రేవంత్‌కు నా తడాఖా చూపిస్తా | Jeevan Reddy interesting on KCR and Bandi Sanjay | Sakshi
Sakshi News home page

నా పోరాటం ఎలా ఉంటుందో కాంగ్రెస్‌కు చూపిస్తా

Mar 25 2026 7:12 PM | Updated on Mar 25 2026 7:40 PM

Jeevan Reddy interesting on KCR and Bandi Sanjay

సాక్షి టీవీతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సాక్షి, జగిత్యాల: తాను కాంగ్రెస్‌ పార్టీ వీడటానికి  ప్రధాన కారణం రేవంత్ రెడ్డేన‌ని మాజీ మంత్రి తాటిపర్తి జీవ‌న్‌రెడ్డి అన్నారు. హ‌స్తం నుంచి తాను బ‌య‌ట‌కు రావ‌డానికి పార్టీ ఫిరాయింపులు మరో కారణమ‌ని వెల్ల‌డించారు. సీనియ‌ర్ నాయ‌కుడినైన త‌న‌ను ఎంతో అవ‌మానించార‌ని వాపోయారు. అధిష్టానం కూడా త‌న‌ను విస్మరించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడుగడుగునా అవమానాలు, అన్యాయాలతో విసిగిపోయి పార్టీని వీడిన‌ట్టు వివ‌రించారు. బుధ‌వారం ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా సాక్షి టీవీతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

''ఫిరాయింపుదారులతో పార్టీ నిండిపోయి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రశ్నించా.. తప్పా..? నలభై ఏళ్ల ప్రస్థానాన్ని తెంపుకోవడం బాధాకరమే. కేసీ వేణుగోపాల్‌కు అంతా తెలుసు. అయినా అధిష్ఠానం ఇగ్నోర్ చేసి, హ్యుమిలేట్ చేస్తే పార్టీలో ఎలా కొనసాగాలి? పట్టపగలే మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ప్రతిపాదించిన నాయకుడు, నా అనుచరుడు గంగారెడ్డి దారుణహత్యకు గురికావ‌డం నన్ను తీవ్రంగా కలిచివేసింది. గంగారెడ్డికి ప‌ద‌వి కోసం నేను సీఎం రేవంత్‌ను (Revanth Reddy) కలిశాను. ఆయన ఓకే అన్నారు. అంతలోనే మనసు మార్చుకున్నారు. గంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే ఆయన హత్య జరుగకపోవునేమో?

ఒక గంగారెడ్డి ఇష్యూనే కాదు.. బీఆర్ఎస్ హయాంలో ఆధిపత్యం చెలాయించిన పోలీసుల‌ బదిలీలు, మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ ఇలా ఎన్నో మనసును కలిచివేశాయి. ఇగ్నోరెన్స్, హ్యుమిలేషన్‌తో విసిగిపోయాను. ఎమ్మెల్యేగా ఐదేళ్లు, ఎమ్మెల్సీగా ఐదేళ్లపాటు అధికార బీఆర్ఎస్ తో ఒంటరి పోరాటం చేస్తే నేను కనీసం మంత్రి పదవికి అర్హుణ్ని కానా..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నా ఎమ్మెల్సీ పదవి 20 నెలల కాలముంటే నాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండేగా? అడుగడుగునా అవమానాలు, అన్యాయాలతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఏఐసీసీ సభ్యత్వానికి నేను రాజీనామా చేశాను.

కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి, సాక్షి వార్తలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నాకు మొదటి నుంచి మంచి దోస్త్. అటు అరవింద్‌తోనూ, ఇటు బండి సంజయ్ తోనూ నాకు రాజకీయాలకతీతంగా సంబంధాలున్నాయి. ఇంకా నా భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోలేదు. మీకు చెప్పే పార్టీ మారుతా. కచ్చితంగా నా తడాఖా, నా పోరాటం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చూస్తార''ని జీవ‌న్‌రెడ్డి అన్నారు. 

చ‌ద‌వండి: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement
 
Advertisement
Advertisement