చర్చించకుండా పారిపోయారు: హరీశ్‌రావు | BRS Leader Harish Rao Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

చర్చించకుండా పారిపోయారు: హరీశ్‌రావు

Apr 1 2026 4:12 AM | Updated on Apr 1 2026 4:12 AM

BRS Leader Harish Rao Fires On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ టి.హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్‌ఎస్‌ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్‌ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్‌ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్‌లో మంగళవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్‌ఎస్‌ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్‌ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్‌రావు మండిపడ్డారు. 

అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్‌ 
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్‌ రాజకీయాలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్‌ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. 

ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్‌ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్‌ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్‌ బంధానికి నిదర్శనమన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement