-
చర్చించకుండా పారిపోయారు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టి.హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా?: అనిరుధ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్ళు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులం చెప్తే తప్పా? అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. హీరోలకంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయింది.. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా?’’ అంటూ మండిపడ్డారు.‘‘ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతాడు. ధూల్‌పేటలో గుడుంబా దొరుకుంటుందని సినిమాలో చూపెట్టాడు. బాలకృష్ణ సినిమాలో మామా ఏక్ పెగ్ లా అనే పాటలో నటించాడు. మందుబాబులం అనే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. రాజకీయ నాయకులం కల్తీసారా తాగకండి అంటే బద్నాం చేస్తారా.. ఎక్కువ డ్రగ్స్ వాడేది సినీ ఇండస్ట్రీ లోనే’’ అని అనిరుధ్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.‘‘సినీ యాక్టర్స్ అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా వాళ్లపైనే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. మా రాజకీయ నాయకులపై ఎక్కువగా రూమర్స్ లేవు. అందరూ సినిమా యాక్టర్స్ 90 రోజుల కోకసారి పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. నేను కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా.. నా కొడుకు నన్ను డ్రగ్స్ గురించి అడిగాడు. ఇప్ప సారా ఇండియన్ లిక్కర్. ఇప్పసారాను బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పసారాకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. నేను సారాకి వ్యతిరేకం. తాగమంటున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.కల్తీ సారా కంటే ఇప్పసారా చాలా మంచిది. రాలిపోయిన ఇప్ప పూల నుండి సారా చేస్తారు. ఇప్ప సారా వల్ల లాభాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆదివాసీలు లిక్కర్ చేస్తే తప్పా?. కార్పొరేట్ కంపెనీలు లిక్కర్ చేస్తే కరెక్టా?. ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ మంచిది. ఇండియా నుండి తీసుకుపోతున్న ఇప్ప పువ్వుతో విదేశాల్లో సారా చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆదివాసీలు ఉన్నారు కాబట్టే అడవులు ఉన్నాయి’’ అని అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. -
మండలి నుంచీ బీఆర్ఎస్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సోమవారం శాసనమండలిలో ఆందోళనకు దిగడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారిని ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. మండలి చరిత్రలోనే తొలిసారి ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై సభా సంఘం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మండలిలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో 50 నిమిషాలపాటు హోరెత్తించారు. కాగితాలు చించి చైర్మన్ కుర్చీవైపు విసిరేందుకు ప్రయత్నించారు. మార్షల్స్ అడ్డుకోగా మరోసారి కాగితాలు చించి విసిరారు. వాటిలో కొన్ని గుత్తా సుఖేందర్రెడ్డిపైనా పడ్డాయి. ‘పెద్దల సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉంది. ఇలా ఆందోళన చేయడం సరైంది కాదు. సభ్యులు వెనక్కి వెళ్లి వారి స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్ష నేత తమ సభ్యులను కంట్రోల్ చేయాలి. సభా కార్యక్రమాల నిర్వహణకు సభ్యులు సహకరించాలని’ అని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుబట్టారు. తల్లిదండ్రుల కోసం పెట్టిన గొప్ప బిల్లుపై చర్చలో పాల్గొనకపోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడాక సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఈ సమయంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రెండుసార్లు కలగజేసుకొని బీఆర్ఎస్ కోరినట్టు ఈ అంశంపై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. అయినా శాంతించని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ఆందోళన కొనసాగిస్తుండటంతో వారిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, తాతా మధుసూదన్, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం. కోటిరెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులంతా బయటకు వెళ్లాలని చైర్మన్ కోరగా ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు తదితరులు సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. చివరకు మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. గన్‌పార్కులో నిరసన.. శాసనమండలిలోకి సోమవారం వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలపై విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ప్లకార్డులతో మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సస్పెన్షన్ పిరికిపంద చర్య: దేశపతి శ్రీనివాస్ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ మైనింగ్‌ను ఆధారాలతో సహా సభ ముందు పెడితే నిజాలు బయటపడతాయనే భయంతో తమను సస్పెండ్ చేయడం పిరికిపంద చర్య అని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. సాంకేతిక ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, సభా సంఘం వేసేందుకు ఎందుకు భయపడుతుందో చెప్పాలని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. -
‘బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే’
ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంల్లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్‌గా అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్ షా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘పార్లమెంట్లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?, జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్‌తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారుఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. -
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్‌రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. -
భూ కబ్జా.. పొంగులేటి శ్రీనివాస్, హర్షా రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టివాగులపల్లిలో పర్యటిస్తోంది. భూ బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ క్రమంలో బాధితులు.. మంత్రి పొంగులేటి కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. దీంతో, కబ్జాకు గురైన భూములను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కాగా, రాఘవా కన్స్ట్రక్షన్స్ కబ్జాకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘మంత్రి పొంగులేటి కుమారుడే కబ్జాలకు పాల్పడ్డాడు. రాఘన కనస్ట్రక్షన్ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. బాధితులను బెదిరించి 27 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే భూమి ఉంది. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది.సర్వే పేరుతో 27 ఎకరాల భూమి స్వాధీనం..దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (AD)తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు. గవర్నర్‌కు ఫిర్యాదు.. అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్‌భవన్‌కు ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పొంగులేటిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న రాఘవ కనస్ట్రక్షన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రాఘవ కన్స్ట్రక్షన్పై గవర్నర్ కు పిర్యాదు చేశాము. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు , ORR పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశాము.తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ..ఇదే విషయంపై మా పార్టీ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్ పై CB CID విచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కు?. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ప్రజా దోపిడిని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్‌రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్‌పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్‌రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్‌మెంట్‌తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్‌రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్‌రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్‌పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్‌లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. -
కేటీఆర్‌తో రేవంత్ కుమ్మక్కు..: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే కేటీఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదన్నారు. కేవలం హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని చెప్పారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో సంజయ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ‘కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడు. బీఆర్ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ సంగతి తెలిసినా రేవంత్ ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్, రేవంత్ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి’అని నిలదీశారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయి. హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా ఇస్తున్నారు. రేవంత్‌కు కాళేశ్వరం, హరీశ్‌పై ఉన్నంత పగ కేటీఆర్‌పై లేదు. ఎందుకంటే ఫార్ములా–ఈ కేసు, డ్రగ్స్, ఫాంహౌజ్ కేసులపై మాట్లాడటం లేదు. కేటీఆర్, కవిత మధ్య సంధి కుదుర్చేందుకు రేవంత్ యతి్నస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు’అని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రేవంత్ డబ్బులు సమకూరుస్తున్నారని, కర్ణాటక నుంచి డబ్బులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో పొత్తు జరగని పని ‘కేసీఆర్‌పై ఉన్న కోపం కూడా రేవంత్‌కు పోయింది. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. ఆనాడు తనను జైలుకు పంపించిన సంగతి రేవంత్ మర్చిపోయిండు. ఆ పౌరుషం, రోషం కూడా పోయింది. ఇకపై కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై రేవంత్ విచారణ జరిపే అవకాశమే లేదు’అన్నారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగని పని. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబ అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే మేం పోరాడాం. ఆ పార్టీని ఓడించాం. మోదీ ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో మేం పొత్తు ఎందుకు పెట్టుకుంటాం’అని సంజయ్ పేర్కొన్నారు. -
సభలో ‘పాడి’ మంటలు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆదివారం బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. అక్రమ క్రషింగ్‌కు పాల్పడిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై విచారణకు సభా సంఘం వేయాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండోరోజూ అసెంబ్లీలో పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే పాడి కౌశిక్‌రెడ్డి సహా మరికొందరు అందుకు అభ్యంతరం తెలిపారు. కడియం ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మండిపడ్డ కడియం.. ధరణిని అడ్డుపెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అయితే కడియం మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి ఆయన వైపు చేతులతో అసభ్యకరమైన రీతిలో సైగలు చేశారని.. తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇది అత్యంత దారుణ ప్రవర్తన: మంత్రులు మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ కడియం శ్రీహరిపట్ల పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తన అత్యంత దారుణమని తప్పుబట్టారు. కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని హరీశ్‌రావు వంటి నేతలు ప్రోత్సహించడం సరికాదని హితవు పలికారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కవ్వంపల్లి సత్యనారాయణ, రాంచందర్, కాలె యాదయ్య, గడ్డం వినోద్, శ్రీగణేశ్, ఆదినారాయణ, జయదీర్రెడ్డి, యశస్వినీరెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల యాదయ్య తదితరులు డిమాండ్ చేశారు. కత్తులతో కోలాటం ఆడతం.. ఖబడ్దార్: మందుల సామేల్ పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ దళిత సభ్యుడు మందుల సామేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కత్తులతో కోలాటం ఆడతం బిడ్డా ఖబడ్దార్.. ఏం అనుకుంటున్నవ్? మా పడికత్తుల లేస్తేననుకో నీ గడికి వేలాడగడ్తం బిడ్డా.. ఎవరిని బెదిరిస్తున్నవ్? దళితులు, గిరిజనులంటే లెక్కలేనితనంతో ఉంటే మీ గడిల్లో దూరేరోజు కూడా వస్తుంది’ అని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పీకర్‌ను కోరారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు కేటీఆర్, హరీశ్‌రావు కడియం శ్రీహరికి, దళితులకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ దళిత శాసనసభ్యులు, మంత్రులు డిమాండ్ చేశారు. చట్టసభల్లోనే దళితులకు రక్షణ కొరవడిందని వేముల వీరేశం ఆరోపించారు. దళితులు, ఆదివాసులైన తాము అడవుల్లో క్రూర మృగాల మధ్య పెరిగామని, తాము యుద్ధం చేస్తే తట్టుకోలేరని బాలూ నాయక్ హెచ్చరించారు. తుపాకీ గురిపెడితే భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానం.. కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డిపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా అసభ్యకర రీతిలో వ్యవహరించిన పాడి కౌశిక్‌రెడ్డి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రూల్ బుక్‌లో ఉన్న నిబంధనలను చదవి వినిపిస్తూ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు ఉండాలన్నారు. -
సీఐడీ వద్దంటే సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మైనింగ్ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్ఎస్ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్‌రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి పన్నులు రాబట్టింది మేమే ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్ చెప్పారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్ సభకు రావట్లేదు ‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్‌రావు, కవితారావు, సంతోశ్‌రావు, వినోద్‌రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ మొదలైన వారున్నారు. ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్‌గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్ సభకు రావట్లేదు. కేసీఆర్ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌తో రాజీనామా చేయించండి ‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్‌తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్‌ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్‌కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడిపై కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్ ఠాకూర్ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిధుల కోసం మంత్రుల.. సీఎం చుట్టూ తిరగాలా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అంటే మంత్రులే కాదు.. ఎమ్మెల్యేలందరం కలిస్తునే ప్రభుత్వమనే విషయం తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని ప్రభుత్వానికి సూచించారు. -
‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’
హైదరాబాద్: మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతిక పాల్పడిందనే విషయం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు పేర్కొన్నారు. కాకపోతే డైవర్షన్ కోసం రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రిని కాపాడటానికే సీబీసీఐడీ విచారణ వేశారని, హౌస్ కమిటీ గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ చేయించాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, మార్చి 29వ తేదీ) ప్రెస్మీట్లో హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైంది. తప్పు జరిగిందని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు. మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది’ అని విమర్శించారు.సీఎం రేవంత్‌కు హరీష్ సవాల్సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్ విసిరారు. ‘మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. హౌస్ కమిటీ విచారణకు నేను సిద్ధం. హౌస్ కమిటీ విచారణ.. సీఐడీ విచారణ కాకుండా, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం.. సీఎం రేవంత్ సిద్ధంటే.. నేను సిద్ధం’ అని చాలెంజ్ చేశారు. నిన్న(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీలో హరీష్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవని,. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని మండిపడ్డారు. -
‘ కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే’
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్‌కు కేటీఆర్ అంటే ప్రేమని, అందుకే ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన బండి సంజయ్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరంపై విచారణ ఒక్కటే కనబడుతోందని విమర్శించారు. హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద ఎందుకు తగ్గిందన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయని, కేటీఆర్‌ను కవితను కలిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు, రేవంత్‌కు మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. -
హరీష్‌రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని.. మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మేం మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి కూడా అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు. వీళ్ళ మాటలు నమ్మి మేం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘48 గంటలు కాదు… ఎన్ని నెలలు గడిచిందో మీరే చూశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి మీరు, వాళ్లు ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్‌ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుంది. నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్‌రావు తమ్ముడు మహేశ్ రావు.. ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే… దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.కాగా, సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్‌పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్‌బాబు అన్నారు.అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. -
అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతుల్లేకుండానే హైదరాబాద్‌లో మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హరీశ్‌కు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయ కపోతే పొంగులేటికి భయం ఎందుకన్నారు. దాడుల్లో దొరికినా ప్రభుత్వ చర్యలేవీ? బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో గనుల శాఖపై చర్చలో సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్‌రావు మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్‌గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ బరితెగించి మైనింగ్ చేస్తోంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపై నడుపుతోంది. జీవో 26 ప్రకారం స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ సరి్టఫికెట్లు తీసుకోవాలి. కానీ ఆ సంస్థ విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తోంది. 2025 మే 21న మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్ తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసు జారీ చేసి రూ. 24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మార్చి 4న మళ్లీ తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికింది. మార్చి 13న మరో షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీజిల్ జనరేటర్లతో కాలుష్యంపై స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్ చట్టం ప్రకారం ఎండీఎల్, లైసెన్స్ లేకుండా క్వారీ నిర్వహిస్తే మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడ్డా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?’అని హరీశ్‌రావు నిలదీశారు. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనకడుగు వేసింది. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయం చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పేరు ప్రస్తావనపై మంత్రుల అభ్యంతరం.. హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సంబంధం లేని విషయంలో మంత్రి పొంగులేటి పేరు ప్రస్తావించారంటూ మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్‌తోపాటు విప్ ఆది శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హరీశ్‌రావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, హరీశ్‌రావు అభూత కల్పనలతో సభను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. వెంటనే హరీశ్‌రావు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో దళితులపై అరాచకాలు జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. లారీలను నిలిపివేయాలని అడిగిన ప్రజలను కొట్టి హింసించిన ఘటనలు మర్చిపోయారా?.. అప్పుడు సభాసంఘం ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్‌గూడ మైనింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉంటే తప్పకుండా విచారణ చేపడతామని... తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్‌లో ఇసుక మాఫియా లారీల కింద పడి పిల్లలు చనిపోతే కనీసం అటువైపు చూడని నేతలు ఇప్పుడు సభాసంఘం ఏర్పాటు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చను కొనసాగించారు. -
బ్లాక్ మెయిలింగ్‌కు భయపడం.. మైనింగ్‌పై నిగ్గుదేలుస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ విషయంలో విపక్ష బీఆర్ఎస్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని.. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఏమాత్రం భయపడబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు, అక్రమాలపై పూర్తిస్థాయి సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రధానంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్, హరీశ్ సోదరుడి మైనింగ్ సంస్థ సహా ఆరు సంస్థలపైనా సమగ్ర దర్యాప్తు ఉంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ విచారణ ముగించి నిజాలను నిగ్గుతేల్చి సభ ముందు నివేదికను ఉంచి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటికి చెందినదని.. ఆ సంస్థ మైనింగ్ అక్రమాలపై సభాసంఘాన్ని వేయడంతోపాటు విచారణ సజావుగా సాగేలా సంబంధిత మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సభ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతోపాటు అక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఇసుక లేదా లీజు మాఫియాలో గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి సంబంధిత వ్యక్తులను పార్టీలో చేర్చుకొని మళ్లీ ఆ చార్జీలను తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ ఈ విచారణ ద్వారా తేల్చి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా, ఖనిజ లేదా ఇతర ఆదాయానికి గండిపడేలా ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. నాడు బెదిరించి.. లీజులు రాయించుకొని ‘సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో దళితులను ఇసుక లారీతో ఢీకొట్టించి చంపి సంతోశ్‌రావు తండ్రి రవీందర్‌రావుకు సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా అక్రమ ఇసుక రవాణా చేసింది. శిరీష గ్రానైట్స్ జియో గ్రానైట్స్ ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేవి. గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన్ను బెదిరించి వారి మైనింగ్ లీజును రాయించుకున్నారు. మిడ్వెస్ట్ గ్రానైట్స్‌కు సంబంధించి ఇప్పుడు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సోదరుడు మహేశ్‌రావు అక్రమ మైనింగ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్ అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణే కాకుండా ఈడీ విచారణ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్‌పై గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి లొంగదీసుకొని మళ్లీ ఆర్బిట్రేషన్‌లో తగ్గించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకొని అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు’అని సీఎం రేవంత్ ఆరోపించారు. వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు. ఇసుక ఆదాయం పెంచాం.. ‘మేం అధికారంలోకి వచ్చాక పెంచిన ఆదాయం కళ్ల ముందు ఉంది. రాష్ట్రానికి ఇసుక ద్వారా ఆదాయం 2020–21లో రూ. 721 కోట్ల ఆదాయం వస్తే 2025–26లో రూ. 972 కోట్లు (35 శాతం) పెంచాం. నిర్మాణ రంగం కుంటుపడిందని, రియల్ ఎస్టేట్ దెబ్బదిన్నదని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేం ఇసుకను బుక్కుతున్నామా? బిర్యానీ వండుకొని తింటున్నామా? ఇసుకలోనే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం పెరిగిందంటే అర్థం ఏమిటి?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బురదజల్లేందుకే బ్లాక్‌మెయిలింగ్.. ‘బీఆర్ఎస్ నేతల దోపిడిని నిలువరించి ఇసుక, మైనింగ్‌లో ఆదాయం పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వచ్చి గత పదేళ్లలో బీఆర్ఎస్ సాగించిన దోపిడి ప్రజలకు అర్థమవుతుందనే సంబంధిత మంత్రిపై బురదచల్లేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రెడ్డికైనా ఏదో ఒక రూపంలో బంధువులు, దూరపు బంధువులు ఉండటం సహజమే. మంత్రి పొంగులేటి, వారి కుటుంబ సభ్యులు, ఎవరో బంధువుల మధ్య ఏవో గొడవలు ఉంటే వాటితో మంత్రికేం సంబంధం? సొంత చెల్లినే ఇంట్లోంచి వెళ్లగొట్టి దోపిడికి పాల్పడిన మీరు.. మంత్రి బంధువులకు ఏవో వ్యాపారాలు ఉన్నాయని పొంగులేటికి ముడిపెట్టి ఆయన్ను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇటువంటి వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై గతంలోనే చర్యలు తీసుకున్నాం.. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి గతంలోనే ప్రభుత్వం నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవడంలో భాగంగా సీనరేజీ చార్జీ కింద రూ. 1.52 కోట్లు, పర్మిట్ ఫీజు కింద రూ. 1.22 కోట్లను ప్రభుత్వం, మైనింగ్‌శాఖ కట్టించుకుంది. ఇదేదో బీఆర్ఎస్ వాళ్లు కనిపెట్టి, ఫిర్యాదు చేస్తే తాము తీసుకున్న చర్య కాదు. మా ప్రభుత్వం తరఫున మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సంస్థకు నోటీసులిచ్చి చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రతిపక్షం కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. 2025 ఆగస్టు 8న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో మంత్రికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే నోటీసులిచ్చి ఆదాయం రాబట్టే ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగాయా?’అని విపక్ష సభ్యులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ప్యానెల్ స్పీకర్ బాలూ నాయక్ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. -
మూసీ ప్రాజెక్ట్.. సబితపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, రంగారెడ్డి: మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే డిజైన్లను ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌లో ముందడుగు ఇది. నదులు కాలుష్యం అవుతున్నాయి. నదులను ప్రక్షాళన చేయాలని చాలా మంది సీఎంలు ఆలోచించారు. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన దైవకార్యంగా భావిస్తున్నా. 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు. మానవ తప్పిదం. మూసీ ప్రక్షాళన అత్యవసరం. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లో పంటను కొనే పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కొద్ది మంది రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతున్నారు. ఎవరైనా దీనికి పెడార్థాలు తీసినా, రాజకీయం చేసినా ప్రభుత్వం శివతాండవం చేస్తుంది.బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. ఇదే ప్రాంతంలో ఉండే అక్క అనేక రకాలుగా రాజకీయ లబ్ది పొందారు. అక్క కొడుకే ఎన్జీటీలో కేసు వేశాడు. మూసీ పునరుద్దీకరణ ఆపాలని కేసు పెట్టాడు. కేసు వేయడానికి వారికి మనసు ఎలా వచ్చింది?. ప్రజాప్రతినిధిగా వారికి అర్హత ఉందా?. ఎవరు అడ్డం వచ్చినా మూసీ నదిని పునరుద్ధరిస్తాం. ఈ అవకాశం చరిత్రలో ఎవరికో ఒకరికి వస్తుంది. దైవ నిర్ణయంతో ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు అవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. విమర్శలు, అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి ఉంటుంది. సముద్రం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మానవ తప్పిదం వల్లే మూసీకి ఇలాంటి పరిస్థితి. దీంతో హైదరాబాద్ నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న పొల్యూషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీని చూసి అయినా మనం నేర్చుకోవాలి’ అని అన్నారు.ఇక, ఇక్కడ.. చారిత్రక వీరభద్రస్వామి ఆలయం సమీయంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగనుంది. సుమారు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుండగా 100 అడుగుల గాలి గోపురం నిర్మాణం చేస్తారు. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించాక వేర్వేరు మండపాలు ఉంటాయి. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివని విగ్రహం ఏర్పాటు చేస్తారు. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ దేవాలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మిస్తారు. ఆలయం వద్ద 199 కోట్లతో వెయ్యి నుంచి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా మూడంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. -
తెలంగాణకు మాత్రమే రేవంత్ సీఎం.. ఉత్తరాదికి కాదు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు అంటూ చురకలు అంటించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. కేసీఆర్‌తో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారు. రేవంత్, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు.మొదట ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. కేంద్రం ఏం ఇస్తున్నాదో.. ఏం చేస్తుందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
విద్య, వైద్యం.. నిధులు పుష్కలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్యం.. ఈ రెండు అంశాలు ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రెండు విభాగాలకు సరిపోయినన్ని నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కోత విధించబోమని చెప్పారు. లక్ష్య సాధనకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ఎల్పీ ఉప నేతలు హరీశ్‌రావు, సంజయ్ తదితరులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానమిచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ఈ పథకం కింది బకాయిలతో ప్రైవేటు ఆస్పత్రులు మూత పడుతున్నాయనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.627 కోట్లు ఉంటే.. వారసత్వంగా వచ్చిన ఆ బకాయిలను చెల్లిస్తూనే ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పటివరకు రూ.2,408.51 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1480.52 కోట్లు విడుదల చేశాం. ప్రస్తుతం రూ.727.75 కోట్ల బకాయిలున్నాయి. వారసత్వ బకాయిలు మరో రూ.100 కోట్లు ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. ఇప్పటివరకు దీని కింద రూ.2,046 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం..’అని సీఎం వివరించారు. బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలున్నాయి. బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తక్కువగా ఉంది. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర కొన్నిచోట్ల సరైన డాక్టర్లు లేరు..రోగులున్న చోట నిపుణులు లేరు. అందువల్ల ఆరోగ్యశ్రీ రోగులను బోధనాసుపత్రులకు పంపించాలనుకుంటున్నాం. ఆరోగ్యశ్రీతో పాటు సీఎంఆర్ఎఫ్ను ఈ ఆస్పత్రులకు ఇస్తాం. దీంతో ఆస్పత్రుల నిర్వహణ మెరుగుపడుతుంది. ఈ ఆస్పత్రుల పర్యవేక్షణకు గ్రూప్–1 లేదా గ్రూప్–2 అధికారులను నియమిస్తాం. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయనున్నాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే ధీమాగా మారుతుంది. విదేశాల్లో ఉండే తెలుగు డాక్టర్ల సేవలు వినియోగించుకునేలా, ఇక్కడికి వచ్చినప్పుడు చికిత్స అందించేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీపై ప్రైవేటు ఆస్పత్రుల ఆసక్తి: మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్సాహం చూపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా 330 కార్పొరేట్ ఆస్పత్రులు చేరాయన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నాయని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులపై ఓర్వలేకే విమర్శలు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని చూసి ప్రతిపక్ష పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. దావోస్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దావోస్‌కు వెళ్లిన 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం 44 ఎంవోయూలు చేసుకోవడం ద్వారా రూ. 2,19,182 కోట్లు పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. ఎంవోయూలు, పెట్టుబడులు, కంపెనీలు తదితర అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
గత సర్కార్ తప్పిదాలను సరిచేస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చాక రూ.2408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశామన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీనెల రూ.52 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వం ప్రతీనెల ఆరోగ్యశ్రీకి రూ.89 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు.ఇవాళ వరకు ఆరోగ్యశ్రీకి రూ.720 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులకు 200 కోట్ల మించి బకాయిలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను దుర్వినియోగం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల పీఏలు ఇందులో ఉన్నారు. 2046 కోట్ల రూపాయలు సీఏం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతీ కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం...మెడికల్ కాలేజీలకు ఆరోగ్యశ్రీ అనుసంధానం చెస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం. విద్యా, వైద్యం విషయంలో కోతలు ఉండవు. కోతలు పెట్టాల్సివస్తే వేరే వారికి కోతలు పెడతాం. పేదల విద్య, వైద్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు’’ అని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
విధి లేకే వీడుతున్నా: జీవన్‌రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్‌లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్‌రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్‌పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్‌కు ఎదిరించే వారు వద్దని, రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... విధిలేకనే వీడుతున్నా... నేను 1984లో కాంగ్రెస్‌లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్ఎస్ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు. వేం నరేందర్‌రెడ్డి ఎవరు? అసలు వేం నరేందర్‌రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్‌లో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. రేవంత్‌పై పోరాటం రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్ఎస్ను ఎదిరించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. -
ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్‌రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్‌రెడ్డి చేరికపై వేచిచూడండి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్‌రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్‌ను మరోమారు కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పపువ్వు సారా మంచిదే గానీ.. ఇందిరమ్మ పేరు పెట్టకండంటూ రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. రాకేష్రెడ్డివ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రూల్స్ ప్రకారమే సభ నడవాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్,బీజేపీ ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చర్చను పక్కదారి పట్టించడం సరైన పద్దతి కాదన్నారు. ఒక్క విషయాన్ని పట్టుకుని గంట సమయం వృథా చేయడం సరికాదన్నారు. రాకేష్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న స్పీకర్.. కొత్త సభ్యులు పొరపాటు చేస్తే ఫ్లోర్ లీడర్ సరిచేయాలని సూచించారు.తానేం తప్పు మాట్లాడలేదన్న రాకేష్‌రెడ్డి.. ప్రతి స్కీమ్‌కు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు.. ఈ స్కీమ్‌కు ఆమె పేరు పెట్టొద్దని చెప్పానంటూ రాకేష్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే హౌస్ కమిటీ వేయండి.. ఇందిరమ్మపై తప్పుగా ప్రచారం చేస్తుంటే తానూ మాత్రమే ఖండించానని రాకేష్‌రెడ్డి అన్నారు. ఇప్పపువ్వు సారా ఫ్యాక్టరీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని చెప్పడం తప్పేమీ కాదంటూ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందిరమ్మ పేరు ఎందుకు తెచ్చారో రాకేష్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేని మంత్రి సీతక్క అన్నారు. -
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. రేవంత్‌పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్‌లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
తగ్గేదేలే.. తెగదెంపులే!
జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్‌లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్‌రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్‌రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్‌రెడ్డితో చర్చించారు. వారు జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్‌రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్‌రెడ్డి ఓడిపోవడం.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో జీవన్‌రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్‌రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్ పెద్దలు.. మెట్టు దిగని జీవన్‌రెడ్డి జీవన్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్‌రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్‌రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్‌గౌడ్ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. నేడు సమావేశం: జీవన్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్‌రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే జీవన్, జీవన్ అంటే కాంగ్రెస్‌లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


