ముంబై: మహారాష్ట్రలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో జనం పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతుండటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎక్కడా లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
వదంతులు వ్యాపింపజేస్తే జైలుకే..
లాక్‌డౌన్ వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కనీసం వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తాం’ అని ఫడ్నవీస్ తీవ్రంగా హెచ్చరించారు. ముంబై సహా థానే, పాల్ఘర్, రాయగడ జిల్లాల్లో పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ కేంద్రాల వద్ద జనం ఎగబడుతుండటంతో గందరగోళం మొదలైంది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళనతో బంకుల వద్దకు పరుగులు తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
నిందితుడు అరెస్ట్
లాక్‌డౌన్ రాబోతున్నదంటూ ఫేక్ వీడియో సృష్టించి, వైరల్ చేసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఉద్రిక్తతలకు కారణమయ్యే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడుతూ భారత్‌లో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ పరిస్థితులను మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండి, అసత్య వార్తలను నమ్మవద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


