్) దేశంలోనే ఒక చారిత్రక సర్వేగా నిలిచిపోనుంది.
సర్వే వద్దన్న మోదీ తెలంగాణ సర్వేతోనే ఒప్పుకునే స్థితికి తీసుకొచ్చాం. ఈ ప్రక్రియకు ఆద్యుడైన రాహుల్‌గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం అనుసరించేలా చేశాం. ఇక దేశంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ రాష్ట్రంలో సర్వే జరిగినా తెలంగాణను మోడల్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా ఈ సర్వే చేశాం’ అని భట్టి చెప్పారు.