సీఐడీ వద్దంటే సీబీఐ | CM Revanth Reddy Fires On BRS Leaders | Sakshi
Sakshi News home page

సీఐడీ వద్దంటే సీబీఐ

Mar 30 2026 2:03 AM | Updated on Mar 30 2026 2:03 AM

CM Revanth Reddy Fires On BRS Leaders

మైనింగ్‌ అక్రమాలపై ప్రతిపక్షం అడిగితే వేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి

మంత్రి బంధువులను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే బీఆర్‌ఎస్‌ సభ్యుల సభా సంఘం డిమాండ్‌ 

సభలో మీ పప్పులు ఉడకవు.. మీ మంత్రాలకు చింతకాయలు రాలవు 

దళితులపై బీఆర్‌ఎస్‌కు నాటి నుంచి చిన్నచూపే 

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ ఆ పదవికి దళితులు తగరని అవమానించారు.. స్పీకర్‌గా దళితుడు ఉన్నందునే ఆయన సభకు రావట్లేదు.. భట్టి బడ్జెట్‌ పెట్టడమూ నచ్చట్లేదు 

నాడు ‘రావు’లే రాజ్యమేలితే... ఇప్పుడు భట్టి, వివేక్,అడ్లూరి, సీతక్క వంటి వారున్నారు 

శాసనసభలో బీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్‌ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మైనింగ్‌ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. 

బీఆర్‌ఎస్‌ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్‌ఎస్‌ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్‌ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్‌ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్‌రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ నుంచి పన్నులు రాబట్టింది మేమే 
‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్‌ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్‌మెయిల్‌ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్‌ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్‌ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్‌ చెప్పారు. 

దళితులను అవమానించేలా బీఆర్‌ఎస్‌ తీరు 
‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్‌ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్‌ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. 

దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్‌ సభకు రావట్లేదు 
‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్‌రావు, కవితారావు, సంతోశ్‌రావు, వినోద్‌రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్‌ మొదలైన వారున్నారు. 

ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్‌గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్‌ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్‌ సభకు రావట్లేదు. కేసీఆర్‌ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్‌ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. 

కేసీఆర్‌తో రాజీనామా చేయించండి 
‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్‌తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్‌ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్‌కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. 

అవినీతి మచ్చలేని సీనియర్‌ నాయకుడిపై కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్‌ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్‌ ఠాకూర్‌ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్‌ డిమాండ్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement