గత బీఆర్‌ఎస్ సర్కారు భూకబ్జాలపై హౌస్ కమిటీ వేయాలన్న కడియం
ఆయన్ను ఉద్దేశించి పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరకర సైగలు చేశారన్న అధికారపక్షం
కడియంను తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించినట్లు ఆరోపణ
కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని మంత్రులు, దళిత ఎమ్మెల్యేల డిమాండ్
ఆయన ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తూ సభలో తీర్మానం
పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసేలా కౌశిక్‌పై చర్యలు ఉండాలన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆదివారం బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. అక్రమ క్రషింగ్‌కు పాల్పడిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై విచారణకు సభా సంఘం వేయాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ రెండోరోజూ అసెంబ్లీలో పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే పాడి కౌశిక్‌రెడ్డి సహా మరికొందరు అందుకు అభ్యంతరం తెలిపారు. కడియం ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మండిపడ్డ కడియం.. ధరణిని అడ్డుపెట్టుకొని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అయితే కడియం మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి ఆయన వైపు చేతులతో అసభ్యకరమైన రీతిలో సైగలు చేశారని.. తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.
ఇది అత్యంత దారుణ ప్రవర్తన: మంత్రులు
మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ కడియం శ్రీహరిపట్ల పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తన అత్యంత దారుణమని తప్పుబట్టారు. కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని హరీశ్‌రావు వంటి నేతలు ప్రోత్సహించడం సరికాదని హితవు పలికారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కవ్వంపల్లి సత్యనారాయణ, రాంచందర్, కాలె యాదయ్య, గడ్డం వినోద్, శ్రీగణేశ్, ఆదినారాయణ, జయదీర్‌రెడ్డి, యశస్వినీరెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల యాదయ్య తదితరులు డిమాండ్ చేశారు.
కత్తులతో కోలాటం ఆడతం.. ఖబడ్దార్: మందుల సామేల్
పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ దళిత సభ్యుడు మందుల సామేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కత్తులతో కోలాటం ఆడతం బిడ్డా ఖబడ్దార్.. ఏం అనుకుంటున్నవ్? మా పడికత్తుల లేస్తేననుకో నీ గడికి వేలాడగడ్తం బిడ్డా.. ఎవరిని బెదిరిస్తున్నవ్? దళితులు, గిరిజనులంటే లెక్కలేనితనంతో ఉంటే మీ గడిల్లో దూరేరోజు కూడా వస్తుంది’ అని హెచ్చరించారు.
కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పీకర్‌ను కోరారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు కేటీఆర్, హరీశ్‌రావు కడియం శ్రీహరికి, దళితులకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ దళిత శాసనసభ్యులు, మంత్రులు డిమాండ్ చేశారు. చట్టసభల్లోనే దళితులకు రక్షణ కొరవడిందని వేముల వీరేశం ఆరోపించారు. దళితులు, ఆదివాసులైన తాము అడవుల్లో క్రూర మృగాల మధ్య పెరిగామని, తాము యుద్ధం చేస్తే తట్టుకోలేరని బాలూ నాయక్ హెచ్చరించారు. తుపాకీ గురిపెడితే భయపడే ప్రసక్తే లేదన్నారు.
ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానం..
కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డిపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానించారు. సభా మర్యాదలకు విరుద్ధంగా అసభ్యకర రీతిలో వ్యవహరించిన పాడి కౌశిక్‌రెడ్డి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రూల్ బుక్‌లో ఉన్న నిబంధనలను చదవి వినిపిస్తూ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు ఉండాలన్నారు.


