సిట్టింగ్‌ జడ్జితో ఓకే: హరీశ్‌ | BRS Leader Harish Rao Fires On Revanth Reddy | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ జడ్జితో ఓకే: హరీశ్‌

Mar 30 2026 5:34 AM | Updated on Mar 30 2026 5:34 AM

BRS Leader Harish Rao Fires On Revanth Reddy

సీబీసీఐడీ, హౌస్‌ కమిటీ వద్దు: హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్‌ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్‌ కుంభకోణం, బావమరిది అమృత్‌ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్‌రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. తాను చేసిన సవాల్‌పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్‌రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్‌మెంట్‌తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్‌మెంట్‌కు వచ్చిన వారికి క్లియర్‌ చేస్తున్నారు. సెటిల్‌మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్‌ఎస్‌ వదిలిపెట్టదు’అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్‌ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. 

మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి.. 
‘సీబీసీఐడీ సీఎం రేవంత్‌రెడ్డి జేబు సంస్థ. మైనింగ్‌ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్‌ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్‌ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ టెండర్‌ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్‌ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్‌రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. 

అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్‌ కమిటీ వేయాలనే మా డిమాండ్‌పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్‌ వాడిన భాషను కూడా ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేయాలి. దళితులపై కాంగ్రెస్‌ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్‌లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్‌లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్‌ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌ నుంచి తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్‌రావు తెలిపారు. 

ముఠా నాయకుడిలా రేవంత్‌: వేముల ప్రశాంత్‌రెడ్డి 
మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్‌ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్‌ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్‌ కమిటీ డిమాండ్‌ నిరాకరించడం సరికాదు. రేవంత్‌ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్‌ఎస్‌ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement