breaking news
-
సగానికిపైగా అప్పులు తీర్చాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకే అప్పులు తెచ్చినట్లు మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెచ్చిన అప్పుల్లోనూ సగానికిపైగా తీర్చేశామని చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం కింద గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సైతం స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు అరకొరగా అందుతున్న విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని... అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇవ్వలేమని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుందా లేక అప్పుల సాకుతో కోతలు పెడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆస్తుల విలువ పెంచాం... 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,438 కోట్లు ఉండగా అప్పులు రూ. 22,423 కోట్లు ఉండేవని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు రూ. 81,016 కోట్లకు పెరగ్గా ఆస్తుల విలువ రూ. 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని చెప్పారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ , క్యాండిల్స్ కొనుక్కురావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. బోరుబావుల్లో నీళ్లు లేకపోతే ఇంట్లో ఎసరు పెట్టే పరిస్థితి లేదని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. బండెడ్లు అమ్ముకునే స్థితి నుంచి... బండెడ్లు అమ్మడం నుంచి పుస్తెలు అమ్ముకునే దాకా... ఏ బోరు వేశారో ఆ భూమి అమ్ముకొనే దాకా పరిస్థితి అప్పట్లో ఉండేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రైతులు దేశమంతా వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్ ద్వారా విద్యుత్ ఇచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. 133 కేవీ, 220 కేవీ, 400 కేవీ అందుబాటులో లేక, బ్యాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదు.. జెన్కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని, ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంపై వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్... తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక వెంటనే విద్యుదుత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గ్రిడ్‌ను అనుసంధానించి విద్యుత్ సరఫ రా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవ స్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చి ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు తెలిపారు. ఒక సంవత్సరంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తరువాత 9 గంటల కరెంటు ఇవ్వగలిగామని, రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు. -
‘ఖబడ్దార్’పై కలకలం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ గురువారం దారి తప్పింది. ‘ఖబడ్దార్’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య సభలో కలకలం సృష్టించింది. విపక్ష బీఆర్ఎస్ సభ్యులు అంతే దూకుడుతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఆవేశంతో ప్రతి సవాళ్ళు విసరడం సభలో వేడిని మరింత పెంచింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్నే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి వ్యంగా్రస్తాలు సంధించారు. ‘కిరోసిన్ దీపం కింద చదువుకున్న... కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారు?’అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాను పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్‌కు జోకడం తప్ప, ఎదురు చెప్పలేని స్థితి మాజీ మంత్రిది అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి అభ్యంతరం చెప్పా రు. ప్రతిగా అధికార పక్ష సభ్యులూ లేవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అధికార పక్షం వైపు వేలెత్తి చూపారు. పరస్పర వాగ్వాదం కొనసాగుతున్న తరుణంలోనే రాజగోపాల్‌రెడ్డి ‘పదేళ్ళు భరించాం.. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. ఖబడ్దార్’అంటూ చేసిన హెచ్చరిక సభా వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. కొత్త వాళ్ళున్నారు... కాస్త జాగ్రత్త వాగ్వాదాల మధ్య మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జోక్యం చేసకుని ‘ఈ సభ లో కొత్త వాళ్ళున్నారు. సభా మర్యాద కాపాడాలి. వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడం మంచిది కాదు’అంటూ సలహా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. సభ లో ‘ఖబడ్దార్’అనే పదం వాడొచ్చా? అని బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఏం జరిగిందో పరిశీలిస్తానని, ఖబడ్డార్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత సభ సర్దుమణిగింది. చర్చ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభలో లేకపోవడాన్ని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం కొద్ది సేపటికే బీఆర్ఎస్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. -
ఆరు రోజులు.. రెండు స్వల్పకాలిక చర్చలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంధన రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ప్రకటించారు. డిసెంబర్ ఏడో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు కొత్తగా ఎన్నికైనవారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 11న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్, 13న నామినేషన్ల స్వీకరణ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 14న నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 15న శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు 16న శాసనసభ, మండలి వేర్వేరుగా సమావేశమై చర్చ అనంతరం ఆమోదం తెలిపాయి. ధన్యవాద తీర్మాన ఆమోదం అనంతరం శాసనమండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాస నసభను మాత్రం 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 20న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, 21న ఇంధన రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదం నడుమ సాగింది. 26 గంటల 33 నిమిషాలు ఆరురోజుల్లో శాసనసభ మొత్తంగా 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. 19 మంది సభ్యు లు చర్చలో పాల్గొనగా, రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా మిగతా 118 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
జవాబు చెప్పలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేశారు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాలనలో అప్పులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. రేషన్‌బియ్యం పంపిణీ మొదలుకొని రైతులకు మద్దతు ధర, విద్యావ్యవస్థ వంటి వాటిపై సభలో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేకపోయారన్నారు. గురువారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము రాష్ట్ర ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు నిజమే అని తమ హయాంలో అప్పులు చేశామని, తాము ప్రభుత్వపరంగా చేసిన వ్యయం వల్ల ప్రయోజనాలు కలగలేదని వారు ఒప్పుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలన కారణంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడిపై రూ.7లక్షల అప్పు మోపారన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడుగులు వేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు పదవులు అనుభవించారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో విద్యుత్‌రంగంలో చర్యలు చేపట్టకపోతే ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల కరెంట్ ఇవ్వగలిగేది కాదన్నారు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాల్లో లెక్కలు, తప్పులు అనేది అవాస్తవం...తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం కావాలంటే స్పీకర్ ఆదేశంతో ప్రతీ సభ్యుడికి ఆ వివరాలు అందజేస్తామన్నారు. శ్వేతపత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తామన్నారు. అప్పడు టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన 36 రోజులకు అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తుచేశారు. తాము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీని సమావేశపరిచామన్నారు. -
‘సీడబ్ల్యూసీ’కి వెళ్లని సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వెళ్లాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సిన కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు. అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలోనే సాగునీటి శాఖపై రివ్యూ చేశారు. కానీ, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది. విద్యుత్‌పై చర్చ సందర్భంగా వాడీవేడిగా సభ సాగడంతో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోయారు. ఒక దశలో సీఎం జోక్యం చేసుకొని విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన పూర్తయిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళతారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరిగినా, సీఎం ఢిల్లీకి బయలుదేరలేదు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను సీడబ్ల్యూసీకి రాలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌కు చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నారని సమాచారం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కారణమేంటి? సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండు కీలక అంశాలపై ప్రభు త్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఎత్తిపొడిచే అవకాశం వచ్చి ఉండేదని, దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని ప్రభుత్వ, పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కేవలం అసెంబ్లీ సమావేశాలే కాదని, మరో ముఖ్యమైన పనిలో ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీ వెళ్లలేదనే చర్చ కూడా జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో మంత్రి ఉత్తమ్ కూడా రేవంత్‌రెడ్డితో చాలా సేపు అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్లో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ తర్వాతే రేవంత్ తన టూర్ రద్దు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది. -
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్‌కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్‌కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
TS Assembly: సీఎం రేవంత్ Vs అక్బరుద్దీన్.. మాటల యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ నడుస్తోంది. విద్యుత్ అప్పులపై అసెంబ్లీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాల్లో ఎంఐఎం పాత్ర ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం పని చేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ను, నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీఆర్ అలీకి వ్యతిరేకంగా ఎంఐఎం పనిచేసింది. కవ్వంపల్లి వంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదు. అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ముస్లింలందరికీ నాయకుడు కాదు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే.. అన్ని విషయాలను సభ ముందు పెడితే అక్బరుద్దీన్‌ను అభినందిస్తాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఎంఐఎంకు కేసీఆర్ మిత్రుడు కావచ్చు. మోదీకి కూడా మద్దతు ఇవ్వొచ్చు. అది వాళ్ల ఇష్టం. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం. అక్బర్ అన్ని విషయాలు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి తొమ్మిది మంది చనిపోయారు. ఆ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయింది. ఫాతిమా చనిపోతే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. మైనార్టీలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీనే’ అని అన్నారు. పవర్ పంచ్.. మరోవైపు విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యుత్ మొండి బకాయిల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్‌లో ఉంది. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు కరెంట్ కోసం ఆందోళన చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఎంఐఎం బాధ్యత తీసుకుని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ సీరియస్.. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. మేం ఎవరికీ భయపడం. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. నిజామాబాద్‌లో ఎంఐఎం పోటీ చేసిందా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎప్పుడు ఎక్కడా ఎలా పోటీ చేయాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని బీజేపీ బీ టీమ్ అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేయం. సీఎం రేవంత్‌కు ఛాలెంజ్ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా గందరగోళం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. భట్టి విక్రమార్క్ ఫైర్.. అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. నేను ఏం చెబుతున్నానో వినకుండా మాట్లాకండి. కొత్తవాళ్లు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలి. అక్బరుద్దీన్ అఖల్ ఉందా అని మాట్లాడటం సరికాదు. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
First Session of Third Telangana Legislative Assembly Day 6 Live Updates తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా బీజేపీ వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మొన్నటివరకు బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోయింది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ అంటుంది. బీజేపీకి ఎంఐఎంకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వాస్తవం లేదు. మీరు ఏమైనా చేసుకోండి బీజేపీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు. విషయం తెలుసుకుని మాట్లాడాలి: హరీష్ రావు సిద్దిపేట, గజ్వేల్‌లో విద్యుత్ బకాయిలు ప్రజలు కట్టకుండా ఉన్నవి కావు. అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల బకాయిలు ఉన్నవి అన్నది సీఎం తెలుసుకోవాలి. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తేనే టీడీపీతో ఆనాడు పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే. సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీలు మారాడు. జూబ్లీహిల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చింది: పొన్నం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీనే. తెలంగాణ కోసం ఆనాడు పార్లమెంట్లో ఎంపీలుగా మేము కొట్లాడం, కేసీఆర్ లేడు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి నేత. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి స్వరాష్ట్ర కల నెరవేరింది. తెలంగాణ కోసం పోరాడితే బతికుండగానే నాకు పిండ ప్రధానం చేసిన నాయకులు వాళ్లు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చినా గత పదిహేళ్లుగా అధికారంలో ఉండి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఎంపీగా కేసీఆర్‌ను గెలిపిస్తే కరీంనగర్ ప్రజలకు ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు? తెలంగాణ కోసం చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా అన్న కేసీఆర్ కరీంనగర్లో ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు? శ్వేత పత్రంపై స్పందించిన కేటీఆర్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 24 గంటల కరెంటు ఇవ్వలేమంటూ శ్వేత పత్రం విడుదల చేసిన అసమర్ధ పార్టీ. విద్యుత్ శాఖను 22వేల కోట్ల నష్టాల్లో అప్పజెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నేదునూరు శంకర్‌పల్లిలో ధర్నా చేసింది మేమే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పిండం పెడతా అన్నాడు. దేశంలో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఎక్కడా సక్సెస్ కాలేదు. కేంద్రం అనుమతి ఇవ్వలేదు కాబట్టే నేదునూరులో ప్రాజెక్టు టేకప్ చేయలేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది నేదునూరులో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయాలి. నేదునూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన సభలో చేయాలి. మేం ఎవరికీ భయపడం: అక్బరుద్దీన్ విద్యుత్ అప్పులపై అసెంబ్లీలో చర్చ. స్పీకర్ వెల్‌లోకి ఎంఐఎం సభ్యులు కిరణ్ కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు: అక్బరుద్దీన్ కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకొన ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమే. ముస్లిం అందరికీ నాయకుడు కాదు. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు టికెట్ ఇస్తే మజస్లిస్ ఓడించే ప్రయత్నం చేసింది. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి కేసీఆర్, అక్బరుద్దీన్ కలిసి పని చేశారు. విద్యుత్ రంగంపై చర్చ విద్యుత్‌ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు: పాయల్ శంకర్. 2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చినట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారు. విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిందే. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. తెలంగాణ శాసనసభలో పవర్ పంచాయితీ తెలంగాణ ప్రస్తుత విద్యుత్ రంగ పరిస్థితిపై కాంగ్రెస్ సర్కార్ శ్వేత పత్రం విడుదల రూ.81 వేల కోట్ల బకాయిలున్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్లే ఈ పరిస్థితంటూ ఆక్షేపణ అప్పులతో ఆస్తులు పెంచామన్న మంత్రి జగదీష్‌రెడ్డి పక్కదారి పట్టిన విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అవినీతి చేసిందని కోమటిరెడ్డి విమర్శలు జగదీష్రెడ్డిపైనా అవినీతి ఆరోపణలు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ జగదీష్‌రెడ్డి సవాల్ సవాల్ స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి మూడు అంశాలపై విచారణకు ఆదేశం విచారణకు రెడీ అంటూ ధీటుగా స్పందించిన జగదీష్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలకు కౌంటర్ ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగదీష్‌రెడ్డి తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభా గౌరవం కాపాడలంటూ కోరిన మాజీ స్పీకర్ పోచారం, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇంకా బీజేపీపై తప్పుడు ప్రచారమేనా? విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యుత్ సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు నష్టాల్లోకి నెట్టాయి ధర్నాలు లేవని మాజీ మంత్రి చెప్తున్నారు.. అసలు ధర్నా చేసే ఆలోచన చేస్తేనే అరెస్ట్ చేశారు కదా! రెండు వందల యూనిట్ల కరెంటు ఎప్పటి నుంచి ఫ్రీ గా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి డిస్కం లకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిధులు సకాలంలో చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నారు అయినా బీఆర్ఎస్, బీజేపీపై గ్లోబెల్ ప్రచారం చేస్తోంది ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారో లెక్కలు తేల్చేందుకే మీటర్లు కానీ బిల్లు వసూలు కోసమే అని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేశారు అప్పులు చేయకుండా కాంగ్రెస్ హామీలు అమలు చేయడం సాధ్యమా? సౌత్, నార్త్ గ్రిడ్ లను కలిపింది కేంద్ర ప్రభుత్వమే.. అయినా ఈ విషయాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం లేదు తెలంగాణ శాసనసభకు స్వల్ప విరామం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు? సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా అసెంబ్లీలోనే సీఎం రేవంత్ మధ్యాహ్నాం ఫ్లైట్ మిస్ కావడంతో మరో విమానం కోసం ప్రయత్నించిన సీఎంవో! విద్యుత్ రంగంపై శ్వేతపత్రం.. స్వల్పకాలిక చర్చతో వేడెక్కిన శాసనసభ ప్రస్తుత పరిణామాలతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సభలోనే ఉండాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి? ఆనాడు ఏమైపోయారు మీరంతా?: రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో సభలో మంత్రిగా ఉండి ఎర్రబెల్లి దయాకర్ రావు నన్ను ఉరికించి కొడతానన్నారు ఆరోజు నన్ను ఒక మంత్రి అలా అన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? సభ్యుల తీరుపై స్పీకర్ అభ్యంతరం శాసనసభలో నేటి పరిణామాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తిగత దూషణలకు సభలో అవకాశం లేదు సభలో ఉన్న ప్రతీ సభ్యుడు సభా మర్యాదను కాపాడాలి వ్యక్తిగత దూషణలు చేసిన అంశాలపై పరిశీలన చేస్తాం ‘ఖబడ్దార్’పై జగదీష్ రెడ్డి అభ్యంతరం బీఆర్ఎస్ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. తన జోలికి రావొద్దని, ఖబడ్దార్ అని హెచ్చరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సభలో ఖబర్దార్ లాంటి పదాలు వాడొచ్చా? అని స్పీకర్‌కు జగదీష్‌రెడ్డి ప్రశ్న ఖబర్దార్ అని స్పీకర్ చైర్ ను అన్నారా? మమ్మల్ని అన్నారా? అని నిలదీత నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు విమర్శలు చేయలేదు నాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యాఖ్యలను తొలగించాలి ఖబడ్దార్ అన్నందుకు ఆ సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పీకర్ చెప్పాలి శాసనసభలో రగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో బెదిరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు ఖబడ్దార్..: రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే నేను పార్టీలు మారిన టైంలో పదవికి రాజీనామా చేశా దొంగల లెక్క పదవుల కోసం పార్టీలు నేను మారలేదు నా జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ ఏమనుకుంటున్నారో? సభామర్యాదను కాపాడండి: పోచారం రిక్వెస్ట్ సభా మర్యాదను కాపాడుకుందాం ఒకరి పైన ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దు సభలోకి కొత్త సభ్యులు చాలామంది వచ్చారు మాజీ స్పీకర్‌గా.. సభ ఉందాగా నడపాలని కోరుకుంటున్నా వ్యక్తిగత విమర్శలు ఏమైనా ఉంటే బయట విమర్శలు చేసుకోవాలి సభకు సహకరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం జగదీష్‌రెడ్డికి రాజగోపాల్ చురకలు అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్‌తో మతిభ్రమించింది అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు పార్టీలు మారామని మా బ్రదర్స్ ని విమర్శిస్తున్న వాళ్లకు.. వాళ్ల అధినేత కేసిఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా? నాలుగు రూపాయలకు దొరికే పవర్ ని.. ఆరు రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసింది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఆలోచన చేస్తే జాలేస్తోంది కిరసనాయిలు దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రూ. 1000 కోట్ల హైదరాబాద్ బంగ్లా ఎలా సంపాదించారు ? నేను పార్టీలు మారింది ప్రజల కోసమే.. పదవుల కోసమో, పైసల కోసమో కాదు మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడి ధైర్యం ఉందా? మాజీ ముఖ్యమంత్రి ముందు ధైర్యంగా మాట్లాడలేదు కాబట్టే రాష్ట్రం అప్పుల పాలు అయింది ఇలాగే ఉంటా.. మీలాగా కాదు: మాజీమంత్రి జగదీష్ రెడ్డి నన్ను ఎంత రెచ్చగొట్టినా వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను సభలోనే కాదు బయట కూడా వ్యక్తిగత ఆరోపణలు నేను చేయను అలవాటు నాకు లేదు అవసరాల కోసం.. పదవుల కోసం నేను విమర్శలు ఆరోపణలు చేయను పార్టీలు మారే క్యారెక్టర్ నాది కాదు కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన చరిత్ర ఆ సోదరులదిది(కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి..) విద్యుత్ పై విడుదల చేసిన శ్వేత పత్రం తప్పులు తడకగా ఉంది కేసీఆర్ ఇచ్చినట్లే 24 గంటల కరెంటు ఇస్తారా లేదా సభ సాక్షిగా క్లారిటీ ఇవ్వాలి మీటర్లు పెట్టకుండా కరెంటు ఇస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలి మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉచిత విద్యుత్ ఇస్తారా లేదా? అనే దానిపై సభాముఖంగా ప్రకటన చేయాలి భవిష్యత్తులో అప్పులు చేయకుండా విద్యుత్ ఇస్తారా లేదా అని కూడా చెప్పాలి రాజగోపాల్ మైక్ అందుకోవడంతో రగడ తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్ఫకాలిక చర్చ మంత్రులు మాట్లాడుతుండగా.. మైక్ అందుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు: రాజగోపాల్ రెడ్డి విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసినందుకు సీఎంకు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి విచారణలో అన్ని బయటకు వస్తాయి: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఎలా అవకాశం ఇస్తారంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో భారీ అవినీతి జరిగింది విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గతంలో పవర్ లేని పవర్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన విద్యుత్ మంత్రి కాదు యాదాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ విచారణలో అన్నీ వెలుగు చూస్తాయి ఇదంతా ఆన్ రికార్డు చెబుతున్నా మాజీ అధికారి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయం నేనూ సిద్ధం: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అభ్యంతరం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భరించలేకపోతోంది కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలపై ధర్నాలు జరిగాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు రైతుల గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదు.. వాళ్ల వైపు లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లు పెట్టుబడి దారుల వైపు ఉన్నారు కేసీఆర్ రైతుల పక్షపాతి విద్యుత్ రంగంపై ఎలాంటి విచారణ అయినా జరిపించుకోండి.. అందుకు నేను సిద్ధం ఈఆర్సీ రూల్స్ ప్రకారమే Electricity Regulatory Commission విద్యుత్‌ను కొనుగోలు చేశాం విద్యుత్ కొనుగోళ్లపై కాగ్ నివేదికలు కూడా ఉన్నాయి విద్యుత్‌పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు విద్యుత్ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం జగదీష్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం విద్యుత్‌పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నాం కరెంట్ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ప్రశ్నించిన మమ్మల్ని నాడు మార్షల్స్ చేత బయటకు గెంటించారు ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు రెండేళ్లలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టింది భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లు పిలవలేదు బ్యాక్ డోర్ నుంచి టెండర్లు అంటగట్టారు మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తాం ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తున్నాం రెండో అంశంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ చేర్చాం మూడో అంశంగా యాద్రాద్రి పవర్‌ప్లాంట్ పైనా విచారణ జరిపిస్తాం మొత్తం వాస్తవాలకు బయటకు తీయాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ సవాల్ మేరకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశం అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తాం మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేలుతాయి ప్రభుత్వం రంగంలో విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ సాధించింది గుండు సున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెప్తున్నారు సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు? కోమటిరెడ్డి లాక్‌బుక్ చూపిస్తే.. బుక్‌లు మాయం చేశారు ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు? విద్యుత్ రంగంపై అవాస్తవ శ్వేతపత్రం విడుదల చేశారు: జగదీష్‌రెడ్డి బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌రంగంలో ఆస్తులు పెరిగాయి: జగదీష్‌రెడ్డి కోమటిరెడ్డి ఆరోపణలపై విచారణ జరిపించాలి :జగదీష్‌రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి :జగదీష్‌రెడ్డి జగదీష్‌కు భట్టి కౌంటర్ విద్యుత్ రంగంపై స్వల్ఫకాలిక చర్చలో విమర్శల పర్వం తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డిస్కంలకు బకాయిలకు భారంగా ఉన్నాయి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు గత ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వలేదు గొంతు తెరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోవు ఆరోపణలపై మాజీ మంత్రి స్పందన.. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలి విచారణ జరిపించాలని సీఎంను కోరుతున్నా జగదీష్‌రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇచ్చిందన్నది 9 గంల కరెంట్ కూడా ఇవ్వలేదు విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగింది టెండర్ లేకుండా పవర్‌ప్లాంట్ పెట్టారు యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో రూ.20 వేల కోట్ల స్కామ్ జరిగింది ఇందులో జగదీష్‌రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నాడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్‌దే దొంగలు, అవినీతి పరులు అనే వరకు భుజాలు తడుముకుంటున్నారు బీఆర్ఎస్ నేతలకు టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో అప్పటి సీఎండీ ప్రభాకర్‌రావు దోచిపెట్టారు ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తాం.. అలా వదిలేస్తామా? విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఆరోజుల్లో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు నాడు ఊళ్లలోకి వెళ్తే విద్యుత్ అధికారుల్ని నిర్బంధించే పరిస్థితులు ఉండేవి మన రాష్ట్రంలోనే అప్పులు చేసినట్లు మాట్లాడుతున్నారు పరిశ్రమలకు విద్యుత్ హాలిడే - జనరేటర్ లేని దుకాణాలు ఆనాడు లేవు విద్యుత్ బిల్లు వసూలుకు వెళ్లిన అధికారులను పంచాయితీ ఆఫీసు లో బంధించే వాళ్ళు ఆనాడు విద్యుత్ కష్టాలకు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే బాధ్యులు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం మేము 50వేల కోట్ల అప్పులు తీర్చాం అప్పు కోసం ఆలోచిస్తే.. ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉండేది కాదు తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం చెయ్యలేం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే మనకు బతుకు తెలంగాణ వచ్చేనాటి పరిస్థితి ఏంటో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు 2014లో ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు సహకారం ఇవ్వలేదు సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు రావాల్సిన వాట ఇవ్వడానికి అడ్డుకున్నారు ఆనాడు కేంద్రం పలుకుబడి ఉపయోగించి ఆనాటి సీఎం ఇబ్బంది పెట్టారు తెలంగాణకు ఎవరైనా విద్యుత్ అమ్మడానికి వచ్చే ప్రైవేట్ వ్యక్తులను సైతం బెదిరించారు విద్యుత్ రంగంలో చేయాల్సిన అభివృద్ధి ఎక్కడా ఆగకుండా జరిగింది బీఆర్ఎస్ ఇళ్ల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్: మంత్రి శ్రీధర్‌బాబు 2014కి ముందు కరెంటే లేనట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు కరెంట్‌ను బీఆర్ఎస్ కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు నిన్న నీళ్ల గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు బీఆర్ఎస్ ఇళ్ల నేతలకు కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ భట్టి ప్రసంగంపై మాజీ మంత్రి స్పందన తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం వైట్ పేపర్‌పై స్పందించిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: జగదీష్‌రెడ్డి తెచ్చిన అప్పులతో ఆస్తులు క్రియేట్ చేశాం 👉: విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం.. పూర్తి కాపీ ప్రభుత్వానికి భారంగా విద్యుత్ బకాయిలు: డిప్యూటీ సీఎం భట్టి ఏ రంగానికైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరం - డిప్యూటీ సీఎం రాష్ట్రం ఏర్పాటు నాటికి 24వందల మెగావాట్ల ఉత్పత్తి ఉండే. రాష్ట్రం ఏర్పడే నాటికే ఆనాటి పాలకుల ముందు చూపుతో మరో 2500 ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం విద్యుత్ శాఖ ఆందోళన కరంగా ఉంది రూ.81.516 కోట్లు ప్రస్తుతం అప్పులు ఉన్నాయి రూ.36వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.. మరో 28వేల కోట్లు చెల్లించాల్సి ఉంది డిస్కమ్ లకు చెల్లించాల్సిన 14వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల మరింత భారం పడింది విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత మా పై ఉంది ఆర్థిక ఇబ్బందులు శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వివరిస్తున్నాము విద్యుత్ బకాయిలు ప్రభుత్వానికి భారంగా ఉన్నాయి బీఆర్ఎస్ వచ్చిన తరువాతే రాష్ట్రంలో బల్బ్ వెలిగింది అన్నట్లు గత పాలకులు మాట్లాడారు బీఆర్ఎస్ వచ్చిన తరువాతే ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటనలు చేశారు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పాలనలో కొనసాగించాల్సిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదు 2014 వరకు జెన్కోలకు 10వేల లోపు అప్పులు ఉంటే.. BRS పదేళ్లలో 81వేలకు తీసుకెళ్లారు సరైన దూరదృష్టి లేకపోవడం వల్ల డిస్కంలు ఇబ్బందుల్లో పడ్డాయి రోజూవారీ మనుగడ కోసం డిస్కంలు అవికాని అప్పులు చేయాల్సి వస్తోంది తెలంగాణ కరెంట్ లెక్కలు తెలంగాణ శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: డిప్యూటీ సీఎం భట్టి గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది: డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో రూ. 81వేల కోట్ల అప్పు ఉంది: డిప్యూటీ సీఎం భట్టి డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.28,842 కోట్లు డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిల్ని గత ప్రభుత్వం చెల్లించలేదు సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలే రూ. 14 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది గత ప్రభుత్వం చేసిన అప్పులు మరింత ఆందోళన పరిస్థితికి దిగజార్చాయి విద్యుత్ రంగంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: భట్టి తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి కాసేపట్లో ప్రారంభం కానున్న శాసనసభ తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ సీఎం లేకుండానే కొనసాగనున్న సభ? రేపు కూడా సభ నిర్వహణ? శాసనసభ సమావేశాల పొడిగింపు? రేపు.. డిసెంబర్ 22వ తేదీన కూడా సభ నిర్వహించే యోచనలో ప్రభుత్వం నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో రేవంత్‌రెడ్డి సర్కార్ సీఎం రేవంత్ ఇంట్లో మంత్రి ఉత్తమ్ భేటీ.. హాజరైన సీఎస్ తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం: మాజీ మంత్రి హరీష్‌రావు ఇందులో అప్పులు రూ.6,71,757 కోట్లు అని చూపించారు... అది రూ.5 లక్షల కోట్లే గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఇది తెలంగాణను దివాలా రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే ప్రమాదకరంగా పర్యవసానాలు విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రావు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ సవాల్ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పునాదులు వేసిందని స్పష్టీకరణ వాడీ వేఢీగా తెలంగాణ శాసన సభ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇరు పార్టీల నేతల విమర్శలు-ప్రతివిమర్శలతో దద్దరిల్లిన సభ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సర్కారు వెల్లడి గత పదేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై.. 13 అంశాలతో 42 పేజీల నివేదిక సభ ముందుకు.. రిజర్వు బ్యాంకు, కాగ్ నివేదికలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలతో రూపకల్పన 1956 నుంచి 2023 వరకు అంశాల వారీగా 22 టేబుళ్లతో వివరణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే ప్రధాన ఉద్దేశమన్న సర్కారు నేడు ఆరవరోజు కొనసాగనున్న సభ హాట్‌హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలతో వేడెక్కిన సభ అధికార-ప్రతిపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం నేడు ఆరో రోజు కొనసాగనున్న సభ శ్వేత పత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం ఆపై లఘు చర్చ -
రాష్ట్రాన్ని దివాలా తీయించారు
సాక్షి, హైదరాబాద్: తక్కువ బడ్జెట్ మొత్తాలతో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఆస్తులు సాధించి పెడితే, లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా రాష్ట్రాన్ని దివాలా తీయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రోజువారీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు ఏ రోజుకారోజు అప్పు తెచ్చి రోజులు గడిపినట్టు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలకు రిజర్వ్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) తెచ్చి నడిపే దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులను కడితే, కేసీఆర్ ప్రభుత్వం కట్టకకట్టక కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనులతో ఎందుకూ పనికి రాకుండా పోయిందని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డి పథకం పూర్తి చేయలేకపోయిందని, కానీ గొప్ప ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు జనాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిగిన లఘు చర్చకు భట్టి జవాబిచ్చారు. అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దారుణంగా మార్చింది. అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేసే దుస్థితికి తెచ్చింది. ప్రభుత్వ రుణ భారం 34 శాతానికి పెరిగింది. ఈ భారాన్ని ఎవరు మోయాలి? ఆస్తులు సృష్టించామని చెప్తున్నారు. మరి ఆదాయం ఎందుకు రావటం లేదు? జీతాలు కూడా ఎందుకు సకాలంలో ఇవ్వలేకపోయారు? ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం..’ అని చెప్పారు. ఎలా చేసినా ప్రభుత్వ అప్పులే ‘బహిరంగ మార్కెట్లో కంటే అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారు. హరీశ్‌రావుకు అన్నీ తెలుసు. ఇంతకాలం స్వేచ్ఛ లేనందున మాట్లాడలేదు. ఇప్పుడైనా వాస్తవాలను అంగీకరించి మా వాదనతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నా. తెలంగాణ వచ్చాక మేం పాలనలో ఉండి ఉంటే భూతల స్వర్గం చేసేవాళ్లం. కానీ వీళ్లు అప్పుల కుప్ప చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో ప్రభుత్వం నేరుగా రుణాలు తెచ్చినా, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పూచీకత్తుతో, పూచీకత్తు లేకుండా అప్పులు తెచ్చినా.. చివరకు భారం పడేది ప్రభుత్వంపైనే. ఆ అప్పులన్నీ ప్రభుత్వ అప్పులే. ఇలా 2014 నుంచి 2023 వరకు చేసిన మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు. ప్రతి కుటుంబం నెత్తిపై రూ.7 కోట్ల అప్పు తీసుకున్నారు..’ అని భట్టి ధ్వజమెత్తారు. ఆదాయం పెరిగితే ఓడీ ఎందుకు? ‘రాష్ట్ర ఆదాయం, జీఎస్డీపీ బాగా పెరిగితే ఓడీ ఎందుకు తీసుకున్నారు? ఓడీ అంటే ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని లోతుగా చెప్పట్లేదు. ఓడీ అంటే దివాలా తీయడం. బ్యాంక్రప్ట్ కావడం. రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఓడీ తీసుకోబోమనే మాట ఇవ్వమంటే ఎలా? అయితే మీలాగా మాత్రం మేం చేయం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలు ఎక్కిస్తాం. ఆర్థిక క్రమశిక్షణతో సంపదను సృష్టించి అభివృద్ధి పనులు చేపడతాం..’ అని స్పష్టం చేశారు. మేం మీలా చేస్తామని ఎలా అనుకున్నారు? ‘తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా ప్రాంత అధికారులతో శ్వేతపత్రం రూపొందించా రని బీఆర్ఎస్ సభ్యులు అనటం వింతగా ఉంది. మాకు తెలంగాణ ప్రజలు, అధికారులపై నమ్మకముంది. గత ప్రభుత్వం పదేళ్ల పాటు పని చేయించుకున్న అధికారులతోనే శ్వేతపత్రం తయారు చేయించాం. కానీ మీకు తెలంగాణ అధికారులపై నమ్మకం లేకనే కదా.. ఏపీ కేడర్ అధికారులను పిలిపించుకుని సీఎస్‌గా, డీజీపీగా నియమించుకుంది. మేము కూడా మీలాగే చేస్తామని ఎలా అనుకున్నారు?’ అంటూ భట్టి ఎద్దేవా చేశారు. జనం ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు.. ‘మేం ప్రతిపక్షాలను ప్రత్యర్థులుగానే చూస్తాం తప్ప శత్రువుగా చూడం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలపాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. అన్ని విషయాలు చెప్తే రాష్ట్ర పరపతిపై ప్రభావం పడుతుందని చెప్పటం లేదు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం. మోయలేని అప్పు భారం ఉన్నా, జనం ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకు సాగుతాం..’ అని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు శాసనసభ లేనప్పుడు ఎవరైనా ప్రజావాణికి రావ చ్చని, తమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భట్టి చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో చెప్పలేదని, ఉద్యోగాలిస్తామని చెప్పా మన్నారు. కాళేశ్వరంను పనికిరాకుండా చేశారు ‘కాళేశ్వరం పేరుతో రూ.97 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఆ ప్రాజెక్టును గొప్పగా చూపి పనికిరాకుండా చేశారు. గొప్పలకు పో యిన ప్రాజెక్టు మిషన్ భగీరథ. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే ఊరి జనం మంచి నీళ్లు తాగారు అన్నట్టు చెప్పుకొన్నారు. కానీ నా పాదయాత్రలోనే దాని అసలు డొల్లతనం స్పష్టమైంది. చాలా ప్రాంతాల్లో జనం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తవ్వించిన మంచినీటి బావుల నుంచే నీళ్లు తోడుకుని తాగుతున్నారు. అందుకే ఈ పథకంపై విచారణ జరపాలని కోరుకుంటున్నా..’ అని డిప్యూటీ సీఎం అన్నారు. -
దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉందనేది ప్రజల ముందు పెట్టేందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేవని పేర్కొన్నారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక స్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వెల్లడించిన గణాంకాలనే శ్వేతపత్రంలో వివరించామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఖజానాలో నిధులు 303 రోజులు ఉండేవని, 2022–23 ఆర్థిక సంత్సరానికి వచ్చేసరికి కేవలం 38 రోజులే నిధులు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రతిరోజు అడుక్కునే స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రంపై విపక్షాల అభ్యంతరాలను రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మా ప్రభుత్వం తొలిరోజు నుంచే ప్రజాపాలన సాగించేలా చర్యలు చేపట్టింది. తెలంగాణను బలమైన రాష్ట్రంగా ప్రపంచ చరిత్రలో నిలుపుతాం. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలను అందిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలవడం కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నేను స్వయంగా ఫోన్ చేశా. రాష్ట్ర సంక్షేమం కోసం ఎలాంటి ప్రయత్నాన్ని వృథా కానివ్వం. ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చారు తెలంగాణ రావడానికి పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు కష్టపడి సంపాదించి పెట్టిన ఆస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం తనఖాపెట్టి అప్పులు తెచ్చింది. ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన జూబ్లీ బస్టాండ్, పలు ఇతర బస్టాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం తనఖాపెట్టి రూ.2,886 కోట్లు అప్పు తెచ్చింది. టీఎస్ జెన్కో, ఎన్పీడీసీఎల్ సహా ఇతర కరెంటు సంస్థల ఆస్తులపై రూ.4,972 కోట్లు అప్పు తెచ్చారు. మేం కష్టపడి ఔటర్ రింగురోడ్డును నిర్మిస్తే రూ.7,300 కోట్లకు తెగనమ్ముకుని బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకేసారి కోసుకుతిన్నారు. గత పదేళ్లలో రూ.13.72 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంతా చేసీ సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. పేద కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా ఉంటానన్న కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. పైగా మాజీ మంత్రి హరీశ్‌రావు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారు. వ్యాపారం చేస్తామని అప్పులు చేశారు నీటిపారుదల శాఖ మంత్రులుగా కేసీఆర్, హరీశ్‌రావు ఇద్దరే తొమ్మిదిన్నరేళ్లు చూసుకున్నారు. కాళేశ్వరాన్ని రూ.80 వేల కోట్లతో కట్టామనడం అబద్ధం. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు రూ.97,449 కోట్లు మంజూరైతే.. విడుదలైంది రూ.79,287 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఖర్చు చేసింది. దీనిపై సమగ్ర వివరాలను ఇస్తాం. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణా లు కలిపితే అసలు లెక్క తేలుతుంది. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని.. ఏటా రూ. 5,199 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి అప్పులు తెచ్చారు. మిషన్ భగీరథతోనూ ఏటా రూ.5,706 కోట్లు ఆదాయం వస్తుందని.. ఇలా నీటి ద్వారా రూ.10,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని బ్యాంకులను తప్పుదోవ పట్టించి రుణాలు తీసుకొచ్చారు. వాటిపై మాజీ ఆర్థికమంత్రి హరీశ్‌రావు సంతకాలు చేశారు. అత్యధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టంగా తేల్చింది. ఇంతా చేసి ఇంకా హరీశ్‌రావు మంత్రి అన్నట్టుగానే భ్రమల్లో ఉండి అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తున్నారు. తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పాల్సింది పోయి దబాయిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? గ్రామాల్లో నల్లాలు లేవా? నీళ్ల ట్యాంకులు లేవా? బీఆర్ఎస్ వచ్చాకే మంచినీళ్లు తాగినట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తండ్రిని కూలదోసి రాజ్యాన్ని లాక్కునే ప్రయత్నాలను చరిత్రలో చాలా చూశాం. ‘హైదరాబాద్’పై అఖిలపక్షం హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఈ మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తాం. 119 మంది ఎమ్మెల్యే లు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు అసెంబ్లీలో అడుగుపెట్టని సీపీఎం, ఇతర పారీ్టలను అఖిలపక్ష సమావేశాలకు పిలుస్తాం.’’అని రేవంత్ పేర్కొన్నారు. అప్పులెందుకు చేశారు.. దేనికి ఖర్చు పెట్టారు?: కూనంనేని కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో సాగిన పాలన ఇప్పుడు రూ.6.7లక్షల కోట్ల అప్పులకు చేరడం ఆలోచించాల్సిన విషయమని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు అవసరాలకు అప్పులు తీసుకున్నా.. ఆ నిధులు దేనికి ఖర్చు చేశారనే లెక్కలు ప్రజలకు చెప్పాలని, జవాబుదారీగా పాలన సాగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు. సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు! మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ‘‘శాసనసభను తప్పుదోవ పట్టించేలా సభ్యులెవరైనా మాట్లాడితే, ఆధారాలు లేకుండా ఉన్నట్టు చిత్రీకరిస్తే.. సభలో తప్పుడు సమాచారాన్ని ఇస్తే కఠిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో శాసనసభ వ్యవహారాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని ఒకసారి పరిశీలించాలి’’అని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. తన ప్రసంగం సందర్భంగా రేవంత్ రెండు సార్లు హరీశ్‌రావును ఆర్థికమంత్రి అని ప్రస్తావించారు. తర్వాత మాజీ ఆర్థిక మంత్రి అని సరిదిద్దుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని హరీశ్‌రావు దొంగలెక్కలు ఏవో చెప్పుకుంటారని, ఆయన గెలిచింది ఐదుసార్లేనని విమర్శించారు. -
శ్వేత పత్రాలా హామీల ఎగవేత పత్రాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా, అంకెల గారడీలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే, దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ‘శ్వేతపత్రంలో అప్పులు రూ. 6,71,757 కోట్లు అని చూపించినా..అందులో స్పెషల్ పర్పస్ వెహికిల్స్ కింద తీసుకున్న మొత్తం రూ.1,54,876 కోట్లు వారే భరిస్తారని మీరే పేర్కొన్నారు. ఈ లెక్కన అప్పు రూ.5,16,881 కోట్లు అయితే.. డిసెంబర్ నుంచి మార్చి వరకు తీసుకునే రుణాలు రూ.16 వేల కోట్లు కూడా దీంట్లో కలిపారు. అవి తీసేస్తే వాస్తవ అప్పు రూ.5 లక్షల కోట్లు మాత్రమే..’అని హరీశ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఈ శ్వేతపత్రంలో కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బ తింటుందని, పెట్టుబడులు రాకుండా పోతాయని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. శ్వేతపత్రాలా? హామీల ఎగవేత పత్రాలా? ‘దివాలా.. దివాలా అని ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు ఆగి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం. శ్వేతపత్రంలో ప్రగతి కోణం కన్నా, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పులు, దివాలా, బీమారు రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్నవి శ్వేతపత్రాలా? లేక మీరిచ్చిన హామీల ఎగవేత పత్రాలా? అనే అనుమానం కలుగుతోంది..’అని హరీశ్ అన్నారు. సీఎం గురుశిష్యులు వండి వార్చారు ‘సీఎం రేవంత్‌రెడ్డి పాత గురుశిష్యులు ఈ శ్వేతపత్రాన్ని వండి వార్చారు. సస్పెండ్ అయిన ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారు. (దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు అన్నారు) తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా రిటైర్డ్ అధికారులతో నివేదిక తయారు చేయించారు. అప్పు, జీఎస్డీపీ నిష్పత్తిని చూపకుండా అప్పు రెవెన్యూ రాబడని చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయంలో తెలంగాణ వాటా కింద 1956–57 నుంచి 2013–14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలి..’అని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులన్నింటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ‘మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టున్నింటిపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుంది. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశాం..’అని తెలిపారు. ఆస్తులు పెరిగిన విషయం దాచిపెడుతున్నారు ‘విద్యుత్ సంస్థలు తీసుకున్న రుణాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ఖర్చు చేయడం జరిగింది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంస్థలు తిరిగి ఆ రుణాలను చెల్లిస్తాయి. (మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి రైతులు, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనేదేనా గత ప్రభుత్వ ఉద్దేశం అని నిలదీశారు) ఎంతసేపు అప్పులు అప్పులు అని నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు. నాణానికి రెండో వైపు ఆస్తులు పెరిగాయి. ఈ విషయం దాచిపెడుతున్నారు..’అంటూ హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టించి ఆస్తులు కూడబెట్టాం ‘గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనల పరిధి దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించి, పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది. సంపద సృష్టించి ఆస్తులు కూడబెట్టింది. 200 టీఎంసీల నీరున్న రిజర్వాయర్లు నిర్మించింది. (ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకొని సచివాలయం, ప్రగతి భవన్, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు) విద్యుత్ సంస్కరణల పేరిట బోర్లు, బావులకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అదనంగా 0.5 శాతం రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. కానీ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ దానికి అంగీకరించలేదు. ఒకవేళ ఆ నిబంధనకు అంగీకరించి ఉంటే రూ.35 వేల కోట్లు రాష్ట్రానికి అదనంగా వచ్చేవి. (ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మోటార్లకు బిల్లులు వసూలు చేసే నిబంధన విద్యుత్ సంస్కరణల్లో లేదన్నారు. దీంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది) వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగా చిత్రీకరించి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని మాత్రమే ఇస్తుంది..’అని హరీశ్‌రావు చెప్పారు. బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ ‘రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకుని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింద నుంచి తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. కేంద్రం నుంచి రావలసిన రూ.లక్ష కోట్లు రాకపోవడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగింది. ఎస్పీవీలను అప్పులుగా తప్పుగా చూపించారు. ఏ ప్రభుత్వం వద్ద డబ్బులు కట్టల రూపంలో బీరువాల్లో ఉండవు. (మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని.. బంగారు తెలంగాణ అంటూ గోబెల్స్ ప్రచారం చేశారని, ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని అన్నారు) కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలవు..’అని స్పష్టం చేశారు. ఆస్తులు పెంచాం.. అభివృద్ధి చేశాం ♦ ‘పదేళ్లలో తెలంగాణ ఆస్తులు’ పేరిట నివేదిక విడుదల చేసిన బీఆర్ఎస్ ♦కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి సమాధానమని ప్రకటన ♦తప్పుడు లెక్కలతో మోసం చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన శ్వేతపత్రానికి సమాధానంగా భారత్ రాష్ట్ర సమితి ‘పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు’అంటూ 51 పేజీల నివేదికను విడుదల చేసింది. రంగాల వారీగా పదేళ్ల పాలనలో తాము సృష్టించిన ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెంచడంతో పాటు రూ.1649 కోట్లతో జిల్లా కలెక్టరేట్ భవనాలు నిర్మించామని పేర్కొంది. 2014కు ముందు ప్రస్తుతం రంగాల వారీగా సృష్టించిన మౌలిక వసతుల వివరాలను వెల్లడించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్య పెంపు, మౌలిక వసతుల కల్పన, రోడ్లు, చెత్త సేకరణ వాహనాలు, గురుకులాల సంఖ్య పెంపు వంటి అంశాలను గణాంకాలతో సహా ప్రస్తావించింది. విద్య, పారిశ్రామిక పెట్టుబడులు, హరితహారంతో పాటు ఆధ్యాత్మిక సంపద పెంచామంటూ ఆ నివేదికలో వివరాలను పొందుపరిచింది. కొత్త ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు ఆరోగ్య శాఖ ద్వారా పెరిగిన బెడ్ల సంఖ్య, కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు తదితరాలను వివరంగా పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నీటిపారుదల రంగంలో సాగించిన నిర్మాణాలు, వాటికి అయిన ఖ ర్చును నివేదికలో ప్రకటించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సహా పదేళ్ల కాలంలో చేపట్టిన అనేక పనులు, వాటికి వెచ్చించిన మొత్తాన్ని గణాంకాలతో సహా వివరించింది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా పని చేతకాక అప్పుల పేరు చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. -
ప్రాజెక్టులపై విచారణ..దోషులకు శిక్ష ఖాయం
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించి న ప్రాజెక్టుల వల్ల కొత్త ఆయకట్టు ఎంత పెరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే వచ్చిందన్నారు. దీనిపై తప్పనిసరిగా విచారణ జరుగుతుందని, దోషులను శిక్షిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు, రూ.7,500 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు జీరో అని అన్నారు. మేడిగడ్డలో జరిగింది నేరపూరిత నిర్లక్ష్యమని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 21న మేడిగడ్డలోని ఏడవ బ్లాక్‌లో ఐదు అడుగుల మేర కుంగితే సీరియస్‌గా విచారణ జరగలేదన్నారు. ఇప్పటి వరకు నాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదని , నిర్మాణ సంస్థ, అధికారులు అందరూ అప్పటి సీఎం డిజైనింగ్ ప్రకారమే నిర్మించామని చేతులెత్తేశారన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి, తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆయన ధ్వజమెత్తారు. హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు అబద్ధాలు చెపుతున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. రైతుల నుంచి బిల్లులు వసూలు చేసే అవకాశమే లేదని, తాను పార్లమెంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున తనకు అవగాహన ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ పనితీరు లోపభూయిష్టంగా ఉందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. బియ్యం పంపిణీ, ధాన్యం సేకరణకే పరిమితమైన పౌరసరఫరాల శాఖలో 2018–19 నుంచి ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదన్నారు. గత పదేళ్లుగా కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి అదనంగా ఒక కిలో బియ్యం మాత్రమే ఇస్తున్నప్పటికీ, రూ. 56వేల కోట్ల అప్పు చేశారని తెలిపారు. ఇవి కాకుండా రూ. 11,500 కోట్ల నష్టాలు ఉన్నాయని వివరించారు. ఈ మొత్తాలకు సంవత్సరానికి వడ్డీ కిందనే రూ. 3వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మిల్లర్ల వద్ద రూ. 22వేల కోట్ల విలువైన ధాన్యాన్ని నిల్వ చేశారని, అందులో ఎంత మేర ఫిజికల్‌గా ఉందో లెక్కలు చూడాలన్నారు. పేదలకు పంపిణీ చేసే బియ్యంలో కూడా నాణ్యత లేదని, 70 శాతం కార్డుదారులు ఆ బియ్యాన్ని తినడం లేదన్నారు. రూ.39 కిలో చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేస్తూ పేదలకు పంపిణీ చేస్తుంటే క్వాలిటీ బాగోలేక ఆ బియ్యం నిరుపయోగం అవుతున్నాయన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బియ్యం కావాలని కోరినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. -
తెలంగాణ లాభదాయక రాష్ట్రమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ చేసి చూపుతూ తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేయొద్దని ఎంఐఎం సభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడక లెక్కలు చూపించిందని విమర్శించారు. శ్వేతపత్రంపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను అవమానించే విధంగా వ్యవహరించవద్దని హితవు చెప్పారు. తెలంగాణ ముమ్మాటికీ లాభదాయక రాష్ట్రమేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన తరువాత బడ్జెట్‌కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాలపై శ్వేతపత్రంలో చూపిన లెక్కల్లో తేడాలను ఉదహరించారు. శ్వేతపత్రంలో ఉన్న లెక్కలకు, ఆర్బీఐ, కాగ్ నివేదికల్లో పొందుపరిచిన లెక్కలకు పొంతనే లేదన్నారు. అలాగైతే కర్ణాటకలో కూడా పొంతనలేదు రాష్ట్ర బడ్జెట్ లెక్కలతో పాటు కర్ణాటక బడ్జెట్ లెక్కల్లో కూడా శ్వేతపత్రంలోని లెక్కలకు, కాగ్ నివేదిక లెక్కలకు కూడా పొంతన లేదని అక్బరుద్దీన్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందాయని వివరించారు. అప్పులు పెరిగినా.. గణనీయంగా అభివృద్ధి జరిగిందన్నారు. చివరికి ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు సంబంధించి కూడా శ్వేతపత్రానికి, కాగ్ నివేదికకు చాలా తేడా ఉందన్నారు. ఈ రెండింటితో పాటు ఆర్బీఐ నివేదికల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు అధికార పార్టీ మన్ననల కోసం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై విచారణ జరిపి, అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. ఆడిట్ పూర్తయితేనే కాగ్ రిపోర్టులో సరైన లెక్కలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పగా పదేళ్ల క్రితం నాటి ఆదాయ వ్యయాల ఆడిట్ కూడా పూర్తి కాలేదా అని అక్బరుద్దీన్ నిలదీశారు. కేంద్రం కూడా అప్పులు చేసిందన్న అక్బరుద్దీన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 244 శాతం పెరిగాయని అక్బరుద్దీన్ వివ రించారు. పదేళ్ల క్రితం రూ. 44,25,347 కోట్లు ఉన్న అప్పులు రూ. 1,52, 53,915 కోట్లకు పెరిగాయని చెప్పారు. దీన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితు ల్లో కూడా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఆగలేదన్నారు. ఈ సందర్భంగా వార్షిక వృద్ధి రేటు ను, ఆర్థిక వృద్ధి రేటును వివరించారు. -
ఏం చేసినా మీకు ఫలితం లేదు.. X పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: ‘మీ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్‌కే ప్రాధాన్యం.. మీరెంత కష్టపడ్డా ఫలితం లేదు’... అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ‘మీ పార్టీ మాదిరి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు’అంటూ బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఒకరిపై ఒకరు చేసుకున్న రాజకీయ విమర్శలు బుధవారం శాసనసభలో దుమారం రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా వాతావరణం కొద్ది సేపు వేడెక్కింది. గత బీఆర్ఎస్ పాలనపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై సభ చర్చ చేపట్టింది. హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇది శ్వేతపత్రం కాదు.. కోత పత్రమంటూ ఎద్దేవా చేశారు. ఈ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘హరీశ్‌రావు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటారు. మిమ్మల్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు’అని వ్యాఖ్యానించారు. హరీశ్‌కు మేనమామ పోలికలు.. అందుకే అబద్ధాలు: రాజగోపాల్‌రెడ్డి ఇదే క్రమంలో ‘ఆయనకు మేనమామ పోలికలు వ చ్చాయి. కేసీఆర్ చెప్పినట్టే అబద్ధాలు చెబుతున్నా రు’అని కోమటిరెడ్డి అనడంతో బీఆర్ఎస్ పక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గలేదు. సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడికి దిగడం సరికాదు... స్పీకర్‌ను బెదిరించడం ఏమిటి?’అని ఆక్షేపించారు. ‘పదేళ్లు విపక్షంలో కూర్చున్నాం... రెండు రోజులకే మీకు అసహనం వస్తే ఎలా’అంటూ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చె ప్పేందుకు హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. రూ. 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కునే ఖర్మ పట్టలేదు: హరీశ్ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించిన హరీశ్‌రావు ‘పీసీసీ పదవిని రూ. 50 కోట్లకు కొనుక్కునే ఖర్మ మాకు పట్టలేదు. పదవి కొనుక్కున్నారనే మాట అన్నది కోమటి రెడ్డి బ్రదర్సే’అనడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఇరుపక్షాల వాగ్వాదంతో సభ మరింత వేడేక్కింది. హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టారు. లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తాను విత్‌డ్రా చేసుకుంటానని హరీశ్‌రా వు అన్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతున్న తరుణంలోనే హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బావ.. బామ్మర్దుల గురించి చెప్పాలా?: మంత్రి కోమటిరెడ్డి హరీశ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా పార్టీ ముందుకెళ్తోంది. మీకేం పనిలేదా? మీ పదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా మాపై విమర్శలేంటి?’అంటూ మండిపడ్డారు. హరీశ్‌ను ఉద్దేశిస్తూ ’మీ బావ... బామ్మర్దులు ఎంత కొట్టుకున్నారో చెప్పాలా...?’అంటూ ప్రశ్నించారు. ఇన్నేళ్లు దోచుకున్న విషయాలు బయటికొస్తున్నాయనే భయంతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. -
సభలో శ్వేతపత్రం ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన శ్వేతపత్రం అసెంబ్లీలో సెగలు రేపింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2014–15లో ప్రభుత్వ అప్పులు రూ.72,658 కోట్లు అయితే.. ఇప్పుడు రూ.6.71 లక్షల కోట్లకు చేరాయని పేర్కొంటూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, విపక్ష సభ్యుల నడుమ పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా మార్చిందని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తే.. ‘శ్వేతపత్రం’ అంతా తప్పులతడక అని, అప్పులతోపాటు ఆస్తులు పెరిగిన అంశాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిలదీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని అధికారపక్షం పేర్కొంటే.. ఈ సాకుతో గ్యారంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించి.. మూడు రోజుల విరామం అనంతరం బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభలో ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్ష నేతగా కూనంనేని సాంబశివరావులను గుర్తిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతి మరణం పట్ల శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వ వనరుల వినియోగం సక్రమంగా జరగలేదని, రోజూవారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలను ప్రజలకు తెలియపర్చడం కోసమే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని చెప్పారు. పరిశీలించేందుకు అరగంట సమయమిచ్చి.. స్వల్పకాలిక చర్చలో భట్టి అనంతరం ప్రసంగించాల్సిందిగా బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే 42 పేజీల నివేదికను ఇచ్చి, అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వకపోవడంపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా కొంత సమయం కావాలని కోరారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుమారు గంటా 15 నిమిషాల తర్వాత సభ తిరిగి సమావేశమైంది. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకే.. ప్రసంగాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణిలో తప్పులతడకగా రూపొందించారని మండిపడ్డారు. శ్వేతపత్రంలో ప్రగతికోణం లేదని, రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేయడంతోపాటు వాస్తవాల వక్రీకరణ కోసం ఉపయోగించుకునేలా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సస్పెండైన అధికారుల సాయంతో కాంగ్రెస్ సర్కారుకు అనుకూలంగా ఉండేలా శ్వేతపత్రం తయారు చేయించారని విరుచుకుపడ్డారు. అయితే హరీశ్ ప్రసంగిస్తున్న సమయంలో... సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తదితరులు జోక్యం చేసుకుని గత సర్కారుపై విమర్శలు చేశారు. దీనిపై హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శ్వేతపత్రంలో లోపాలు ఉన్నాయంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. ఈ తరహా చర్చల ద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయొద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ఆర్థిక స్థితిని సాకుగా చూపించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవాలని చూస్తే ఊరుకోబోమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పక్షాన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. భారీగా అప్పులు చేసినా.. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టలేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అప్పులు, తప్పులే అంటూ సీఎం విమర్శలు గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి ఆదాయం వస్తుందంటూ తప్పుడు నివేదికలతో అప్పులు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు జోక్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు అత్యధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. చివరిగా శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తర్వాత కూడా సీఎం రేవంత్ మరోసారి జోక్యం చేసుకుని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తొమ్మిది గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన ఈ చర్చను ముగిసినట్లు ప్రకటించిన స్పీకర్.. శాసనసభను గురువారంకు వాయిదా వేశారు. -
చేసిందంతా చేసి పరువు పోతుందంటున్నారు: భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్.. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కూలిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీలో భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ..‘ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి. ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు పెద్ద సవాల్ ఉంది. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదు. ఏ బడ్జెట్లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారు. కానీ, గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్లో గ్యాప్ ఉంది. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. కానీ, అంతా రివర్స్ అయ్యింది. ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారు. కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. ప్రాజెక్ట్ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది. ఓఆర్ఆర్ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. మీరు చేసిన దివాళా పని సెట్ చేసుకోవడం మాకు కష్టమే. మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. రాష్ట్రం ఇచ్చిందే మేము. తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారంటే అది లేదు. కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్‌ను పోగొట్టారు. రెండు ఫామ్‌హౌజ్‌లను మాత్రమే తెచ్చారు. మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం. గడిచిన పదేళ్లలో ఎప్పుడైనా ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నామా?’ అని అన్నారు. -
‘ఇంట్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోం.. ఏదైనా అసెంబ్లీలోనే..’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదన్నారు. ఇది ఎవరినీ నిందించే ప్రయత్నం కాదని క్లారిటీ ఇచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ప్రభుత్వం ఆశించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘పదేళ్లు రాష్ట్రం కోసం పనిచేసిన అధికారులను అవమానించేలా హరీష్‌రావు మాట్లాడారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే నిధులు ఖర్చు చేసిందా? లేదా అనేది కాగ్ చెబుతుంది. ఈ శ్వేతపత్రం మేం ఇచ్చిన వాగ్దానాలను ఎగవేసేందుకు కాదు. 2014-15లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్బీఐ వద్ద 303 రోజులు మిగులు నిధులు ఉండేవి. పదేళ్లలో అది 30 రోజులకు తగ్గింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లోన్లు పుట్టని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్బీఐ సమాచారం ఇస్తుంది. ఏ నిర్ణయమైనా సభలోనే.. ఇవి వాస్తవాలు.. వీటిని కప్పిపుచ్చి గొప్పలకు పోతే నష్టపోతాం. గత ప్రభుత్వ సమయంలో పనిచేసిన అధికారులే ఈ లెక్కలు ఇచ్చారు. ప్రతిపక్షంలోకి వెళ్లినందుకు వాళ్లకు దు:ఖం ఉండవచ్చు. అర్హులైన వారికి అవకాశాలను ఇస్తుందని చెప్పేందుకే మా ప్రయత్నం. తెలంగాణ అభివృద్ధి కోసం సిద్ధాంత విబేధాలున్నప్పటికీ ప్రధానిని కలిసేందుకు కిషన్‌రెడ్డిని నేనే అడిగాను. మేం ఏం చేయాలనుకున్నా సభ ముందు పెడతాం. తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా చేయాలన్నదే మా లక్ష్యం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం. త్వరలో అఖిలపక్ష భేటీ.. త్వరలోనే అఖిలపక్షం సమావేశం పెడతాం. గ్రేటర్ సిటీతో పాటు పలు అంశాలపై చర్చలు జరుపుతాం. సభలో ఉన్న వాళ్ళే కాదు.. లేని సీపీఎం పార్టీ వంటి నేతలను సైతం పిలుస్తాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్న డాక్యుమెంట్ రూపంలో సభలో పెడతాం. ఇంట్లో కూర్చుని నిర్ణయాలు తీసుకొము. అందరితో చర్చలు జరిపే నిర్ణయాలు ఉంటాయి’ అని స్పష్టం చేశారు. -
తెలంగాణ: ముందుంది రసవత్తర రాజకీయం!
తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం, వాద ప్రతివాదాలు రసవత్తరంగానే ఉన్నాయి. వచ్చే ఐదేళ్లపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఎలాంటి పోటీ వాతావరణం ఉంటుందో ఈ చర్చలు తెలియచెప్పాయి. వీరిద్దరూ కొన్నిసార్లు ఆత్మరక్షణలో పడితే, మరికొన్నిసార్లు ఎదుటివారిపై దాడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సి ఉంది. కానీ, ఆయన ఆరోగ్య కారణాలు, రాజకీయ కారణాల రీత్యా ఎంత వరకు ఆ విషయంలో క్రియాశీలకంగా ఉంటారో తెలియదు. పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను విమర్శిస్తుంటే ఓపికగా వినే పరిస్థితి ఉంటుందా అన్నది డౌటు. గతంలో ఎన్టీ రామారావు అధికారం కోల్పోయిన తర్వాత 1989 నుంచి ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప, మిగిలిన సభా వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు, కోటగిరి విద్యాధరరావు, మాధవరెడ్డి, రఘుమారెడ్డి వంటివారే పర్యవేక్షించుకునేవారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే మోస్తరుగా పేరుకు మాత్రం ప్రతిపక్ష నేతగా ఉంటూ కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి తదితర నేతలకు బాధ్యతలు అప్పగించవచ్చేమో చూడాలి. కేసీఆర్ టీఆర్ఎస్ను ఆరంభించినప్పుడు రేవంత్ ఆ పార్టీలో ఒక కార్యకర్తే. కానీ, అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఆయన జీవితంలో అది గొప్ప విజయం. అలాగే కేసీఆర్ కూడా చిన్న స్థాయి నుంచే రాజకీయ జీవితం ఆరంభించినా 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెనుదిరగలేదు. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత కేసీఆర్ అత్యంత కీలకనేతగా ఎదిగి, తెలంగాణ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియగా మారి తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అయి తొమ్మిదిన్నరేళ్లు ఎదురులేకుండా పాలన సాగించారు. కేసీఆర్ పాలనలోని తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ఎండగడుతోంది. అందులోనూ రేవంత్ సంగతి చెప్పనవసరం లేదు. మామూలుగానే కేసీఆర్‌పై విరుచుకుపడుతుండేవారు. అలాంటిది సీఎం అయిన తర్వాత ఊరుకుంటారా?. వాటిని విని ఎదుర్కునే పరిస్థితి కేసీఆర్‌కు ఉంటుందా?. అలా ఉంటే మాత్రం శాసనసభ మరింత రంజుగా ఉంటుంది. శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన తీరు ఆ పార్టీకి కాస్త ఊపిరి ఇచ్చిందని చెప్పాలి. ఓటమి బాధలో ఉన్న కేడర్‌కు కొంత విశ్వాసం సమకూర్చిందని ఒప్పుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడేవారో, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే స్థైర్యంతో వ్యవహరించారు. మాటకుమాట బదులు ఇవ్వడంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాకపోతే కుటుంబపాలన అన్న పాయింట్లో కానీ,కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం విషయంలో కానీ కొంత ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్కు ఈ పాయింట్లు ఎప్పటికీ కష్టంగానే ఉంటాయి. రేవంత్ తనకు సభలోకానీ, బయట కానీ, ప్రతిపక్షం నుంచి సమస్య వస్తుందని అనగానే వీటిని రేకెత్తిస్తుంటారు. కుటుంబ పాలన విషయంలో కాంగ్రెస్ కూడా తీసిపోయిందేమి కాదు. అందుకే ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన అందిస్తామని వాగ్దానం చేస్తున్నామని ప్రకటించారు. ఈ విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కున్నారు. సాధారణ ప్రజలనే కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలవకుండా కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరించారన్న విమర్శ ఉన్న మాట నిజమే. దానిని రేవంత్ ప్రస్తావించి కేసీఆర్ ఇంటి వద్ద ఆనాటి హోం మంత్రి మహమూద్ అలీని హోం గార్డు నిలిపివేశారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ వద్ద కంచెలను తీసివేశామని ఆయన ప్రకటించారు. కాకపోతే ఆయన అక్కడ ఉండకుండా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టికి కేటాయించడం విశేషం. అది కాంగ్రెస్ టైమ్‌లో వేసిన కంచె అని కేటీఆర్ గుర్తు చేశారు. తన ప్రభుత్వం గ్యారంటీలకు కట్టుబడి ఉందని, ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిందని చెప్పుకోవడానికి రేవంత్ యత్నించారు. కేటీఆర్‌ను ఎన్ఆర్ఐగా అంటే నాన్ రిలయబుల్ ఇండియన్‌గా అభివర్ణించారు. కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా అని, చీమలు పెట్టిన పాము మాదిరి చొరబడ్డారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటన్నిటికి కేటీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. సోనియాగాంధీని విదేశాల నుంచి తెచ్చి కాంగ్రెస్‌కు నాయకురాలిని చేసుకున్నారని ఆయన దెప్పిపొడిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పెట్టిన పుట్టలో రేవంత్ పాములా దూరి ముఖ్యమంత్రి పదవిని పొందారని ఆయన వ్యాఖ్యానించారు. తనది మేనేజ్మెంట్ కోటా అని అనడాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీలో మేనేజ్ చేసుకుని పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, మంత్రి కోమటిరెడ్డి గతంలో రేవంత్‌పై పేమెంట్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు అయ్యారని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. రేవంత్ నామినేటెడ్ సీఎం అని ఆయన పేర్కొన్నారు. వీటికి నేరుగా రేవంత్ జవాబు ఇవ్వలేదు. కాకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన ధోరణి మార్చుకోకపోతే, ప్రజలు వారిని బయటకు పంపుతారని, తాను ప్రజల నుంచి వచ్చిన ముఖ్యమంత్రిని అన్నారు. ఇది తండ్రి ద్వారా వచ్చిన పదవి కాదని సమాధానం ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందడం ఆరంభం అయిందని, వంద రోజుల తర్వాత కౌంట్ డౌన్ మొదలవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. మహాలక్ష్మి స్కీములు మూడు అంశాలు ఉంటే మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేసి మొత్తం చేసేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అది కూడా కొన్ని బస్సులకే పరిమితం చేస్తున్నారని అన్నారు. గ్యాస్ బండను రూ.500 రూపాయలకే ఇస్తారని, ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ఇస్తారని అంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. మొదటి క్యాబినెట్లోనే అన్ని చేసేస్తామని అన్నారని, ఎందుకు ఇంకా ఆరంభించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ , రైతుబంధు పదిహేను వేల రూపాయలు ఇంకా అమలు కాలేదని అన్నారు. రేవంత్ కానీ, ప్రభుత్వ పక్షం కానీ, వీటన్నిటిని అమలు చేస్తామని అన్నారే తప్ప, నిర్దిష్ట గడువు చెప్పలేకపోయారు. కాకపోతే వందరోజుల కార్యాచరణ అని అంటున్నారు. ఈ విషయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా గట్టిగానే మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి సుమారు మూడు లక్షల కోట్లు అవసరం అవుతాయని, వాటిని ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. అయినా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, శాసనసభలో ఆయా పార్టీల బలాబలాలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ వ్యూహాత్మకంగా ఎంఐఎం వారిని తనవైపు తిప్పుకునే యత్నం చేసినట్లు కనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్లో బాగా సీనియర్లుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి వంటివారిని కాదని, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రోటెమ్ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంఐఎం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ సమావేశం అవడం కూడా గమనించదగిన అంశమే. నిజానికి ఎంఐఎం పక్షం బీఆర్ఎస్కు మిత్ర పక్షంగా ఉంది. వారికి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని భావించి రేవంత్ వారిని తనవైపు తిప్పుకునే యత్నం చేసినట్లు అనిపిస్తుంది. కాగా రేవంత్ డ్రగ్స్ అంశాన్ని లేవనెత్తి బీఆర్ఎస్ను బాగా ఇరుకున పెట్టాలని కూడా యత్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను రేవంత్ ఏకరువు పెడితే, తమ తొమ్మిదిన్నరేళ్ల ప్రభుత్వం సాధించిన విజయాలను కేటీఆర్ ప్రచారం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ ప్రతిపక్ష టీడీపీలో ఉండి తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. ఇప్పుడు వాటిని కాంగ్రెస్ ఘనతలుగా ఆయన చెప్పవలసిరావడం రాజకీయాలలో ఉండే ఒక చిత్రమైన పరిణామం. కేసీఆర్ గొప్పదనం గురించి కేటీఆర్ అభివర్ణిస్తే, కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్ బదులు ఇచ్చారు. మొత్తం మీద రేవంత్, కేటీఆర్‌లు ఒకరికొకరు ధీటుగా వాదోపవాదాలు సాగించారని చెప్పవచ్చు. వీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో శాసనసభలోను, బయటా రాజకీయం రంజుగానే ఉంటుంది. ఇక్కడ ఒక షరతు పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏమీ మారకుండా ఉండాలి. అలాగే కాంగ్రెస్‌లో గ్రూపుల వల్ల రేవంత్ ఇబ్బంది పడకుండా ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరిగినా మళ్లీ రాజకీయాలు మారిపోతాయి. ::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
TS Assembly: సీఎం రేవంత్ Vs హరీశ్ రావు మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీ చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హరీష్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి, రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. గత పదేళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.97,449 లోన్ మంజూరు అయితే విడుదల అయింది రూ.79, 287కోట్లు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు కాకుండా ఇంకా నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 80వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు నిధులు వేరే వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను అమ్మేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాళేశ్వరం నీళ్ళు అమ్ముతామని రూ.5,100 కోట్ల అప్పులు చేశారు. 2014కు ముందు తెలంగాణ ప్రజలు మంచినీళ్ళు, ఇళ్లలో నల్లా కనెక్షన్లు ఉన్నట్లు గత ప్రభుత్వం చెప్తోంది. మిషన్ భగీరథపై రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని బ్యాంకులను మభ్యపెట్టి లోన్స్ తెచ్చారు. నీళ్ళపై వ్యాపారం చేసి కాళేశ్వరంపై రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్లు అప్పులు తెచ్చారు. TSIICకి వచ్చిన లోన్ నిధులకు ప్రభుత్వమే బాధ్యత అని గ్యారెంటీ ఇచ్చారు. అప్పుల కోసం ఆదాయం తప్పుగా చుపించిందంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. తన పద్ధతి మార్చుకోవాలంటూ కాగ్ గత ప్రభుత్వానికి హెచ్చరించింది.శాసన సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ.. సభను నేను తప్పుదోవ పట్టించలేదు. సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అర్థం కలవాలంటే కొంత టైం పడుతుంది. కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మా పై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి అంటూ కామెంట్స్ చేశారు. -
TS: శ్వేతపత్రం వెనుక సీఎం పాత గురువు..హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలును ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో దగా చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేత పత్రం మీద జరిగిన స్వల్పకాలిక చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారన్నారు.దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. శ్వేతపత్రంలో కేవలం అప్పులు చూపించి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల రుణ భారం అదనంగా పడిందని చెప్పారు. దేశ జీడిపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 స్టేట్స్లో తెలంగాణ ఒకటన్నారు.తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
TS: వాస్తవాలను ప్రజల ముందుంచుతాం : భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి చెప్పారు. శ్వేతపత్రం బుక్ విడుదలపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు. అరగంట ముందు బుక్ రిలీజ్ చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్‌లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని అడిగారు. ఇదే రీతిలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీనణ్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ అరగంట పాటు అసెంబ్లీని వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు. 👉: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్ చేయండి అరగంట ముందు 40 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించడాన్ని లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి శ్రీధర్‌బాబు సమర్థించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందన్నారు. తాము కొత్తగా చేసిందేమీ లేదన్నారు. శ్వేతపత్రంపై సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
Dec 20: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
First Session of Third Telangana Legislative Assembly Day 5 Live Updates తెలంగాణ అసెంబ్లీ రేపటికి(గురువారానికి) వాయిదా హరీష్ రావు కామెంట్స్.. పదవుల కంటే వ్యవస్థలు ముఖ్యం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది మేము. రేవంత్ రెడ్డి సీఎంగా కాకుండా పీసీసీ అధ్యక్షులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సభను, రాష్ట్ర ప్రజలను శ్వేత పత్రం ద్వారా కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని వైట్ పేపర్లు అయినా పెట్టినా మాకు అభ్యంతరం లేదు. సత్యహరిచంద్రుడిలా హరీష్‌రావు మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లివ్వలేకపోయారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.1.34లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు. సత్యహరిచంద్రుడిలా హరీష్‌రావు మాట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదారి పట్టించారని చెప్పి ఉంటే హరీష్ హుందాతనం పెరిగేది. గత పాలకులంటూ ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు. ఇంకా మూడువేల కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయాల్సి ఉంది. రూ.90వేల కోట్లు పేమెంట్స్ జరిగాయి. గత పాలకులు రాజీవ్ ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదు. దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు. హాస్టల్లో వంటచేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. పెద్దకొడుకును అన్న కేసీఆర్ ఇప్పుడు రెండు, మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. పేదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు. లక్షకోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. నాలుగు నెలల తర్వాత పిలవాల్సిన టెండర్లను ఎన్నికలకు ముందే పిలిచారు. ఓడీ ఏమైనా నేరమా?: హరీష్ రావు హరీష్ రావు మాట్లాడుతూ.. బడ్జెట్ గ్యాప్‌ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. నికర అప్పు రూ.5,16,881కోట్లు అప్పులు చెప్పారు, ఆస్తుల విలువ చేప్పలేదు. కేంద్ర సంస్థలను కాంగ్రెస్ హయాంలో తెచ్చినట్టుగా చెప్పారు.. అది రాష్ట్రానికేం సంబంధం. మీరు భవిష్యత్తులో ఓడీ వాడమని హామీ ఇస్తారా?. ఓడీ ఏమైనా నేరమా? పెరిగిన జీఎస్డీపీ చెప్పలేదు. 47 లక్షల మంది వృద్ధులు, మహిళలకు పెన్షన్లు ఇచ్చాం. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. రూ. ఏడులక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు, అది అబద్దం. పెరిగిన పంటల ఉత్పత్తి చెప్పలేదు. కట్టిందే ఒక్క ప్రాజెక్ట్.. అది కూడా కూలిపోయింది: భట్టి విక్రమార్క గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్.. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కూలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి. ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు పెద్ద సవాల్ ఉంది. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదు. ఏ బడ్జెట్లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారు. గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్లో గ్యాప్ ఉంది. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. కానీ, అంతా రివర్స్ అయ్యింది. ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారు. కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. ప్రాజెక్ట్ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది. ఓఆర్ఆర్ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. మీరు చేసిన దివాళా పని సెట్ చేసుకోవడం మాకు కష్టమే. మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. రాష్ట్రం ఇచ్చిందే మేము. తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారంటే అది లేదు. కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్‌ను పోగొట్టారు. రెండు ఫామ్‌హౌజ్‌లను మాత్రమే తెచ్చారు. మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం’ అని అన్నారు. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు: అక్బరుద్దీన్ ఫైర్ తెలంగాణ దీవాలా తీసిందని చెప్పడం సరికాదు రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దు. కేంద్రం కూడా అప్పులు చేసింది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని ఎందుకు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటక అప్పుల లెక్కలను చెప్పిన అక్బరుద్దీన్ రాంగ్ మెసేజ్ వెళ్లకూడదనేదే నా ఉద్దేశ్యం ఆర్బీఐ, కాగ్, బడ్జెట్ లెక్కలను అవసరానికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అక్బరుద్దీన్ అప్పులు చేయకూడదన్నది మా ఉద్దేశం కాదు: శ్రీధర్ బాబు అప్పులు చేయకూడదన్నది మా ఉద్దేశం కాదు: శ్రీధర్ బాబు అప్పులు ఎందుకోసం చేస్తామన్నది ముఖ్యం. ప్రస్తుత పరిస్థితి నుంచి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐదేళ్లలో నెంబర్ వన్‌గా చేస్తాం. ఇది ప్రగతి నివేదిక లాంటిదే. దేశంలో తెలంగాణను నంబర్ వన్‌గా చేయాలన్నదే మా ఉద్దేశం మంత్రి పొన్నం వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు పార్లమెంట్లో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘనత బీజేపీది. తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని ఉంటే రూ.500లకే గ్యాస్ ఇవ్వడంలో సహకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పాలనలో పార్లమెంట్లో రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పు చేసింది: మహేశ్వర్ రెడ్డి శ్వేతపత్రం విడుదల అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు ఇలా చట్టసభల్లో అప్పులు వివరిస్తే భవిష్యత్త్‌లో ఎలా అప్పులు పుడుతాయ్?. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హరీష్ రావు సివిల్ సప్లై కార్పొరేషన్‌పై చేసిన కామెంట్స్ వాస్తవం కాదు. సివిల్ సప్లై లో అప్పు 3వేల కోట్ల నుంచి 56వేల కోట్లకు చేరింది. గత పదేళ్లలో సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి ఒక్క సబ్సీడీ కూడా ఇవ్వలేదు. రూ.3వేల కోట్ల మిత్తీ ప్రతీ ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్ కట్టాల్సి ఉంది. రూ.22వేల ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉంది. గత నాలుగేళ్లుగా సివిల్ సప్లై ఆడిట్ లేదు. ఆరు కిలోల్లో ఒక కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. 39 రూపాయలు కిలోకి ఖర్చు చేసింది గత ప్రభుత్వం. 75శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రాష్ట్రం దగ్గర స్టాక్ ఉన్నా కర్ణాటక, తమిళనాడుకు బియ్యం అమ్మలేదు. ప్యాడీ ప్రోకూర్మెంట్ కింద కేంద్రం నిధులు సమయానికి ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖపై ఉత్తమ్ కుమార్ సంచలన ఆరోపణలు ఇరిగేషన్ శాఖలో చాలా దుర్మంగంగా జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పకుండా విచారణ చేస్తాం తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే పాలమూరు రంగారెడ్డి 25వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు జీరో సీతారామ ప్రాజెక్టుపై 7వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు జీరో మేడిగడ్డ డ్యామేజ్ అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రపంచ చరిత్రలో ఇలాంటి నిర్లక్ష్యం చూడలేదు డిజైన్ చేసింది ప్రభుత్వమే అని నిర్మాణ ఎల్అండ్టీ సంస్థ చెప్పింది ఎవరి ఎజెండా అని ప్రశ్నిస్తే.. ఇంకా ఎవరు అన్ని ఆయనే కదా అని ఎల్ అండ్ టీ వాళ్లు అన్నారు డిజైన్ సరిగ్గా లేదని ఆ సంస్థ చెప్తోంది పెద్ద పెద్ద మాటలు చెప్పారు.. పెద్ద ప్రాజెక్ట్.. కానీ ఫలితం లేదు మన కుటుంబాలను తాకట్టుపెట్టి అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టి ప్రయోజనం లేదు అబద్దాలతో హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. అమలు కానీ హామీలు ఇవ్వొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని కలిపి ఏడాది0కు 25వేలకు పైగా ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణలో 39లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. న్యాయపరంగా కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధుల కంటే ఎక్కువగానే తెలంగాణకు ఇచ్చింది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీష్ రావు శుద్ధ అబద్ధం చెప్పారు. అబద్ధాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినట్లు హరీష్ రావు ఆధారాలు చూపించాలి. మీటర్లు పెట్టమని కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రం తెలంగాణకు లక్షల కోట్లు ఇస్తున్నా గత ప్రభుత్వం కావాలని తప్పుడు ప్రచారం చేసింది. వచ్చే ఆదాయంలో 30శాతం మాత్రమే ప్రజలకు చేరుతోంది. 30శాతం నిధులతో అమలు కానీ హామీలు ఎలా ఇచ్చారు? కాంగ్రెస్ హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు. కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇచ్చారు. కాంగ్రెస్‌కు వంద రోజుల సమయం ఇస్తాం. హామీలు అమలు కాకపోతే ప్రజా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ కామెంట్స్ పదేళ్లలో తెలంగాణను అప్పులమయం చేశారు. గత ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రం అని చెప్పారు. కానీ, అది నిజం కాదు. పేదల కోసం ఆరు గ్యారంటీలు తీసుకొచ్చాం. గ్రామాల్లో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు రెవెన్యూ వ్యవస్థ గ్రామాల్లో లేదు ఎక్కడ తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. రాష్ట్రంలో 75లక్షల కుటుంబాలు బీపీఎల్ కింద ఉన్నాయి. అన్నా రాష్ట్రాల మాదిరిగానే ఐటీ అభివృద్ధి ఇక్కడ కూడా జరిగింది. బీఆర్ఎస్ చెప్పుకోవడమే తప్ప మంచి చేసిందేమీ లేదు. అంత ఆవేశం ఎందుకు: భట్టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు లేదు. హరీష్ రావు తన పేరు తీసుకున్నారు కాబట్టే ఆయన స్పందించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. రెండు రోజులు కాలేదు అప్పుడే అవేశం ఎందుకు కడియం శ్రీహరి కామెంట్స్.. డిప్యూటీ సీఎం భట్టి స్పీకర్ చైర్‌ను డిక్టెట్ చేస్తున్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్ రావుకు సమయం ఇచ్చారు. శ్రీధర్ బాబు చెప్పిన దానికి లేచి హరీష్ రావుకు మైక్ ఇవ్వొద్దు అంటే అర్థం ఏంటి? హరీష్‌రావుపై ఫైర్ అసెంబ్లీలో హరీష్ రావుపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు ఆగ్రహం కొత్త సభ్యులు మాట్లాడుతుంటే అడ్డుకోవడం హరీష్ రావుకు కరెక్ట్ కాదు. పది నిమిషాలు ఓపిక పట్టలేని వాళ్లు పదేళ్లు ఎలా రూల్ చేశారు. హరీష్ రావు కామెంట్స్.. నేను ఇవ్వాళ సభలో రాజగోపాల్ రెడ్డి పేరును తీసుకోలేదు. నా పేరు తీసుకోని నా మీద కామెంట్స్ చేశారు. నేనేమీ రూ.50 కోట్లు ఇచ్చి పీసీపీ పదవి తీసుకోలేదు. హరీష్ రావు కామెంట్స్‌పై శ్రీధర్ బాబు సీరియస్. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. హరీష్ రావు తన మాటలను వెనక్కి తీసుకోవాలి. హరీష్ రావు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే సభ నుంచి బహిష్కరిస్తాము. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేను వెనక్కి తీసుకుంటా-హరీష్ రావు నేను కొత్తగా చేసిన కామెంట్స్ కాదు కోమటి రెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలే ఇవి -హరీష్ రావు రాజగోపాల్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకుంటే నేను తీసుకుంటా. మా నాయకుడిపై కామెంట్స్ చేస్తే మేము సమాధానం చెప్పకూడదా? హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. మా పార్టీ అంతర్గత విషయాల్లో మీరెందుకు కలుగజేసుకుంటారు. పదేళ్లు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలి. మేము మా సీఎం నాయకత్వంలో పనిచేస్తాం. స్పీకర్ సీరియస్ హరీష్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కామెంట్స్ హరీష్ రావు సీనియర్ సభ్యులు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులను పోడియం ముందుకు పంపడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునవృతం కాకూడదు. సభలో గందరగోళం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల ఆందోళన హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు నిరసన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు అయింది శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో BRS ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్ బాబు ఆగ్రహం. స్పీకర్ పోడియం ముందుకు వచ్చి స్పీకర్ చైర్‌ను బెదిరించడం సరికాదు BRS ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్‌ను అవమానిస్తున్నారు. కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేల పద్ధతి కాదు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్.. హరీష్ రావుకు గంట సమయం ఇచ్చినా సమయం సరిపోలేదు అంటున్నారు. అబద్ధాలను నిజం అని చెప్పడంలో హరీష్ రావుకు మేనమామ పోలికలు వచ్చాయి. హరీష్ రావు ఎన్ని ఎండ్లు కష్టపడ్డా కేసీఆర్ తరువాత, కేటీఆర్ సీఎం అవుతాడు కానీ హరీష్ రావు కాలేడు. తండ్రి కొడుకులు వాడుకోవాల్సినంత వాడుకొని వదిలేస్తారు. నాకు మంత్రి పదవి రాదు అని హరీష్ రావు అన్నారు. నా మంత్రి పదవిపై నిర్ణయం మా సీఎం, అధిష్టానం తీసుకుంటుంది. అసెంబ్లీలో హరీష్ రావు కామెంట్స్.. సభను నేను తప్పుదోవ పట్టించలేదు. సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అర్థం కలవాలంటే కొంత టైం పడుతుంది. కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మా పై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్ శ్వేతపత్రం పేజీ నెంబర్ 21 చూసుకోవాలి కాళేశ్వరం కోసమే 80 వేల కోట్ల రుణం తీసుకున్నారు ఇవి కాకుండా ఖర్చు ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టింది కాళేశ్వరం అద్భుతం అని హరీశ్‌రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారు హరీశ్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలు కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చూపించారు ఇలా చెప్పే అప్పులు తీసుకువచ్చారు మిషన్ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించారు ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీ : హరీశ్‌రావు మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం మా లీడర్ కేసీఆర్ తన కోసం ఏదీ కట్టుకోలేదు అన్నీ ప్రజల కోసమే కట్టారు ప్రగతిభవన్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు ప్రగతిభవన్‌లో ఏముందో భట్టి విక్రమార్క ఇప్పుడు చెప్పాలి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ గదులున్నాయి ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ హరీశ్‌రావు ప్రసంగంపై మంత్రుల మండిపాటు హరీశ్‌రావు శ్వేతపత్రం మాట్లాడుతుండగా మంత్రులు ఉత్తమ్‌కుమార్, పొన్నం, జూపల్లి అభ్యంతరం హరీశ్‌రావు కేంద్రంపై మళ్లీ అవే అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఉత్తమ్ తమకూ బడ్జెట్‌పై అవగాహన ఉందన్న పొన్నం హరీశ్‌రావు కార్పొరేషన్ రుణాలపై అబద్ధాలు చెప్పారన్న జూపల్లి అన్నీ కూలగొట్టి మళ్లీ కట్టి నిధులన్నీ వృథా చేశారని ఆరోపించిన కొండా సురేఖ సెక్రటేరియల్ కూల్చి మళ్లీ ఎందుకు కట్టారని ప్రశ్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం కట్టలేదని విమర్శించిన సురేఖ శ్వేతపత్రంపై హరీశ్‌రావు ఫైర్ ముఖ్యమంత్రి గారి పాత గురువు శిష్యులు శ్వేతపత్రం వండి వార్చారు తయారు చేసిన వాళ్లలో ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు శ్వేతపత్రంలోని వివరాలు శుద్ధతప్పు అప్పులను రెవెన్యూతో పోల్చారు అప్పులను జీఎస్డీపీతో పోల్చలేదు కరోనా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు తెలంగాణ సొంత ఆదాయం ఎలా పెరిగిందన్నది చూపలేదు ఆరోగ్యంపై తక్కువగా ఖర్చు పెట్టామనేది అవాస్తవం కరోనా వల్ల కేంద్రం ఎక్కువగా అప్పులు తీసుకునేలా చేసింది కరోనా, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పడింది అయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు కేంద్రంతో మా ఎంపీలు పోరాడారు కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో కేంద్రాన్ని ఎప్పుడూ అడగలేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది పన్నుల్లో వాటా సెస్‌ల రూపంలో ఎగ్గొట్టారు ఏపీ విద్యుత్ బకాయిలు కేంద్రం వల్లే రాలేదు సీఎస్ఎస్లో కేంద్రం వల్లే నష్టపోయాం లక్షకోట్ల కేంద్రం నుంచి రాకపోవడం వల్లే ఇబ్బంది కలిగింది ఇవి వస్తే ఇంకో లక్ష కోట్ల అప్పు తగ్గేది సంబంధం లేని రుణాలన్నీ చూపి 6 లక్షల కోట్ల అప్పులు తేల్చారు అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనేది పూర్తి అబద్ధం కాంగ్రెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి లేదంటే పెట్టుబుడు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావు అధికారంలోకి వచ్చి కూడా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు టీ బ్రేక్ తర్వాత ప్రారంభమైన అసెంబ్లీ ఆర్థిక స్థితిపై రిలీజ్ చేసిన వైట్‌పేపర్ మీద చర్చ అసెంబ్లీ అరగంట పాటు వాయిదా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి స్వల్పకాలిక చర్చ ప్రారంభించిన డిప్యూటీ సీఎం అరగంట ముందు 42 పేజీల బుక్ ఇచ్చి మాట్లాడమంటే ఎలా అన్న హరీశ్‌రావు, అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో కూడా ఈ సంప్రదాయం ఉందన్న లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిశ్రీధర్‌బాబు దీంతో అరగంట పాటు సభను వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చిన స్పీకర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. కనీసం రోజువారి ఖర్చులు కూడా లేని పరిస్థితి తెలంగాణ ప్రజల ఆశలు, కోరికలు, కళలు నెరవేర్చాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నాం నేను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నాను 👉: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్ చేయండి తెలంగాణ శాసనసభ సమావేశం ప్రారంభం CPI ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశవరావు పేరును ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ MIM ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ పేరు ప్రకటన శాసనసభలో బీఆర్ఎస్ సమావేశం శాసనసభలో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చ అప్పులు కాదు ఆస్తులు పెంచాం: బీఆర్ఎస్ పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెంచామని చెప్తున్న గులాబీ పార్టీ 51 పేజీల ఆస్తుల వివరాలను విడుదల 33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు. ఇప్పటికే 25 కలక్టర్ భవనాలు ప్రారంభం 2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు 8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు 1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు 7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్, 23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్ 70 గదుల నిర్మాణం 250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం 1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్ 22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 334 చిన్న పరిశ్రమల పురుద్దరణ 10,40p ఎకరాల్లో అతిపెద్ద పార్మ క్లస్టర్ 81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరిత హరం Hmda పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లకులు 19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం 109 అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం 1,00,691 కిమి రహదారి వనాలు 10,886 కిమీ కందకల తవ్వకం 19వేళ పల్లెల్లో పార్కులు 2700 ట్రీ పార్కులు 1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం 2800 కోట్ల ఆలయాల అభివృద్ధి 100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు 75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం 212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం ఆరోగ్య శాఖ లో 34000 హాస్పిటల్ బెడ్స్ 34000 ఆక్సిజన్ బెడ్స్, 80 ఐ సీ యు కేంద్రాలు 56బ్లడ్ బ్యాంక్ లు 82 డయాలసిస్ కేంద్రాలు 500 బస్తీ దవాఖానాలు 1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్ 1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ 3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు 585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు 10.13 లక్షల సీసీ కెమెరాలు 20,115 పోలీసు వాహనాలు 9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం విద్యుత్ రంగం 2014లో 7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు 15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం 57.82 శాతం తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు 2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు 2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు 2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు 59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు దళిత బంధు పథకం అమలు 5000 కోట్లతో గొర్రెల పంపిణీ 72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల 5402 కోట్ల రైతు బీమా 572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు 1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం గ్రామాల్లో 100 శాతం మంచి నీటి సౌకర్యం, స్కూళ్ళు, అంగన్వాడీ లు, ప్రభుత్వ సంస్థల్లో నీటి సౌకర్యం 8735.32 కోట్ల తో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ 617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం 146.50కోట్ల తో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం 178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి 2014 లో 27, 200 కోట్ల సేల్స్ టాక్స్ 2023 లో 72564 కోట్ల వసూళ్లు 2014 లో 2832 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14, 291 కోట్ల వసూలు 2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో 3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం 159.6 పెరిగిన తలసరి ఆధాయం పెరిగిన రూపాయి అప్పులు 1000 రూపాయల ఆస్తి పెంచాం ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన బీఆర్ఎస్ సభలో వార్ తప్పదా? బీఆర్ఎస్ ముందుగానే.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ డాక్యుమెంటరీ విడుదల ప్రభుత్వ శ్వేత పత్రం కంటే ముందే విడుదల చేసిన ప్రతిపక్ష పార్టీ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీఆర్ఎస్ శాఖల వారీగా అభివృద్ధి, ఆస్తులు, ఆదాయం ప్రకటించిన బీఆర్ఎస్ 2014 నుంచి 2023 బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై శాఖల వారీగా లెక్కలు అప్పులా? ఆస్తులా? తెలంగాణ ఆర్థికపరిస్థితిపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లేదంటున్న అసెంబ్లీ వర్గాలు కాంగ్రెస్ ప్రజంటేషన్ఇస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్ సభలో నివేదిక ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఇవ్వనున్న హరీష్‌రావు? సభలో సమరానికి ముందే పార్టీల ఫైటింగ్ అప్పులే మిగిలాయని కాంగ్రెస్.. ఆస్తులు సృష్టించామంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ పొలిటికల్ రచ్చ తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక ఘట్టం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ సర్కార్ శ్వేత పత్రం అప్పులు, నీటి పారుదల, విద్యుత్ పరిస్థితులపై వివరణ 2014 నుంచి ఆదాయ-వ్యయాలు అప్పుల ప్రస్తావన పాయింట్ టు పాయింట్.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న సర్కార్ సీఎం రేవంత్‌తో పాటు భట్టి, ఉత్తమ్ ప్రసంగించే ఛాన్స్ ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అయిన బీఆర్ఎస్ వాడీవేడిగా చర్చ నడిచే అవకాశం హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్న సీఎం తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం రేవంత్ ఖర్గే కొడుక్కి కేటీఆర్ కౌంటర్ శాసనసభ సమావేశం కంటే ముందే పొలిటికల్ హీట్ నిన్నటి నుంచి కర్ణాటక నేతలతో కేటీఆర్ ట్విటర్ వార్ సీఎం సిద్ధరామయ్యతో నిన్నంతా జరిగిన విమర్శలు-ప్రతివిమర్శల పర్వం ఇవాళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశించి ట్విట్టర్ లో కేటీఆర్ హాయ్ ప్రియాంక్ జీ మీరు కూడా ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. 2 లక్షల మంది కర్ణాటక యువతకు ఉపాధి గురించి మీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనలు , ఖజానా ఖాళీ పై డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలు కూడా నకిలీవా? మేము కాంగ్రెస్ పార్టీని కాదు, వారి ముగ్గురు ఎంపీలతో సహా తెలంగాణలోని బిజెపి పెద్దలందరినీ ఓడించాము. సునీల్,టీమ్ ప్రచారానికి మీరు దూరంగా ఉండటానికి జాగ్రత్తగా,సిద్ధంగా ఉండటం మంచిది నేడు, రేపు శాసనసభ సమావేశాలు నేడు, రేపు శాసన సభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ రేపు విద్యుత్ రంగంపై చర్చ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు రెడీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్‌కు సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్ గత సమావేశంలో విమర్శలు-ప్రతివిమర్శలతో హీటెక్కిన సభ ఇవాళ మళ్లీ అదీ రిపీట్ అయ్యే ఛాన్స్! ట్విటర్ వేదికగా తెలంగాణ సర్కార్‌కు కేటీఆర్ చురకలు గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?.. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..? శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా..? తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా..! దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం ఆడిట్ రిపోర్ట్ లు..ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా..! ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి..ప్రజల ముందువుంచాం..! మేం దాచింది ఏమీలేదు.. మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..! కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..! మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తారా...? అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..! చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే..! అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ ..! అంచనాలు..అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా..? వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు..! మీరు ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటాం..! ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదు.. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని..? కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం.. హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ..!! జై తెలంగాణ స్పీకర్‌కు మాజీ మంత్రి హరీష్ లేఖ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు లేఖ శాసన సభ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన హరీష్ ఆర్థిక, సాగునీటి , విద్యుత్ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదనా వినిపించేందుకు అనుమతించాలని కోరిన హరీష్ తాము కూడా ఎక్కడెక్కడ ఖర్చు చేశామనేది కూడా చెప్పేందుకు సిద్దంగా ఉన్నామన్న మాజీ మంత్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభలో నేడు.. శాసన సభ సమావేశాల్లో నేటి కార్యక్రమాలు దివంగత మాజీ శాసన సభ్యులు రామన్న గారి శ్రీనివాస్ రెడ్డి ,కొప్పుల హరీశ్వర్ రెడ్డి ,కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై లఘు చర్చ చేపట్టనున్న సభ్యులు తెలంగాణ ఆర్దిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు తెలంగాణ శాసన సభ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభకు ఇది తొలి సెషన్ ఇప్పటికే నాలుగురోజులపాటు సమావేశాల నిర్వహణ.. నేడు ఐదవ రోజు నేడు, రేపు సమావేశాలు నిర్వహణ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ మరోవైపు నిరవధికంగా వాయిదా పడ్డ శాసన మండలి -
నకిలీ హామీలు.. నకిలీ నేతలు
సాక్షి, హైదరాబాద్: నకిలీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నకిలీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. డిసెంబర్ 9లోగా నెరవేరుస్తామన్న ఆరు గ్యారెంటీ ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని కల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పినట్లుగా వైరల్ అవుతున్న వీడియోపై కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో స్పందించారు. తాజాగా తెలంగాణలో నూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా సిద్ధరామయ్య తరహాలోనే చెబుతుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ పోస్టుపై సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘బీజేపీ నకిలీ వీడియోలు సృష్టిస్తుంది. దానిని మీరు ప్రాచుర్యంలో పెడతారు. అందుకే బీజేపీకి బీఆర్ ఎస్ పార్టీ బీ టీమ్ అనేది..’అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కనీస అధ్యయనం చేసినట్టు లేదు: కేటీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి ముందు కనీస అధ్యయనం కూడా చేసినట్టు లేదని కేటీఆర్ తొలుత ‘ఎక్స్’లో విమర్శించారు. ప్రజలను మోసగించేలా కాంగ్రెస్ అబద్ధపు హామీలి వ్వడం వల్లే తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నా రు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన రైతు భరోసా హామీ ఏమైందని నిలదీశారు. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ.4 వేల ఆసరా పింఛను, రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు రూ.2,500 మాటేమిటని ప్రశ్నించా రు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన చేస్తామని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ నుంచి..వాటిపై ఎలాంటి ప్రకటన ఎందుకు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు నకిలీనా? లేక వారి మాటలు నకిలీనా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోను గుర్తించలేని స్థితిలో బీఆర్ఎస్: సిద్ధరామయ్య సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? కనీసం ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేయరు కాబట్టి..’అంటూ విమర్శించారు. వైరల్ అయిన వీడియో నిజమైనది కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా సృష్టించారని స్పష్టం చేశారు. ఫేక్, ఎడిటెడ్ వీడియోలను కూడా గుర్తించలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఎద్దేవా చేశారు. మీ ఎమ్మెల్యే ప్రకటన అబద్ధమా?: కేటీఆర్ సిద్ధరామయ్య కౌంటర్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తిరిగి పోస్టు చేశారు. ‘కర్ణాటకలో మీరు ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని మీ సొంత పార్టీ ఎమ్మెల్యే సదాక్చరి చేసిన ప్రకటన అబద్ధమా? బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని మీ నాయకుడు రాహుల్ ప్రచారం చేశారు. కానీ ఇక్కడ ఆ పార్టీ ముఖ్య నేతలను మేం ఓడించాం..’అని గుర్తుచేశారు. -
ఎంపీలూ.. అందుబాటులో ఉండండి!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలని భావిస్తున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. దీంతో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు తిరుగుముఖం పడుతున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ నందినగర్ నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ పార్టీ ఎంపీలతో మూకుమ్మడిగా కాకుండా ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కావాలని నిర్ణయించారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటూనే పార్టీ ఎంపీలతో వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో విపక్షాలు అనుసరించే వ్యూహాలను కూడా అంచనా వేస్తున్నారు. రాష్ట్రం నుంచే సోనియా పోటీపై విశ్లేషణ కాంగ్రెస్ అగ్రనేత సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ఆహా్వనించడం, సీఎం, ఇతర మంత్రులు లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జిలుగా నియమితులు కావడం తదితర పరిణామాలను కూడా కేసీఆర్ నిశితంగా విశ్లేషిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ సీట్లలో గెలుపొందిన బీజేపీ త్వరలో జరిగే ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు తదితర కోణాల్లో కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై దిశా నిర్దేశం.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన అభ్యర్థులను కలుపుకుని లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీ‹Ùరావు కూడా ఆ సన్నాహక సమావేశాలకు హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేసుకోవాలని ఎంపీలకు స్పష్టం చేయనున్నారు. మళ్లీ మెదక్ నుంచేనా? గతంలో మెదక్ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ మరోమారు ఇక్కడి నుంచే లోక్‌సభ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎంపీల్లో కొందరిని తప్పించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా పార్టీ లో జరుగుతోంది. -
‘పార్లమెంట్లో భద్రతను ప్రశ్నిస్తే ఎంపీలకు సస్పెండ్ చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాసులు వచ్చాయని, వారిని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ఆరోపించారు. పార్లమెంట్.. రాజ్యాంగాన్ని అమలుచేసే వేదిక అని, అక్కడ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు అంటూ బీజేపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. పార్లమెంట్ భద్రతపై విచారణ జరపాలని, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పొన్నం డిమాండ్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ నేతలకు పొన్నం కౌంటరిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలి. గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా నెరవేస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు అని కామెంట్స్ చేశారు.