ప్రాజెక్టులపై విచారణ..దోషులకు శిక్ష ఖాయం  | Minister Uttam Kumar Reddy in the Assembly | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై విచారణ..దోషులకు శిక్ష ఖాయం 

Dec 21 2023 4:16 AM | Updated on Dec 21 2023 4:16 AM

Minister Uttam Kumar Reddy in the Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించి న ప్రాజెక్టుల వల్ల కొత్త ఆయకట్టు ఎంత పెరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే వచ్చిందన్నారు. దీనిపై తప్పనిసరిగా విచారణ జరుగుతుందని, దోషులను శిక్షిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు, రూ.7,500 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు జీరో అని అన్నారు. మేడిగడ్డలో జరిగింది నేరపూరిత నిర్లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

అక్టోబర్‌ 21న మేడిగడ్డలోని ఏడవ బ్లాక్‌లో ఐదు అడుగుల మేర కుంగితే సీరియస్‌గా విచారణ జరగలేదన్నారు. ఇప్పటి వరకు నాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదని , నిర్మాణ సంస్థ, అధికారులు అందరూ అప్పటి సీఎం డిజైనింగ్‌ ప్రకారమే నిర్మించామని చేతులెత్తేశారన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి, తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆయన ధ్వజమెత్తారు. 

హరీశ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే 
వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు అబద్ధాలు చెపుతున్నారని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. రైతుల నుంచి బిల్లులు వసూలు చేసే అవకాశమే లేదని, తాను పార్లమెంట్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున తనకు అవగాహన ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ పనితీరు లోపభూయిష్టంగా ఉందని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. బియ్యం పంపిణీ, ధాన్యం సేకరణకే పరిమితమైన పౌరసరఫరాల శాఖలో 2018–19 నుంచి ఇప్పటి వరకు ఆడిట్‌ జరగలేదన్నారు.

గత పదేళ్లుగా కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి అదనంగా ఒక కిలో బియ్యం మాత్రమే ఇస్తున్నప్పటికీ, రూ. 56వేల కోట్ల అప్పు చేశారని తెలిపారు. ఇవి కాకుండా రూ. 11,500 కోట్ల నష్టాలు ఉన్నాయని వివరించారు. ఈ మొత్తాలకు సంవత్సరానికి వడ్డీ కిందనే రూ. 3వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మిల్లర్ల వద్ద రూ. 22వేల కోట్ల విలువైన ధాన్యాన్ని నిల్వ చేశారని, అందులో ఎంత మేర ఫిజికల్‌గా ఉందో లెక్కలు చూడాలన్నారు.

పేదలకు పంపిణీ చేసే బియ్యంలో కూడా నాణ్యత లేదని, 70 శాతం కార్డుదారులు ఆ బియ్యాన్ని తినడం లేదన్నారు. రూ.39 కిలో చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేస్తూ పేదలకు పంపిణీ చేస్తుంటే క్వాలిటీ బాగోలేక ఆ బియ్యం నిరుపయోగం అవుతున్నాయన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బియ్యం కావాలని కోరినా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement