విద్య, వైద్యం.. నిధులు పుష్కలం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments At Telangana Legislative Assembly | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం.. నిధులు పుష్కలం: సీఎం రేవంత్‌

Mar 27 2026 1:47 AM | Updated on Mar 27 2026 1:47 AM

CM Revanth Reddy Comments At Telangana Legislative Assembly

ఆరోగ్యశ్రీతో ఆస్పత్రుల మూత తప్పుడు ప్రచారం

ఈ పథకం కింద నెలకు సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నాం 

ప్రస్తుతం రూ.727.75 కోట్ల బకాయిలున్నాయి..

సీఎంఆర్‌ఎఫ్‌ చెల్లింపులు కూడా పెరిగాయి.. 

శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: విద్య, వైద్యం.. ఈ రెండు అంశాలు ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రెండు విభాగాలకు సరిపోయినన్ని నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కోత విధించబోమని చెప్పారు. లక్ష్య సాధనకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేతలు హరీశ్‌రావు, సంజయ్‌ తదితరులు లేవనెత్తిన అంశాలపై సీఎం సమాధానమిచ్చారు.  

తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 
‘రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ఈ పథకం కింది బకాయిలతో ప్రైవేటు ఆస్పత్రులు మూత పడుతున్నాయనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. 2023 డిసెంబర్‌ 7వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.627 కోట్లు ఉంటే.. వారసత్వంగా వచ్చిన ఆ బకాయిలను చెల్లిస్తూనే ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. 

ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పటివరకు రూ.2,408.51 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.1480.52 కోట్లు విడుదల చేశాం. ప్రస్తుతం రూ.727.75 కోట్ల బకాయిలున్నాయి. వారసత్వ బకాయిలు మరో రూ.100 కోట్లు ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. ఇప్పటివరకు దీని కింద రూ.2,046 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ.4,500 కోట్లు ఖర్చు చేశాం..’అని సీఎం వివరించారు. 

బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు 
రాష్ట్రంలో 35 మెడికల్‌ కాలేజీలున్నాయి. బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తక్కువగా ఉంది. పేదలు వైద్యం కోసం వెళ్లే దగ్గర కొన్నిచోట్ల సరైన డాక్టర్లు లేరు..రోగులున్న చోట నిపుణులు లేరు. అందువల్ల ఆరోగ్యశ్రీ రోగులను బోధనాసుపత్రులకు పంపించాలనుకుంటున్నాం. ఆరోగ్యశ్రీతో పాటు సీఎంఆర్‌ఎఫ్‌ను ఈ ఆస్పత్రులకు ఇస్తాం. దీంతో ఆస్పత్రుల నిర్వహణ మెరుగుపడుతుంది. 

ఈ ఆస్పత్రుల పర్యవేక్షణకు గ్రూప్‌–1 లేదా గ్రూప్‌–2 అధికారులను నియమిస్తాం. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయనున్నాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే ధీమాగా మారుతుంది. విదేశాల్లో ఉండే తెలుగు డాక్టర్ల సేవలు వినియోగించుకునేలా, ఇక్కడికి వచ్చినప్పుడు చికిత్స అందించేలా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ తయారు చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఆరోగ్యశ్రీపై ప్రైవేటు ఆస్పత్రుల ఆసక్తి: మంత్రి దామోదర 
ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ఉత్సాహం చూపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా 330 కార్పొరేట్‌ ఆస్పత్రులు చేరాయన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నాయని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.  

పెట్టుబడులపై ఓర్వలేకే విమర్శలు: మంత్రి శ్రీధర్‌బాబు 
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని చూసి ప్రతిపక్ష పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. దావోస్‌ పెట్టుబడులు, ఇతర అంశాలపై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దావోస్‌కు వెళ్లిన 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం 44 ఎంవోయూలు చేసుకోవడం ద్వారా రూ. 2,19,182 కోట్లు పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. ఎంవోయూలు, పెట్టుబడులు, కంపెనీలు తదితర అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement