సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి నాపై పోటీచేయాలని ఆహ్వానిస్తున్నా: హరీశ్
తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ సీఎం కాలేడు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్‌ఎస్సే, సీఎం కేసీఆరే
నియోజకవర్గాల పునర్విభజన,మహిళా రిజర్వేషన్లతో మాకు లాభమే
బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికపై వేచిచూడండి..
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్‌రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
జీవన్‌రెడ్డి చేరికపై వేచిచూడండి
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా, బీఆర్‌ఎస్‌లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్‌రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్‌ను మరోమారు కలుస్తామన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.


