భర్తీ చేస్తున్నా.. ఖాళీలే | Medical colleges increased in state Effect to public health, medical education | Sakshi
Sakshi News home page

భర్తీ చేస్తున్నా.. ఖాళీలే

Mar 29 2026 2:40 AM | Updated on Mar 29 2026 2:40 AM

Medical colleges increased in state Effect to public health, medical education

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, వైద్యవిద్యపై పడుతోంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఏర్పాటైన ఆస్పత్రులకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు పారామెడికల్‌ సిబ్బంది నియామకం జరుపుతూ వస్తోంది. రాష్ట్రంలోని వైద్య అవసరాలకు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రాథమిక ఆరోగ్యం (డీహెచ్‌), టీవీవీపీ, డీఎంఈల ద్వారా జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులు, మాతా శిశు కేంద్రాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ తదితర కేంద్రాల నిర్వహణ ఉంటుంది. ఈ నాలుగు శాఖల పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 51,455 వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం శాసనమండలి వేదికగా వెల్లడించింది. వాటిలో 7,170 పోస్టుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉండగా, మరో 6,759 పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆమోదిత పోస్టుల్లో దాదాపు మూడో వంతు ఖాళీగా ఉండటం వల్ల ఆస్పత్రుల సేవలు, వైద్యవిద్య రెండూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 

భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ...  
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, నర్సులు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నియంత్రణలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలోని మొత్తం 2,651 ఖాళీలలో 145 మంది వైద్యులు, 351 మంది నర్సుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. త్వరలోనే ఈ ఖాళీలు నిండుతాయి. అయితే పారా మెడికల్‌ సిబ్బంది పోస్టుల్లో 2,651 ఖాళీలు ఉంటే వాటిలో 2,016 వరకు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 635 ఖాళీలు ఉండగా, వాటి నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. 

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కింద 7,769 పోస్టులకు గాను 1,367 ఖాళీలు ఉండగా, వాటిలో 31 మంది నర్సులు, 160 మంది పారా మెడికల్‌ సిబ్బంది నియామక ప్రక్రియ సాగుతోంది. ఇంకా 315 మంది వైద్యులు, 304 మంది నర్సులు, 557 మంది పారా మెడికల్‌ సిబ్బంది భర్తీ కావలసి ఉంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా ఆస్పత్రులలో 9,554 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే... 3,706 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇటీవలే 1,658 మంది వైద్యుల భర్తీకి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి కావచ్చింది. మరో 721 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

682 నర్సుల నియామక ప్రక్రియ సాగుతుండగా, 347 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే పారామెడికల్‌ సిబ్బంది 298 ఖాళీలకు గాను 185 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని టీచింగ్‌ హాస్పిటల్స్‌లో ఏకంగా 20,585 పోస్టులకు గాను 6,205 ఖాళీలు ఉన్నాయి. అంటే సుమారు 40శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య విద్య నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతోంది. అయితే డీఎంఈ పరిధిలో 607 మంది వైద్యులు, 1,545 మంది నర్సులు, 286 మంది పారా మెడికల్‌ సిబ్బందితో కూడిన 2,438 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్చలు చేపట్టగా, ఇంకా 3,767 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అందులో అత్యధికంగా 2,179 వైద్య విద్య బోధించే వివిధ స్థాయిల ప్రొఫెసర్‌ పోస్టులు ఉండడం గమనార్హం.  

వైద్యుల పోస్టుల్లోనే భారీగా ఖాళీలు 
ఈ నాలుగు శాఖల్లో కలిపి 14,633 ఆమోదిత డాక్టర్‌/ ప్రొఫెసర్‌ పోస్టుల్లో ప్రస్తుతం 9,008 మాత్రమే భర్తీ కాగా, 5,625 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలు పూర్తైనా ఇంకా 3,200 పైగా పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా టీచింగ్‌ హాస్పిటల్స్‌లో రెండు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉండడం తృతీయ స్థాయి వైద్యం, వైద్యుల శిక్షణపై ప్రభావం చూపుతోందని హెల్త్‌కేర్‌ రిఫారŠమ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రుల్లో అనేక చోట్ల సగానికన్నా తక్కువ సిబ్బందితోనే నడుస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

డాక్టర్లు తయారవుతున్నా....  
ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిన వైద్య కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వైద్యులు వైద్యం కోసం సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఏటా సుమారు 9,000 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 మంది పీజీ వైద్యులు సిద్ధమవుతున్నారు. అయితే నియామకాల్లో ఆలస్యం, అసంఘటిత విధానం కారణంగా వీరిలో చాలా మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు లేదా కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇది ఒక వైపు ఖాళీలు పెరగడం, మరోవైపు యువ వైద్యులకు అవకాశాలు లేకపోవడం అనే విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement