కేటీఆర్‌తో రేవంత్‌ కుమ్మక్కు..: బండి సంజయ్‌ | Bandi Sanjay Fires On KTR, Revanth Reddy | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌తో రేవంత్‌ కుమ్మక్కు..: బండి సంజయ్‌

Mar 30 2026 5:30 AM | Updated on Mar 30 2026 10:34 AM

Bandi Sanjay Fires On KTR, Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి కుమ్మక్కు అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. అందుకే కేటీఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదన్నారు. కేవలం హరీశ్‌రావును టార్గెట్‌ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని చెప్పారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో సంజయ్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ‘కేటీఆర్‌ అతిపెద్ద అవినీతిపరుడు. 

బీఆర్‌ఎస్‌ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్‌ సంగతి తెలిసినా రేవంత్‌ ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్, రేవంత్‌ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి’అని నిలదీశారు. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయి. హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా ఇస్తున్నారు. రేవంత్‌కు కాళేశ్వరం, హరీశ్‌పై ఉన్నంత పగ కేటీఆర్‌పై లేదు. ఎందుకంటే ఫార్ములా–ఈ కేసు, డ్రగ్స్, ఫాంహౌజ్‌ కేసులపై మాట్లాడటం లేదు. కేటీఆర్, కవిత మధ్య సంధి కుదుర్చేందుకు రేవంత్‌ యతి్నస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని రేవంత్‌ భావిస్తున్నారు’అని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రేవంత్‌ డబ్బులు సమకూరుస్తున్నారని, కర్ణాటక నుంచి డబ్బులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్‌తో పొత్తు జరగని పని 
‘కేసీఆర్‌పై ఉన్న కోపం కూడా రేవంత్‌కు పోయింది. ఇద్దరి మధ్య డీల్‌ కుదిరింది. ఆనాడు తనను జైలుకు పంపించిన సంగతి రేవంత్‌ మర్చిపోయిండు. ఆ పౌరుషం, రోషం కూడా పోయింది. ఇకపై కేసీఆర్, కేటీఆర్‌ అవినీతిపై రేవంత్‌ విచారణ జరిపే అవకాశమే లేదు’అన్నారు. ‘బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు జరగని పని. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్‌ కుటుంబ అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే మేం పోరాడాం. ఆ పార్టీని ఓడించాం. మోదీ ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో మేం పొత్తు ఎందుకు పెట్టుకుంటాం’అని సంజయ్‌ పేర్కొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement