విద్యుత్‌ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం

Published Fri, Dec 22 2023 4:39 AM

CM Bhatti Vikramarka Reply To Opposition Over White Paper On Telangana State Finances - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్‌ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్‌ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్‌ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు.

అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్‌ సరఫరాకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్‌ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్‌ఎస్‌.. అందుకు అవసరమైన విద్యుత్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్‌ జెన్‌కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్‌ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్‌ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. 

గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. 
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ ప్రాజెక్టు మాత్రమే.

ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. 

భారీగా పెండింగ్‌ బకాయిలు 
రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్‌ 31 నాటికి విద్యుత్‌ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్‌ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్‌) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. 

గుండె బరువెక్కుతోంది 
విద్యుత్‌ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్‌ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. 

ముందు చూపు ఏది?  
రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్‌ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్‌ అందించేలా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్‌కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్‌కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది.  

కాంగ్రెస్‌ హయాంలోని ప్రణాళికలతోనే.. 
యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం..

కొత్తగూడెం థర్మల్‌ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్‌ కేంద్రం, పులిచింతల హైడల్‌ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్‌ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్‌ఎస్‌ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. 

రోజువారీ మనుగడకూ కష్టంగా.. 
డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్‌ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి.

విద్యుత్‌ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్‌ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement