బంకులు.. బారులు | Motorists are queuing at petrol stations, fearing a petrol shortage | Sakshi
Sakshi News home page

బంకులు.. బారులు

Mar 26 2026 1:53 AM | Updated on Mar 26 2026 9:18 AM

Motorists are queuing at petrol stations, fearing a petrol shortage

పెట్రోల్‌ కొరత భయంతో బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనదారులు

ప్రస్తుత పరిస్థితి

కొన్నిచోట్ల యాజమాన్యాల ‘నో స్టాక్‌’ బోర్డులు 

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన 

సోషల్‌ మీడియాలో వార్తలు, వదంతులతో కలవరం 

కిక్కిరిసిన బంకుల్లో పడిగాపులు 

అవసరం లేకున్నా ట్యాంకులు నింపుకుంటున్న వైనం 

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌లు 

 ‘నో క్రెడిట్‌’, ‘అడ్వాన్స్‌ పేమెంట్‌’ పద్ధతితో కొన్ని బంకులు మూత

ప్రభుత్వం ఏం చెబుతోంది..
చమురు కొరత లేదు, పుష్కలంగా నిల్వలు, నిరాటంకంగా సరఫరా: ప్రభుత్వం 

2 కోట్ల లీటర్ల పెట్రోల్‌ అందుబాటులో ఉంది: పౌరసరఫరాల శాఖ 

హైదరాబాద్‌లో సరిపడా నిల్వలు 

కంపెనీలు, డీలర్లదీ అదే మాట

అయినా పట్టించుకోని ప్రజలు.. నో స్టాక్‌ బోర్డులతో బెంబేలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంధనం సెగ రాష్ట్రంలోని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆయిల్‌ కొరత వార్తలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడా చమురు కొరత లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయం పదేపదే చెబుతోంది. ఆయిల్‌ కంపెనీలు సైతం సరిపడా డీజిల్, పెట్రోల్‌ నిల్వలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్‌ మహానగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడురోజులుగా పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరి కన్పిస్తున్నారు. 

గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కిక్కిరిసి ఉంటున్నాయి. కొన్ని బంకులు నిరాటంకంగా పని చేస్తుంటే.. కొన్నిచోట్ల మాత్రం బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు కన్పిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు, సహజ వాయువుల కొరత వార్తల నేపథ్యంలో ఈ నో స్టాక్‌ బోర్డులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాహనదారులు అవసరం ఉన్నా, లేకపోయినా డీజిల్, పెట్రోల్‌ ట్యాంక్‌ నిండా నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏరోజు కారోజు ఇంధనం నింపుకునే క్యాబ్‌ డ్రైవర్లు, ఇతర గిగ్‌ వర్కర్లు, సామాన్య ప్రజలు కూడా ఎంతో కొంత అదనంగా ట్యాంకు నింపుకోవాలని చూస్తుండటంతో తెరిచి ఉన్న బంకుల వద్ద క్యూలు పెరిగిపోతున్నాయి. 

కొందరు సీసాలు, పెద్దపెద్ద క్యాన్లు, డ్రమ్ముల్లో సైతం ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని బంకులు మూతపడి కన్పిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. బంకులు మూత పడి ఉండటానికి ‘నో క్రెడిట్‌’ సమస్య ప్రధాన కారణమని తెలుస్తుండగా..ప్రభుత్వాలు, ఆయిల్‌ కంపెనీల ప్రకటనలను పట్టించుకోకుండా ప్రజలు ఎక్కడ పెట్రోల్, డీజిల్‌ దొరుకుతోందో తెలుసుకొని మరీ కొనుగోళ్లు చేస్తుండటంతో తెరిచి ఉన్న బంకులు కిక్కిరిసిపోయి కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సోమవారం నుంచే.. 
పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడో మొదలైనా..సోమవారం సాయంత్రం నుంచే బంకుల వద్ద డీజిల్, పెట్రోల్‌ కోసం వాహనదారులు క్యూలు కట్టడం ప్రారంభించారు. ఆ ఫొటోలు టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రసారం కావడంతో చమురు కొరతపై భయాందోళనలు మొదలయ్యాయి. బంకులన్నీ వాహనదారులతో నిండిపోవడం మొదలయ్యింది. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. 

భారీగా పెరిగిన డిమాండ్‌ 
ఇంధన కంపెనీల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 3,600 పెట్రోల్‌ బంకులకు సాధారణంగా రోజుకు సగటున 13,752 కిలోలీటర్ల ఇంధనం అవసరం ఉంటుంది. తదనుగుణంగా ఆయిల్‌ కంపెనీలు సగటున 14,729 కిలోలీటర్లు సరఫరా చేసేవి. కానీ  ప్రస్తుతం డిమాండ్‌ ఒక్కసారిగా 17,246 కిలోలీటర్లకు చేరింది. దీనికి అనుగుణంగా ఆయిల్‌ కంపెనీలు కూడా సరఫరాను 17,898 కిలోలీటర్లకు పెంచినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 

కానీ ఇప్పటికీ కొన్ని బంకులు నోస్టాక్‌ బోర్డులతో మూతపడి కన్పిస్తున్నాయి. మరికొన్ని బంకులు వాహనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రెండు రోజుల్లో రెట్టింపు స్థాయిలో పెట్రోల్‌ విక్రయాలు పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం విక్రయాలు జరగ్గా, 23న ఇది రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుంది. 

వచ్చిన స్టాక్‌ వచ్చినట్టు ఖాళీ 
హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంధనానికి అగచాట్లు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు, రవాణా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డీజిల్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ఉదయం వచ్చిన స్టాక్‌ అదే రోజు ఖాళీ అవుతోంది. దీంతో పలు పెట్రోల్‌ బంకులు మధ్యాహా్ననికే ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టేస్తున్నాయి.  

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌లు 
హైదరాబాద్‌ నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకులన్నీ బుధవారం ఉదయం నుంచే వాహనదారులతో నిండిపోగా, ట్రాఫిక్‌ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

గచ్చిబౌలిలోని ప్యారడైజ్‌ వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌ను పోలీసులే మూసివేయించినట్లు ఖాన్‌ అనే వైద్యుడు ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసిన తర్వాత స్టాక్‌ అయిపోయిందని చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు హైదరాబాద్‌ నగరంలో వేల సంఖ్యలో ఉన్న ఆన్‌లైన్‌లో ఆహారం, నిత్యావసరాలు, ఇతర వస్తువులు చేరవేసే కార్మీకులు, ఉబర్, రాపిడోల వంటి ద్వారా సేవలందించే క్యాబ్‌ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో సైతం వాహనదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. 

క్యాన్లలో పెట్రోల్‌తో ప్రమాదం 
డీజిల్, పెట్రోల్‌ కొరత లేదంటున్న ప్రభుత్వాలు, ఆయిల్‌ కంపెనీలు..ఈ విషయంతో పాటు వాస్తవ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారు ఇబ్బందులు పడకుండా చూడాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాన్లలో పెట్రోల్‌ పోయవద్దని బంకుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, క్యాన్లలో నిల్వ ఉంచుకోవడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని పేర్కొంటున్నారు. 

నో క్రెడిట్‌..అడ్వాన్స్‌ పేమెంట్‌తో అసలు సమస్య! 
రాష్ట్రంలో ఇంధనం కొరత లేదని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఇక డీలర్లు కూడా సంక్షోభానికి కారణం కొరత కాదని, ఆయిల్‌ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలేనని పేర్కొంటుండటం గమనార్హం. వారి కథనం ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో.. గతంలో ఉన్న ‘క్రెడిట్‌’ సౌకర్యాన్ని రద్దు చేసి, ‘అడ్వా¯న్స్‌ పేమెంట్‌’ పద్ధతిని అమలు చేస్తుండటంతో బంకుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లక్షల్లో పేరుకు పోయిన పాత బకాయిలు కూడా సమస్య తీవ్రతకు కారణమవుతున్నట్లు తెలిసింది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్‌ ఇస్తామన్న కంపెనీల నిబంధనతో పలు బంకులు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంకులు మూత పడుతున్నాయి. నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసి తెరిచి ఉన్న బంకులకు వాహనదారులు రెండు, మూడు రెట్ల ఎక్కువ సంఖ్యలో పోటెత్తుతుండటంతో..క్రెడిట్, ఇతర సమస్యల్లేని ఆ బంకుల్లో స్టాక్‌  గంటల్లోనే ఖాళీ అవుతోంది. 

పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ 
‘రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 20 వేల కిలోలీటర్ల పెట్రోల్‌ అందుబాటులో ఉంది. సరఫరా వ్యవస్థలో కూడా ఎలాంటి అంతరాయం లేదు. మంగళవారం ఒక్కరోజే 1,500 పెట్రోల్, డీజిల్‌ ట్యాంకర్లను పంపించాం. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్‌ నిల్వ చేసుకోవద్దు..’ అని పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, అవసరం లేకుండా ఆయిల్‌ కొనుగోలు చేయవద్దని (ప్యానిక్‌ కొనుగోళ్లు) మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఇంధన నిల్వలపై సమీక్ష జరిపారు. 

తప్పుడు ప్రచారం నమ్మొద్దు: హైదరాబాద్‌ సీపీ 
‘హైదరాబాద్‌లో ఇంధనం కొరత లేదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. నగర వ్యాప్తంగా చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు. కేవలం వదంతుల వల్లే రద్దీ ఏర్పడుతోంది..’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన హెచ్చరించారు. నగరంలో తాజా పరిస్థితిపై బుధవారం టీజీసీసీసీలో వారు సమీక్ష జరిపారు.  

అవసరానికి మించి కొనుగోళ్లతో స్టాక్‌ ఖాళీ: డీలర్ల సంఘం 
‘ఇంధన కొరత అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుండటంతో వాహనదారులు పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. మళ్లీ ఆయిల్‌ దొరుకుతుందో లేదో అని అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్టాక్‌ త్వరగా అయిపోతోంది. ప్రజలు వదంతులు నమ్మొద్దు. ప్యానిక్‌ కొనుగోళ్లు నిలిపివేయాలి. కంటైనర్లు, సీసాల్లో కూడా తీసుకోకూడదు..’ అని తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం.అమరేందర్‌రెడ్డి సూచించారు. ‘పాత బకాయిలు చెల్లిస్తేనే ఆయిల్‌ కంపెనీలు ఇంధనం సరఫరా చేస్తున్నాయి. క్రెడిట్‌ (ఉద్దెర)లో పెట్రోల్, డీజిల్‌ ఇవ్వడం లేదు. ఇది కొన్ని బంకులు మూతపడటానికి, తెరిచి ఉన్నచోట క్యూలు పెరగడానికి కారణమవుతోంది..’ అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement