హైదరాబాద్: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనపడుతుండడంతో దీనిపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప‍్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదని అన్నారు.
‘మీరు ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం. అవసరం మేరకు సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకేసారి డ్రమ్‌లు, కంటైనర్లు నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు. ప్రజలు ప‍్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటరింగ్ చేస్తుంది. రూమర్స్, ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు’ అని సూచించారు.
కాగా, తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... ‘డిమాండ్ 25 శాతం పెరిగింది. 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాయి. పెట్రోల్ బంక్ లు క్లోజ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. అహ్మదాబాద్, సూరత్, నాగపూర్, చెన్నైలో ఇలాంటి పరిస్థితి ఉంది. బంక్ లకు క్రెడిట్ సమస్య లేదు. గ్యాస్ అక్రమ రవాణా పై 175 కేసులు నమోదు చేస్తాం. 2,954 వాణిజ్య సిలిండర్ లు సీజ్ చేశాం.
గృహ అవసరాలకు గ్యాస్ ఇబ్బంది లేదు. ఎల్పీజీ బుకింగ్ 15 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది’ అని అన్నారు. కాగా, పెట్రోల్ , డీజల్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఇతర అధికారులు కూడా సూచిస్తు న్నారు. పెట్రోల్ బంక్‌లలో కావాల్సినంత సప్లై జరుగుతుందని అంటున్నారు.


