దేవుడి పేరుతో ప్రజలకు మోసం: కేటీఆర్‌ | BRS Working President ktr comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

దేవుడి పేరుతో ప్రజలకు మోసం: కేటీఆర్‌

Mar 29 2026 4:29 AM | Updated on Mar 29 2026 4:29 AM

BRS Working President ktr comments over Revanth Reddy

‘శివతాండవం చేస్తాను’ అనడం అహంకారమే 

మూసీ పునరుజ్జీవంతో రూ.లక్షన్నర కోట్ల అవినీతి

ఏప్రిల్‌ మొదటి వారంలోరౌండ్‌ టేబుల్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: మూసీనది పునరుజ్జీవం పేరిట సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్ల రూపాయల అవినీతికి తెర­లేపు­తు­న్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతి­ని వ్యతిరేకి స్తున్నా, దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మో­సం చేస్తున్నారని, ‘శివతాండవం చేస్తాను’అని అహంకా­రంగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి నిదర్శ నమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినా, ప్రస్తుత ప్రభు­త్వం అనవసరంగా అంచనాలు పెంచి అవినీతికి మార్గం సుగ­మం చేస్తోందని ఆరోపించారు. 

మూసీ ప్రాజెక్టు పేరుతో పేద­ల లక్షల ఇళ్లను కూల్చి, సుమారు 3 వేల ఎకరాల భూమిని కా­ర్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నా­రు. బఫర్‌ జోన్‌ పేరుతో పేదల ఇళ్లు మాత్రమే కూల్చేస్తున్న ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శనివారం గ్రేటర్‌ హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతి­థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడు­తూ ఏప్రిల్‌ మొదటి వారంలో మేధావులు, పర్యావరణ నిపు­ణులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామన్నారు. 

ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి వరకు ప్రతి కాలేజీ, బస్తీల్లో పెద్ద ఎత్తు­న అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు. అవస­ర­మైతే ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చే­సిన అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంగణా­నికి వేసిన తాళా లు బద్దలుకొట్టైనా ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా­మ­న్నా­రు. మూసీ పరీవాహక ప్రాంతా­ల్లో విద్యార్థులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్‌ ఎస్వీ నాయకులకు పిలుపునిచ్చారు.

ప్రతిపక్ష నాయకులను బెదిరించే ధోరణి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్‌ అక్రమాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై సీఎం బెదిరించే ధోరణి ప్రదర్శించారని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ ఎప్పటికీ భయపడదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూసీలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను దాదాపు పూర్తి చేసి, కాళేశ్వరం నుంచి నీటిని పంపించే ప్రణాళిక సిద్ధం చేసినా, ప్రస్తుత ప్రభుత్వం డీపీఆర్‌ కూడా సిద్ధం చేయకుండా భారీ అంచనాలతో స్కామ్‌కు తెరలేపుతోందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరు ద్ధమని చెప్పి కూల్చేస్తూ, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్‌ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. పేదల జీవితాలను నాశనం చేస్తూ హైదరా బాద్‌ను విధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రం ‘పిచ్చోడి చేతిలో రాయి’లాగా మారిందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్,  బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి కిశోర్, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి  పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement