పదేళ్లూ బీజేపీ సర్కార్‌ చేసిందేంటి? | Sakshi
Sakshi News home page

పదేళ్లూ బీజేపీ సర్కార్‌ చేసిందేంటి?

Published Thu, Mar 7 2024 5:50 AM

Uttam Kumar Reddy Fires On BJP Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందని ఆరోపించేవారని.. మరి ఇన్నేళ్లూ ఎలాంటి చర్యలు తీసుకోలేదేమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. గత పదేళ్లలో కేంద్రం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని నిలదీశారు.

కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో బుధవారం జలసౌధలో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడి యాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చిత్రవిచిత్రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ వాళ్లు పదేళ్లపాటు అలయ్‌ బలయ్‌ చేసుకుని పాలించారని విమర్శించారు.

రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎఫ్‌సీ నుంచి రూ.50వేల కోట్లు, ఆర్‌ఈసీ నుంచి రూ.20వేల కోట్లు, బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చిందని.. అలాంటిది బీజేపీ వారే తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్‌ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే  రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని.. మళ్లీ రూ.94వేల కోట్లకు అంచనాలను పెంచేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

మోదీ ప్రధాని అయిన కొత్తలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని.. తెలంగాణలోని ఏడు మండలాలు, సీలేరు జలవిద్యుత్‌ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌లను నెలకొల్పలేదన్నారు. ప్రధాని అయిన నాటి నుంచి ఇప్పటివరకు మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.

సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం, లోపాలు, కారణాలను తేల్చి పరిష్కార మార్గాలను సూచించాలని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీని కోరామని ఉత్తమ్‌ తెలిపారు. నివేదిక సమర్పించడానికి కమిటీకి కేంద్రం 4 నెలల గడువు నిర్దేశించినా.. బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు. అందులో పునరుద్ధరణ చర్యలను సైతం సిఫారసు చేయాలన్నారు.

కమిటీ అడిగిన అన్నిరకాల నివేదికలు, సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. సమాచారాన్ని దాచే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిటీకి ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కమిటీ గురువారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను, శుక్రవారం సుందిళ్ల బ్యారేజీని సందర్శిస్తుందని తెలిపారు. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ తప్పు చేసిందని కమిటీ తేల్చితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డపై న్యాయ విచారణ విషయంలోనూ త్వరలో ముందడుగు పడుతుందన్నారు.  

Advertisement
Advertisement