పద్దులపై చర్చ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ | BRS walks out of debate on bills | Sakshi
Sakshi News home page

పద్దులపై చర్చ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

Mar 29 2026 4:24 AM | Updated on Mar 29 2026 4:24 AM

BRS walks out of debate on bills

సభలో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో శనివారం పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు రెండు సార్లు వాకౌట్‌ చేయడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం పద్దులపై చర్చలో భాగంగా హోంపాలన, రవాణా నిర్వహణ, వెనుకబడి తరగతుల సంక్షేమం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం పద్దుపై మంత్రి సీతక్కలు మాట్లాడారు. 

ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై వారు వేర్వేరుగా వివరణ ఇచ్చినా మంత్రుల సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు తాము సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నామని ప్రకటించి      రెండుసార్లు బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

దీనిపై శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కలుగజేసుకుని ఏ అంశంలోనూ బీఆర్‌ఎస్‌ సభ్యులకు చిత్తశుద్ధి లేదని, అందుకే... ముఖ్యమైన అంశాలపై హౌస్‌లో చర్చ జరుగుతుంటే వాకౌట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్‌శాఖ పద్దులపై చర్చలో బీఆర్‌ఎస్‌ సభ్యులు పూర్తిగా అబద్దాలు చెబుతున్నారని, అన్ని అంశాలపై సమాధానం ఇస్తున్నా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నారని, ప్రజా సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదని మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  

ఆర్టీసీ విలీనం... కమిటీ పరిశీలనలో ఉంది: మంత్రి పొన్నం  
సామాజిక న్యాయానికి చాంపియన్‌ కాంగ్రెస్‌ పార్టీ అని, ప్రజాపాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం పద్దులపై చర్చలో భాగంగా హోంపాలన, రవాణా నిర్వహణ, వెనుకబడిన తరగతుల సంక్షేమం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. 

బీసీ సబ్‌ప్లాన్‌పై చర్చిస్తున్నామని, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వం విజన్‌తో ఉందన్నారు. మహిళా భద్రత, డ్రగ్స్, సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కమిటీ పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, కూనంనేని సాంబశివరావు, దానం నాగేందర్‌ లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు.  

మరోసారి కరీంనగర్‌ సీపీ అంశంపై సభలో చర్చ 
కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ అంశం మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ తన సతీమణి, స్నేహితులతో కలిసి ఫైరింగ్‌ చేశారు. ఈ కాల్పులతో బోనాలపల్లి గ్రామంలోని అమృతమ్మ అనే మహిళకు బుల్లెట్‌ గాయమైందని, బదిలీ కోసం సీపీ హోంగార్డుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తుల కోసం వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సిట్‌ వేసి సీపీపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానమిస్తూ వ్యక్తిగత అంశాలకు, విమర్శలకు సభలో తావులేదని, ఏదైనా తప్పు జరిగి ఉంటే తప్పక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు 

త్వరలో 15 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ : మంత్రి సీతక్క 
త్వరలో 15 వేల అంగన్‌వా డీ పోస్టుల భర్తీకి నోటిఫికే షన్‌ ఇవ్వనున్నట్టు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. త్వరలో ఈ ఫైల్‌కు సంబంధించి కేబినెట్‌ అనుమతి తీసుకుని ఉద్యోగాల ప్రకటన జారీ చేస్తామన్నారు. పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి, మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం పద్దుపై మంత్రి సీతక్క మాట్లాడారు. 

గ్రామాల్లో 7 లక్షల నివాసాలకు తాగునీటి సదుపాయం లేదని తమ పరిశీలనలో తేలిందని, వేసవి దృష్ట్యా మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.పద్దుపై చర్చలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు ప్రస్తావించిన అంశాలకు మంత్రి సమాధానమిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement