ఇక అధికారులకే బోధనాస్పత్రుల నిర్వహణ | Officials will now manage teaching hospitals | Sakshi
Sakshi News home page

ఇక అధికారులకే బోధనాస్పత్రుల నిర్వహణ

Mar 29 2026 4:07 AM | Updated on Mar 29 2026 4:07 AM

Officials will now manage teaching hospitals

ఆస్పత్రి స్థాయిని బట్టి గ్రూప్‌–1, గ్రూప్‌–2 స్థాయి అధికారుల నియామకం 

బోధనాస్పత్రుల్లో పాలనను గాడిన పెట్టడమే లక్ష్యంగా సర్కార్‌ యోచన 

వైద్యులనే పాలనాధికారులుగా కొనసాగించాలని టీజీజీడీఏ, టీటీజీడీఏ పట్టు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాస్పత్రులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం పాలనా వ్యవహారాల్లో వైద్యుల జోక్యానికి తెరదించాలని నిర్ణయించింది. తొలుత 36 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఈ ప్రయోగం అమలుకు యోచిస్తోంది. తద్వారా డాక్టర్లు, ప్రొఫెసర్లను వారి వృత్తికే పరిమితం చేయాలని భావిస్తోంది. 

ఈ మేరకు బోధనాస్పత్రుల వ్యవహారాలన్నీ గ్రూప్‌–1, గ్రూప్‌–2 స్థాయి అధికారులకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించి కసరత్తు చేస్తోంది. జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న సనత్‌నగర్‌ టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అల్వాల్, ఎల్బీనగర్‌ టిమ్స్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులకు విస్తరించాలని, అవసరమైతే 50, 100, 150 పడకలతో కూడిన ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల వైద్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆస్పత్రుల నిర్వహణను వైద్యంతో సంబంధం లేని అధికారులకు అప్పగిస్తే బోధనాస్పత్రుల్లో పాలన కుంటుపడుతుందని, సమన్వయం లోపిస్తుందని, ఆ ప్రభావం వైద్యంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఓల ద్వారా ప్రస్తుతం నిర్వహణ 
ప్రస్తుతం అన్ని ప్రభుత్వాస్పత్రులు, బోధనాస్పత్రుల్లో సీనియర్‌ వైద్యాధికారులు సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తున్నారు. రోగులకు సేవలు, క్లినికల్‌ పర్యవేక్షణ, మందుల కొనుగోళ్లు, వైద్యులు డ్యూటీలతోపాటు ఆస్పత్రుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. 

అయితే వైద్యులు ఆస్పత్రుల నిర్వహణను చేపడుతుండటం వల్ల రోగులకు వైద్యం అందించడంకన్నా ‘పెద్దరికం’ పనులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆస్పత్రుల నిర్వహణకు ఇప్పటికే అమల్లో ఉన్న పరిపాలనాధికారి (ఏవో) పోస్టులకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడం ద్వారా ఆ పోస్టును బలోపేతం చేసి ఆ పోస్టుల్లో అధికారులను నియమించాలనుకుంటోంది. ఇప్పటివరకు ఆస్పత్రుల్లో ఏవో పోస్టులను క్లరికల్‌ పనులకే పరిమితం చేశారు. 

ద్వంద్వ పరిపాలనతో గందరగోళం: టీజీజీడీఏ 
రాష్ట్రంలో ప్రొఫెసర్‌ కేడర్‌కు సెక్రటరీ స్థాయి, సూపరింటెండెంట్‌ కేడర్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి బాధ్యతల సమానత్వం ఉన్న నేపథ్యంలో అనుభవజు్ఞలైన వైద్య అధికారులతో ఆస్పత్రులు సమర్థంగా నడుస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) పేర్కొంది. ఈ పరిస్థితిలో కొత్తగా గ్రూప్‌–1 అధికారులను ప్రవేశపెట్టడం అవసరంలేని చర్యగా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నరహరి, సెక్రటరీ జనరల్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌ ఒక ప్రకటనలో అభివర్ణించారు. 

ఈ ప్రతిపాదన అమలైతే ప్రస్తుత సూపరింటెండెంట్ల అధికారాలు దెబ్బతినడం, హోదా తగ్గిపోవడం, ద్వంద్వ పరిపాలన ఏర్పడి గందరగోళం ఏర్పడుతుందని హెచ్చరించారు. సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఓలకే మరిన్ని అధికారాలిచ్చి విధాన నిర్ణయాల్లో సంఘాన్ని భాగస్వామ్యం చేయాలని డిమాండ్‌ చేశారు. 

దేశంలో ఎక్కడా ఈ వ్యవస్థ లేదు: టీటీజీడీఏ 
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పరిపాలన కోసం గ్రూప్‌–1, గ్రూప్‌–2 అధికారులను నియమించాలన్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని తెలంగాణ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీటీజీడీఏ) డిమాండ్‌ చేసింది. దేశంలో ఎక్కడా ప్రధాన బోధనాస్పత్రుల్లో ఇలాంటి విధానం అమల్లో లేదని స్పష్టం చేసింది. 

ఈ మేరకు టీటీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్‌ కిరణ్‌ బొల్లేపాక, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కిరణ్‌ మాదల ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ల ఆధ్వర్యంలో పరిపాలన సరిగా ఉండదన్న అపోహలు సరైనవి కావని, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ , సీడీసీ వంటి సంస్థల్లో కూడా వైద్యులే నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement