భూ కబ్జా కారకుడు పొంగులేటి కుమారుడే: కేటీఆర్‌ | BRS Leaders Visit In vattinagulapally Over Land Issues | Sakshi
Sakshi News home page

భూ కబ్జా కారకుడు పొంగులేటి కుమారుడే: కేటీఆర్‌

Mar 30 2026 11:51 AM | Updated on Mar 30 2026 12:09 PM

BRS Leaders Visit In vattinagulapally Over Land Issues

సాక్షి, రంగారెడ్డి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం వట్టివాగులపల్లిలో పర్యటిస్తోంది. భూ బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు సమావేశమయ్యారు. ఈ క్రమంలో బాధితులు.. మంత్రి పొంగులేటి కుమారుడిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. దీంతో, కబ్జాకు గురైన భూములను బీఆర్‌ఎస్‌ బృందం పరిశీలించింది. కాగా, రాఘవా కన్‌స్ట్రక్షన్స్‌ కబ్జాకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు.

అనంతరం మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..‘మంత్రి పొంగులేటి కుమారుడే కబ్జాలకు పాల్పడ్డాడు. రాఘన కనస్ట్రక్షన​్‌ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. బాధితులను బెదిరించి 27 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే భూమి ఉంది. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది.

దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (AD)తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.

ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ క్రమంలోనే అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement