మూసీ ప్రాజెక్ట్‌.. సబితపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు | Musi River Revival, CM Revanth Reddy Inaugurates Omkareshwara Temple Construction With Rs 700 Crore Plan, More Details Inside | Sakshi
Sakshi News home page

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌.. సబితపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Mar 28 2026 11:12 AM | Updated on Mar 28 2026 11:31 AM

CM Revanth Reddy Key Comments On MUSI Project

సాక్షి, రంగారెడ్డి: మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మూసీ రివర్​ ఫ్రంట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​ ఇప్పటికే డిజైన్లను ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌లో ముందడుగు ఇది. నదులు కాలుష్యం అవుతున్నాయి. నదులను ప్రక్షాళన చేయాలని చాలా మంది సీఎంలు ఆలోచించారు. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన దైవకార్యంగా భావిస్తున్నా. 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు. మానవ తప్పిదం. మూసీ ప్రక్షాళన అత్యవసరం. హైదరాబాద్‌ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లో పంటను కొనే పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ మూసీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కొద్ది మంది రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతున్నారు. ఎవరైనా దీనికి పెడార్థాలు తీసినా, రాజకీయం చేసినా ప్రభుత్వం శివతాండవం చేస్తుంది.

బీఆర్‌ఎస్‌ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌ కామెంట్స్‌ చేశారు. ఇదే ప్రాంతంలో ఉండే అక్క అనేక రకాలుగా రాజకీయ లబ్ది పొందారు. అక్క కొడుకే ఎన్జీటీలో కేసు వేశాడు. మూసీ పునరుద్దీకరణ ఆపాలని కేసు పెట్టాడు. కేసు వేయడానికి వారికి మనసు ఎలా వచ్చింది?. ప్రజాప్రతినిధిగా వారికి అర్హత ఉందా?. ఎవరు అడ్డం వచ్చినా మూసీ నదిని పునరుద్ధరిస్తాం. ఈ అవకాశం చరిత్రలో ఎవరికో ఒకరికి వస్తుంది. దైవ నిర్ణయంతో ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు అవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. విమర్శలు, అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి ఉంటుంది. సముద్రం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మానవ తప్పిదం వల్లే మూసీకి ఇలాంటి పరిస్థితి. దీంతో హైదరాబాద్ నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న పొల్యూషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీని చూసి అయినా మనం నేర్చుకోవాలి’ అని అన్నారు.

ఇక, ఇక్కడ.. చారిత్రక వీరభద్రస్వామి ఆలయం సమీయంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగనుంది. సుమారు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుండగా 100 అడుగుల గాలి గోపురం నిర్మాణం చేస్తారు. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించాక వేర్వేరు మండపాలు ఉంటాయి. మూసీ నది మధ్యలో 100 అడుగుల శివని విగ్రహం ఏర్పాటు చేస్తారు. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఈ దేవాలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మిస్తారు. ఆలయం వద్ద 199 కోట్లతో వెయ్యి నుంచి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా మూడంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement