విధి లేకే వీడుతున్నా: జీవన్‌రెడ్డి | Jeevan Reddy Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి ప్లాన్‌ ప్రకారం పార్టీలో చేరి సీఎం అయ్యిండు: జీవన్‌రెడ్డి

Mar 26 2026 4:31 AM | Updated on Mar 26 2026 11:51 AM

Jeevan Reddy Fires On CM Revanth Reddy

కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై 

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ.. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి సెలవు 

రేవంత్‌రెడ్డి ప్లాన్‌ ప్రకారం పార్టీలో చేరి సీఎం అయ్యిండు

పార్టీని సొంత ఆస్తిగా భావిస్తున్నాడు 

అడ్డొస్తే తొక్కుతా అంటున్నారు.. ఎంత మందిని తొక్కుతారు..?

చంద్రబాబు, కేసీఆర్‌నే ఎదిరించా.. ఇక రేవంత్‌తోనే పోరాటం 

కార్యకర్తల సమావేశంలో జీవన్‌రెడ్డి

జగిత్యాల: కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్‌లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్‌ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. 

ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్‌రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్‌పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్‌కు ఎదిరించే వారు వద్దని, రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

విధిలేకనే వీడుతున్నా... 
నేను 1984లో కాంగ్రెస్‌లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్‌ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. 

విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్‌ఎస్‌ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు.  

వేం నరేందర్‌రెడ్డి ఎవరు? 
అసలు వేం నరేందర్‌రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్‌ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్‌లో చేరలేదు. 

పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్‌ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్‌ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.  

రేవంత్‌పై పోరాటం 
రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్‌ఎస్‌ను ఎదిరించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా.   

Advertisement
 
Advertisement
Advertisement