బెంగళూరు: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌లపై ఆసక్తి బాగా పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం పరిధులు దాటుతోంది. ఒక్కోసారి ఘర్షణలకు దారి తీస్తోంది. అప్పుడప్పుడూ విషాదంగా కూడా మారిపోతోంది. తాజాగా కర్ణాటకలోని సకలేశపుర తాలూకాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. స్టోరీ ఏంటంటే
అసలేం జరిగింది?
కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర తాలూకాలోని ప్రముఖ బెట్టద భైరవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. పచ్చని ప్రకృతికి నిలయమైన ఈ ప్రాంతం ప్రీ-వెడ్డింగ్ షూట్‌లకు చాలా ప్రసిద్ధి.
ఇక్కడ ఒక జంట తమ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్‌లతో కలిసి ఈ ఆలయానికి వచ్చింది. షూటింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లు పాదరక్షలు (షూలు) ధరించి ఆలయ పరిధిలోకి ప్రవేశించారని, అలాగే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఫోటోగ్రఫీ చేస్తున్నారని కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘర్షణ చెలరేగింది.మాట మాట పెరిగి అది భౌతిక దాడికి దారితీసింది. స్థానికులు ఫోటోగ్రాఫర్‌లపై దాడి చేయడమే కాకుండా, వారి కెమెరాను కూడా పగులగొట్టారు.

ఈ దాడిలో నవీ, నందన్ అనే ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సకలేశపుర తాలూకా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న సకలేశపుర రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముదిగెరె తాలూకాకు చెందిన ఏడుగురిని (ఆశి, ప్రశాంత్, రక్షా, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్‌డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
నోట్: ఆధ్యాత్మిక, పర్యాకట ప్రదేశాల్లోఇలాంటి షూట్‌లు చేసేటప్పుడు స్థానిక పద్దతులను నియమాలను పాటించడం అవసరం. స్థానికుల మనోభావాలకు భంగం కలగకుండా సున్నితత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది.


