పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో, కేరళ రాజకీయ నాయకులు కూడా తమదైన యుద్ధం చేస్తున్నారు. అదే ఓట్ల కోసం చేసే యుద్ధం. క్షిపణులు, డ్రోన్లు వంటివి తమ వద్ద లేకపోయినా అభ్యర్థులు, కార్యకర్తలు తాము యుద్ధంలో ఉన్నట్లే భావిస్తున్నారు. కజక్కూట్టం నియోజకవర్గంలో ఈ యుద్ధం మరింత క్లిష్టంగా ఉంటుంది.
రాజకీయ నేతలకు అక్కడి ఎత్తైన అపార్ట్‌మెంట్‌లు పెద్ద ఓటింగ్ యంత్రాల్లా కనిపిస్తాయి. కిటికీలు అభ్యర్థుల పార్టీ గుర్తుల్లా కనిపిస్తాయి. కానీ సమస్య ఏమిటంటే అభ్యర్థులు వస్తే కిటికీలు, తలుపులు రెండూ తెరుచుకోవు. ఆ ఫ్లాట్లలోని వారు తెరవరు. ఇళ్లలో ఇంటింటి ప్రచారం చేసే అలవాటు ఉన్న పార్టీలకు ఐటీ ఉద్యోగులు ఉండే ఫ్లాట్లలో ప్రచారం చేయడానికి మాత్రం ప్రత్యేక వ్యూహాలు అవసరం.
ఎన్నికల్లో ఒక్కోసారి గెలుపు చాలా చిన్న మెజారిటీపై ఆధారపడుతుంది. సరిగ్గా ప్రచారం చేయకపోయినా, అభ్యర్థులు, కార్యకర్తలను ప్రచారంలో ప్రజలు ఆదరించకపోయినా తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ఎన్నికల్లో కజక్కూట్టం నియోజకవర్గంలో పార్టీలకు ఇటువంటి సమస్యే ఎదురవుతుంది.
అక్కడ అన్నీ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు ఉంటాయి. అభ్యర్థులు వెళ్లినా ఆ ఫ్లాట్ల యజమానులు తలుపులు తెరవడం లేదు. రాజకీయ పార్టీల ప్రచారానికి వారు సహకారించడం లేదు. ఐటీ ఉద్యోగులు ఉండే ఈ ఫ్లాట్ల వద్దకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలంటే పార్టీల అభ్యర్థులకు ప్రత్యేక వ్యూహాలు అవసరం. అంతేగాక, ఈ ఫ్లాట్లలో బయటి వాళ్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న ఉద్యోగులు అధికం.
ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం
ఇక్కడ ఓటరు కార్డు ఉన్నవారిలో ఓటింగ్ ఆసక్తి తక్కువ. యువ ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి రారు. ఆ ఫ్లాట్లలో అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉంటుంది. వారి అనుమతి లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ ప్రచారం చేసుకోవడం అసాధ్యం. ఇక్కడ ఇంటింటి ప్రచారం చాలా తక్కువ. అయితే, ఇక్కడి ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం. తక్కువ మెజార్టీతో ఇక‍్కడ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది.
కజక్కూట్టం నియోజకవర్గంలో ఎత్తైన అపార్ట్‌మెంట్లు రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారాయి. అతి తక్కువ మెజార్టీతో ఇక్కడి అభ్యర్థులు గెలుస్తుండడంతో ఆయా ఫ్లాట్ల ఓటర్లను వదులుకునే ప్రసక్తే లేదు. కజక్కూట్టం స్థానిక ఎన్నికల్లో గతంలో ఎల్డీఎఫ్ 1,909 ఓట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రతి ఓటు కీలకంగా మారింది.
పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు వస్తే ఆయా ఫ్లాట్లలో నివసించే వారు తలుపులు తెరవకపోవడం, ప్రచారానికి సహకరించకపోవడం పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే ఈ ఫ్లాట్లలోని చాలా మంది తమకు సహకరించరని పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు.
తక్కువ మెజార్టీతో గెలుపు
కజక్కూట్టం టెక్నోపార్క్ కు నిలయం. ఇక్కడ 1990 దశకంలో వ్యవసాయ భూమిని ఐటీ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు కనపడుతున్నాయి. మూసివేసిన గేట్లు, తలుపులు తీయాలని కోరుతూ వాటిల్లోకి వెళ్లడం రాజకీయ పార్టీల నేతలకు పెద్ద సవాలు.
కజక్కూట్టంలో గతంలో పలు పార్టీల నేతలు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎంఏ వాహిద్ 2001లో రెండు ప్రధాన కూటములను ఓడించి గెలిచారు. 2016 వరకు స్థానాన్ని నిలుపుకున్నారు. 2021లో సీపీఎంకు చెందిన కడకంపల్లి సురేంద్రన్ 7,374 ఓట్ల తేడాతో తిరిగి గెలిచారు.
ఈ నియోజకవర్గంలో 28 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. బీజేపీ 14, ఎల్డీఎఫ్ 10, యూడీఎఫ్ 3, ఒకటి స్వతంత్ర అభ్యర్థి. ఈ సారి సీపీఎం తరఫున సురేంద్రన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వి. మురళీధరన్, కాంగ్రెస్ తరఫున టి. శరత్‌చంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -వెబ్‌డెస్క్


