సాక్షి, హైదరాబాద్: కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని పాడుచేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కల్తీకి కాదేది అనర్హం' అన్న చందంగా మార్కెట్‌లో ప్రతి వస్తువును కల్తీచేస్తున్నారు. నగరంలో ఇటీవల కళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ పన్నీర్, పచ్చళ్ల కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులు కూడా బయటపడ్డాయి. తాజాగా.. కల్తీ కొబ్బరిపొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు.
హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ, ఖైరతాబాద్ జోన్‌లు) మరియు గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. బేగంబజార్‌లోని కల్తీ కొబ్బరి పొడి తయారీ కేంద్రంపై దాడి చేశారు. అనారోగ్యకరమైన పద్ధతుల్లో కొబ్బరి పొడిని ప్యాకింగ్ చేస్తున్న నిందితుడు నకుల్ మరోటియాను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో రూ.21 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
నిల్వ ఉంచిన కొబ్బరి పొడి (8,300 కిలోలు), సీలింగ్ ప్యాకింగ్ యంత్రాలు(3), బరువు తూచే యంత్రాలు(3), ప్యాకింగ్ కవర్లను సీజ్ చేశారు. నిందితుడు నకుల్ మరోటియా బేగంబజార్‌లోని బాలాజీ పురుషోత్తం కోకోనట్ బిజినెస్ షాప్ పేరుతో అక్రమంగా కొబ్బరి పొడిని తయారు చేస్తున్నాడు.
నిందితుడు కర్ణాటక నుండి తక్కువ ధరకే నాణ్యత లేని కొబ్బరి పొడిని కొనుగోలు చేసి, దానిని 'చేతక్' (Chetak) బ్రాండ్ ప్యాకెట్లలో నింపి, అసలైన కొబ్బరి పొడిగా విక్రయిస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. ఈ ప్యాకెట్లపై ఎలాంటి బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ), ఆహార భద్రతా ప్రమాణాల (FSSAI) లైసెన్స్ వివరాలు లేవని విచారణలో తేలింది.
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు..
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా పట్టుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, ఫుడ్ అడల్టరేషన్ (ఆహార కల్తీ నియంత్రణ) విభాగం అధికారులతో కలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్, ఎం.ఎం. పహాడీలో గల "డెక్కన్ ట్రేడర్స్" గోడౌన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.
సుమారు మూడున్నర లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ (70 క్వింటాళ్లు), సింథటిక్ ఫుడ్ కలర్ ప్యాకెట్లు(1 బాక్స్), శాంటిక్ యాసిడ్ టిన్:1 (40 లీటర్లు), ఆదిత్య బిర్లా కెమికల్స్(1 బాక్స్)లను సీజ్ చేశారు. నిందితులు ముగ్గురు కలిసి ఎం.ఎం. పహాడీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గోడౌన్లను నడుపుతున్నారు. వీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ప్రమాదకరమైన పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి, హైదరాబాద్ నగరంలోని హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.


