తగ్గేదేలే.. తెగదెంపులే! | TPCC President talks with Jeevan Reddy fail | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే.. తెగదెంపులే!

Mar 25 2026 4:27 AM | Updated on Mar 25 2026 4:27 AM

TPCC President talks with Jeevan Reddy fail

జీవన్‌రెడ్డితో భేటీ అయిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ , ఆది శ్రీనివాస్‌

జీవన్‌రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడి చర్చలు విఫలం?

మాజీమంత్రి ఇంటికి ఏఐసీసీ కార్యదర్శులు సచిన్‌ సావంత్, వంశీచంద్‌రెడ్డి 

రాజీనామాకే మొగ్గు.. నేడు కార్యకర్తలతో సమావేశం  

ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టం చేయని సీనియర్‌ నేత

జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్‌లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్‌రెడ్డి నివాసానికి కాంగ్రెస్‌ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్‌రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్‌రెడ్డితో చర్చించారు. 

వారు జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం జీవన్‌రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్‌రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. 

మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్‌రెడ్డి ఓడిపోవడం.. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్‌ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో జీవన్‌రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్‌రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు.  

పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్‌ పెద్దలు.. మెట్టు దిగని జీవన్‌రెడ్డి 
జీవన్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్‌ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. 

చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్‌రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్‌కుమార్‌గౌడ్‌ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్‌రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్‌గౌడ్‌ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది.  

నేడు సమావేశం: జీవన్‌రెడ్డి 
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్‌లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్‌ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు.  

నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు 
కాంగ్రెస్‌ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్‌రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్‌ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్‌లో చేరారు. 

అప్పటి నుంచి కాంగ్రెస్‌ అంటే జీవన్, జీవన్‌ అంటే కాంగ్రెస్‌లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement