అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్‌: హరీశ్‌రావు | BRS Leader Harish Rao Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్‌: హరీశ్‌రావు

Mar 29 2026 6:04 AM | Updated on Mar 29 2026 6:04 AM

BRS Leader Harish Rao Fires On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ అనుమతుల్లేకుండానే హైదరాబాద్‌లో మైనింగ్‌ చేస్తోందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హరీశ్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయ కపోతే పొంగులేటికి భయం ఎందుకన్నారు. 

దాడుల్లో దొరికినా ప్రభుత్వ చర్యలేవీ? 
బడ్జెట్‌ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో గనుల శాఖపై చర్చలో సాగర్‌ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్‌రావు మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్‌గూడలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ బరితెగించి మైనింగ్‌ చేస్తోంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు. కానీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ భారీ స్టోన్‌ క్రషర్‌ను డీజిల్‌ జనరేటర్లపై నడుపుతోంది. జీవో 26 ప్రకారం స్టోన్‌ క్రషర్‌ పెట్టాలంటే మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌ ఉండాలి. 

పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి సీఎఫ్‌ఈ, సీఎఫ్‌ఓ సరి్టఫికెట్లు తీసుకోవాలి. కానీ ఆ సంస్థ విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోకుండా దొంగచాటుగా డీజిల్‌ జనరేటర్లతో క్రషింగ్‌ చేస్తోంది. 2025 మే 21న మైనింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్వయంగా ఈ క్రషర్‌ తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్‌ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్‌ టన్నుల అక్రమ రఫ్‌ స్టోన్‌ నిల్వలను పట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న డిమాండ్‌ నోటీసు జారీ చేసి రూ. 24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. 

మార్చి 4న మళ్లీ తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్‌ టన్నుల ముడి సరుకు దొరికింది. మార్చి 13న మరో షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. డీజిల్‌ జనరేటర్లతో కాలుష్యంపై స్వయంగా మైనింగ్‌ అధికారులే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్‌ చట్టం ప్రకారం ఎండీఎల్, లైసెన్స్‌ లేకుండా క్వారీ నిర్వహిస్తే మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. కానీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ రెండుసార్లు పట్టుబడ్డా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?’అని హరీశ్‌రావు నిలదీశారు. 

ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? 
‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనకడుగు వేసింది. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయం చేస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమ్ముడి స్టోన్‌ క్రషర్‌లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

పొంగులేటి పేరు ప్రస్తావనపై మంత్రుల అభ్యంతరం.. 
హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సంబంధం లేని విషయంలో మంత్రి పొంగులేటి పేరు ప్రస్తావించారంటూ మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, వివేక్‌తోపాటు విప్‌ ఆది శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హరీశ్‌రావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసుకొని సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, హరీశ్‌రావు అభూత కల్పనలతో సభను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. 

వెంటనే హరీశ్‌రావు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో దళితులపై అరాచకాలు జరిగినప్పుడు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. లారీలను నిలిపివేయాలని అడిగిన ప్రజలను కొట్టి హింసించిన ఘటనలు మర్చిపోయారా?.. అప్పుడు సభాసంఘం ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కోత్వాల్‌గూడ మైనింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉంటే తప్పకుండా విచారణ చేపడతామని... తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. 

మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో మహబూబ్‌నగర్‌లో ఇసుక మాఫియా లారీల కింద పడి పిల్లలు చనిపోతే కనీసం అటువైపు చూడని నేతలు ఇప్పుడు సభాసంఘం ఏర్పాటు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్‌ జోక్యం చేసుకొని హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్‌ పద్దులపై చర్చను కొనసాగించారు.   

Advertisement
 
Advertisement
Advertisement