హరీష్ రాణా లాంటి కారుణ్య మరణం
స్పానిష్ యువతిపై సామూహిక అత్యాచారం
ఆవేదనతో ఆత్మహత్యాయత్నం, తీవ్ర గాయాలతో మంచానికే పరిమితం
‘ఇకపై ఈ హింస భరించడం నా వల్లకాదు అందంగా చనిపోవాలి!
ఘజియాబాద్‌కు హరీష్ రాణా దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా నిలిచారు. 13 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా బతికిన ఆయనకు సుప్రీంకోర్టు అనుమతితో ఎయిమ్స్ వైద్యులు చికిత్స నిలిపివేయగా, ఇటీవల తుదిశ్వాస విడిచారు. దాదాపు ఇలాగే చట్ట అనుమతితో కాలుష్య మరణం పొందిన స్పానిష్ యువతి గురించి తెలుసా? వేదన భరించలేక కారుణ్య మరణం ఎంచుకున్న అత్యాచార బాధితురాలి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
స్పానిష్ యువతి నోలియా కాస్టిల్లో (Noelia Castillo) ఉదంతం చాలా హృదయవిదారకమైన గాథ. మృత్యువు అంచుల వద్ద కూడా ఎలాగైనా బతకాలనే కోరుకుంటారు ఎవరైనా. కానీ కోరి కోరి మృత్యువును ఎంచుకోవడం అంటే ఆ నరకయాతన, మానసిక క్షోభను, కుటుంబం భావోద్వేగ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
నోలియా కాస్టిల్లో కారుణ్య మరణం
స్పానిష్ ప్రభుత్వ ప్రసార సంస్థ TVE , ఇతర స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బార్సిలోనాకు చెందిన 25 ఏళ్ల నోలియా కాస్టిల్లో, కాటలోనియాలోని శాంట్ పెరె డి రిబ్స్‌లోని ఒక ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఈ ప్రక్రియ పూర్తి అయింది. దీన్ని ఎలాగైనా ఆపాలని ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పెయిన్, యూరప్‌లోని న్యాయస్థానాల అనుమతితో మూడు రకాల మందుల మిశ్రమంతో చేసే ఇంజెక్షన్ ద్వారా 15 నిమిషాల చికిత్సా ప్రక్రియలో ఆమె ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది.
నోలియా మరణం స్పెయిన్‌లో కారుణ్య మరణంపై మళ్ళీ చర్చను లేవనెత్తింది. మతసంస్థలు, సంప్రదాయ వాదులు ఇది వైద్య వ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. అయితే స్వచ్ఛంద మరణం కోసం పోరాడే సంఘాలు, గౌరవప్రదమైన మరణాన్ని ఎంచుకునే హక్కు అంటూ ఈ ప్రక్రియను సమర్థించాయి.
భరించలేని హింస , బాధ
2022లో ఒక ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు నోలియాపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లోకి జారిపోయింది. ఆపై తాను ఉంటున్న భవనంలోని ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తృటిలో ప్రాణాలతో బయటపడింది కానీ పక్షవాతానికి గురైంది. ఇక అప్పటినుంచి మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించిన నోలియా, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తానుకున్నట్టుగానే మనశ్శాంతిగా కన్నుమూసింది. ఆ గాయం నుండి కోలుకోలేక ఆమె ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి, ఆమె వీల్‌చైర్‌కే పరిమితమై, శారీరక , మానసిక వేదనతో కుమిలిపోయింది.
శారీరక వేదనతోపాటు,అత్యాచారం తాలూకూ చేదు జ్ఞాపకాలు ఆమెను నిరంతరం వెంటాడేవి. "నేను ఏమీ చేయలేకపోతున్నాను, కనీసం నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది. తన బాధ కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, తీవ్రమైన భావోద్వేగపరమైంది అందుకే ఈ నరకం నుంచి విముక్తి కావాలి. ఇక ఈ బాధ భరించలేను, నేను అనుభవించిన ప్రతీ బాధను మననం చేసుకుంటూ జీవించడం నావల్లకాదు ఇక వెళ్లిపోవాలను కుంటున్నాను, నాకు విముక్తి కావాలి శాంతి కావాలి” అని ఆమె మరణానికి ముందు రోజు ప్రసారమైన మరో ఇంటర్వ్యూలో చెప్పింది.
తండ్రి అభ్యంతరం
ఏప్రిల్ 2024లో నోలియా దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆరోగ్య బోర్డు అందుకు అనుమతించింది. కానీ నోలియా తండ్రి దీనిని ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఇది సరైన నిర్ణయం కాదని, చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. ఈ పోరాటంలో సుప్రీంకోర్టు నుండి ఐరోపా మానవ హక్కుల కోర్టు వరకు వెళ్లినా, ఆయన విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది.

తల్లి యోలాండా రామోస్ నిస్సహాయత: "నేను ఆమె నిర్ణయంతో ఏకీభవించడం లేదు, కానీ నా బిడ్డ పడుతున్న బాధను చూడలేను. చివరి వరకు ఆమె పక్కనే ఉంటాను" అని భావోద్వేగంగా చెప్పారు.
చివరి కోరిక
"నేను అందంగా కనిపిస్తూ మరణించాలని అనుకుంటున్నాను. నాకిష్టమైన డ్రెస్ వేసుకుని, మేకప్ వేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతాను" అని ఆమె తన చివరి కోరికను వెల్లడించారు. ఆమె కోరుకున్నట్టుగా, చట్ట నియమాల మేరకు ఆమె తనువు చాలించారు.
స్పెయిన్ 2021లో కారుణ్య మరణాన్ని (Euthanasia) చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం నయం చేయలేని వ్యాధులు లేదా దీర్ఘకాలిక అశక్తత ఉన్నవారు మరణాన్ని కోరుకోవచ్చు.


