మండలి నుంచీ బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ | BRS suspension from the council | Sakshi
Sakshi News home page

మండలి నుంచీ బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌

Mar 31 2026 3:39 AM | Updated on Mar 31 2026 3:39 AM

BRS suspension from the council

గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్‌ఎస్‌ నేతలు

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై సభా సంఘం లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ప్రతిపక్షం పట్టు

వాయిదా తీర్మానం.. తిరస్కరించిన చైర్మన్‌ గుత్తా .. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలు

50 నిమిషాలపాటు ఆందోళన

బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం... ఆమోదించిన చైర్మన్‌

11 మంది సభ్యులపై ఒకరోజు వేటు

మండలి చరిత్రలో ఇదే తొలిసారి

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మైనింగ్‌ అంశంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం వేయాలని.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు సోమవారం శాసనమండలిలో ఆందోళనకు దిగడంతో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారిని ఒకరోజుపాటు సస్పెండ్‌ చేశారు. మండలి చరిత్రలోనే తొలిసారి ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. అంతకుముందు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అక్రమాలపై సభా సంఘం లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మండలిలో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో 50 నిమిషాలపాటు హోరెత్తించారు. కాగితాలు చించి చైర్మన్‌ కుర్చీవైపు విసిరేందుకు ప్రయత్నించారు. 

మార్షల్స్‌ అడ్డుకోగా మరోసారి కాగితాలు చించి విసిరారు. వాటిలో కొన్ని గుత్తా సుఖేందర్‌రెడ్డిపైనా పడ్డాయి. ‘పెద్దల సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉంది. ఇలా ఆందోళన చేయడం సరైంది కాదు. సభ్యులు వెనక్కి వెళ్లి వారి స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్ష నేత తమ సభ్యులను కంట్రోల్‌ చేయాలి. సభా కార్యక్రమాల నిర్వహణకు సభ్యులు సహకరించాలని’ అని చైర్మన్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన కొనసాగించారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనల మధ్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. 

అనంతరం ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న అద్దంకి దయాకర్‌ బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరును తప్పుబట్టారు. తల్లిదండ్రుల కోసం పెట్టిన గొప్ప బిల్లుపై చర్చలో పాల్గొనకపోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడాక సభ్యుల ఆందోళన మధ్యే బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఈ సమయంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రెండుసార్లు కలగజేసుకొని బీఆర్‌ఎస్‌ కోరినట్టు ఈ అంశంపై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. 

అయినా శాంతించని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు.. ఆందోళన కొనసాగిస్తుండటంతో వారిని సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్‌. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, తాతా మధుసూదన్, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం. కోటిరెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యులంతా బయటకు వెళ్లాలని చైర్మన్‌ కోరగా ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు తదితరులు సభలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. చివరకు మార్షల్స్‌ బలవంతంగా వారిని బయటకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

గన్‌పార్కులో నిరసన.. 
శాసనమండలిలోకి సోమవారం వెళ్లే ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతోపాటు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ మైనింగ్‌ అక్రమాలపై విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ప్లకార్డులతో మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.  

సస్పెన్షన్‌ పిరికిపంద చర్య: దేశపతి శ్రీనివాస్‌ 
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌ను ఆధారాలతో సహా సభ ముందు పెడితే నిజాలు బయటపడతాయనే భయంతో తమను సస్పెండ్‌ చేయడం పిరికిపంద చర్య అని శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ విప్‌ దేశపతి శ్రీనివాస్‌ ఆరోపించారు. సాంకేతిక ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, సభా సంఘం వేసేందుకు ఎందుకు భయపడుతుందో చెప్పాలని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement