బ్లాక్‌ మెయిలింగ్‌కు భయపడం.. మైనింగ్‌పై నిగ్గుదేలుస్తాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments At Telangana Legislative Assembly On Mining | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ మెయిలింగ్‌కు భయపడం.. మైనింగ్‌పై నిగ్గుదేలుస్తాం: సీఎం రేవంత్‌

Mar 29 2026 1:59 AM | Updated on Mar 29 2026 1:59 AM

CM Revanth Reddy Comments At Telangana Legislative Assembly On Mining

2014 నుంచి మైనింగ్‌ లీజులు, అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరుపుతాం 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా నిజాలు నిగ్గుతేల్చి నివేదిక ప్రవేశపెడతాం 

శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన

రాఘవ కన్‌స్ట్రక్షన్స్, హరీశ్‌ సోదరుడి మైనింగ్‌.. అన్నింటిపై విచారణ చేపడతాం 

ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం.. మైనింగ్‌ తప్పిదాల్లో ఎవరినీ ఉపేక్షించం 

గతంలో హరీశ్, కేటీఆర్‌ రూ. వేల కోట్ల ఇసుక మాఫియా నడిపారు 

ఆదాయ పంపకాల్లో తేడాలతోనే కవితను కేటీఆర్‌ బయటకు గెంటారు 

ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా గట్టి చర్యలు తీసుకున్నాం 

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసు ఇచ్చి రూ. కోటిన్నరపైనే వసూలు చేశాం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ విషయంలో విపక్ష బీఆర్‌ఎస్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని.. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఏమాత్రం భయపడబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్‌ 2 నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్‌ లీజులు, అక్రమాలపై పూర్తిస్థాయి సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రధానంగా అక్రమ మైనింగ్‌ ఆరోపణలు వచ్చిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, హరీశ్‌ సోదరుడి మైనింగ్‌ సంస్థ సహా ఆరు సంస్థలపైనా సమగ్ర దర్యాప్తు ఉంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ విచారణ ముగించి నిజాలను నిగ్గుతేల్చి సభ ముందు నివేదికను ఉంచి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ మంత్రి పొంగులేటికి చెందినదని.. ఆ సంస్థ మైనింగ్‌ అక్రమాలపై సభాసంఘాన్ని వేయడంతోపాటు విచారణ సజావుగా సాగేలా సంబంధిత మంత్రి రాజీనామా చేయాలంటూ సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. సభ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతోపాటు అక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఇసుక లేదా లీజు మాఫియాలో గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి సంబంధిత వ్యక్తులను పార్టీలో చేర్చుకొని మళ్లీ ఆ చార్జీలను తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ ఈ విచారణ ద్వారా తేల్చి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా, ఖనిజ లేదా ఇతర ఆదాయానికి గండిపడేలా ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవరినీ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.  

నాడు బెదిరించి.. లీజులు రాయించుకొని 
‘సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో దళితులను ఇసుక లారీతో ఢీకొట్టించి చంపి సంతోశ్‌రావు తండ్రి రవీందర్‌రావుకు సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా అక్రమ ఇసుక రవాణా చేసింది. శిరీష గ్రానైట్స్‌ జియో గ్రానైట్స్‌ ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేవి. గతంలో మైనింగ్‌ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన్ను బెదిరించి వారి మైనింగ్‌ లీజును రాయించుకున్నారు. మిడ్‌వెస్ట్‌ గ్రానైట్స్‌కు సంబంధించి ఇప్పుడు రెవెన్యూ మంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సోదరుడు మహేశ్‌రావు అక్రమ మైనింగ్‌ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్‌ అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణే కాకుండా ఈడీ విచారణ కూడా జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్‌పై గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి లొంగదీసుకొని మళ్లీ ఆర్బిట్రేషన్‌లో తగ్గించి గాయత్రి గ్రానైట్స్‌ రాయించుకొని అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు’అని సీఎం రేవంత్‌ ఆరోపించారు. వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు.
 
ఇసుక ఆదాయం పెంచాం.. 
‘మేం అధికారంలోకి వచ్చాక పెంచిన ఆదాయం కళ్ల ముందు ఉంది. రాష్ట్రానికి ఇసుక ద్వారా ఆదాయం 2020–21లో రూ. 721 కోట్ల ఆదాయం వస్తే 2025–26లో రూ. 972 కోట్లు (35 శాతం) పెంచాం. నిర్మాణ రంగం కుంటుపడిందని, రియల్‌ ఎస్టేట్‌ దెబ్బదిన్నదని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ దెబ్బతింటే మేం ఇసుకను బుక్కుతున్నామా? బిర్యానీ వండుకొని తింటున్నామా? ఇసుకలోనే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం పెరిగిందంటే అర్థం ఏమిటి?’అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.  

బురదజల్లేందుకే బ్లాక్‌మెయిలింగ్‌.. 
‘బీఆర్‌ఎస్‌ నేతల దోపిడిని నిలువరించి ఇసుక, మైనింగ్‌లో ఆదాయం పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వచ్చి గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ సాగించిన దోపిడి ప్రజలకు అర్థమవుతుందనే సంబంధిత మంత్రిపై బురదచల్లేందుకు, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఏ రెడ్డికైనా ఏదో ఒక రూపంలో బంధువులు, దూరపు బంధువులు ఉండటం సహజమే. మంత్రి పొంగులేటి, వారి కుటుంబ సభ్యులు, ఎవరో బంధువుల మధ్య ఏవో గొడవలు ఉంటే వాటితో మంత్రికేం సంబంధం? సొంత చెల్లినే ఇంట్లోంచి వెళ్లగొట్టి దోపిడికి పాల్పడిన మీరు.. మంత్రి బంధువులకు ఏవో వ్యాపారాలు ఉన్నాయని పొంగులేటికి ముడిపెట్టి ఆయన్ను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇటువంటి వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. 

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై గతంలోనే చర్యలు తీసుకున్నాం.. 
‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించి గతంలోనే ప్రభుత్వం నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవడంలో భాగంగా సీనరేజీ చార్జీ కింద రూ. 1.52 కోట్లు, పర్మిట్‌ ఫీజు కింద రూ. 1.22 కోట్లను ప్రభుత్వం, మైనింగ్‌శాఖ కట్టించుకుంది. ఇదేదో బీఆర్‌ఎస్‌ వాళ్లు కనిపెట్టి, ఫిర్యాదు చేస్తే తాము తీసుకున్న చర్య కాదు. మా ప్రభుత్వం తరఫున మైనింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆ సంస్థకు నోటీసులిచ్చి చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రతిపక్షం కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. 2025 ఆగస్టు 8న ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో మంత్రికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే నోటీసులిచ్చి ఆదాయం రాబట్టే ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగాయా?’అని విపక్ష సభ్యులను సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ప్యానెల్‌ స్పీకర్‌ బాలూ నాయక్‌ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement