ఎరువు.. ఇక బరువే.. | Impact of the West Asian War on Kharif Cultivation | Sakshi
Sakshi News home page

ఎరువు.. ఇక బరువే..

Mar 29 2026 4:04 AM | Updated on Mar 29 2026 4:04 AM

Impact of the West Asian War on Kharif Cultivation

పశ్చిమాసియా యుద్ధంతో ఖరీఫ్‌ సాగుపై ప్రభావం..  ఎరువుల కొరత ఏర్పడే అవకాశం

యుద్ధంతో 48%పెరిగిన యూరియా ధర 

2026–27 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ రూ. 1.7 లక్షల కోట్లని కేంద్రం అంచనా 

మారిన పరిస్థితుల్లో రూ. 2 లక్షల కోట్లు దాటే చాన్స్‌

దిగుమతుల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం పరిశీలన 

ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలంటున్న నిపుణులు 

పశ్చిమాసియా యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల కొరత వచ్చే ఖరీఫ్‌ సాగుకు ప్రతిబంధకంగా మారే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా టన్ను ధర (ప్రస్తుతం 680 డాలర్లు) యుద్ధం మొదలయ్యాక 48% పెరిగింది. 

దీంతో మొత్తంగా వార్షిక ఎరువుల సబ్సిడీ 25% పెరిగి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందని ‘క్రిసిల్‌’(క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) అంచనా. కింకర్తవ్యం? దిగుబడులు తగ్గకుండా చూసుకుంటూనే రసాయనిక ఎరువుల కొరతను అధిగమించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలేమిటి? నిపుణులు ఏమంటున్నారంటే? -(సాక్షి, స్పెషల్‌ డెస్క్‌) 

నిల్వలు ఎంత ఉన్నాయి? 
» రానున్న ఖరీఫ్‌ పంట కాలానికి మన దేశానికి ఎంత మొత్తంలో రసాయనిక ఎరువుల అవసరం ఉంటుంది? గత ఏడాది ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూరియా 19.3 మిలియన్‌ టన్ను లు, ఎన్‌పీకే (మొక్కలకు ఆరోగ్యకరమైన పెరుగుదలకు అవసరమైన పోషకాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం) 8.1 మిలియన్‌ టన్ను లు, డీఏపీ 4.6 మిలియన్‌ టన్నులు, పొటాష్‌ 1.1 మిలియన్‌ టన్నులు వినియోగించాం.  

»  అయితే, ఈ నెల 10 నాటికి భారత ప్రభు త్వం దగ్గర ఉన్న నిల్వ ఎంత? యూరియా 6.2 మిలియన్‌ టన్నులు, ఎన్‌పీకే 5.63 మిలియన్‌ టన్నులు, డీఏపీ 2.51 మిలియన్‌ టన్నులు, పొటాష్‌ 1.29 మిలియన్‌ టన్నులు నిల్వ ఉన్నా యని కేంద్ర ఎరువుల శాఖ, క్రిసిల్‌ ఇంటెలి జెన్స్‌ల సమాచారం. అంటే, యూరియా లభ్యత ప్రస్తుతానికి 65% వరకు తక్కువగా ఉంది.  

»   యుద్ధం కారణంగా పశ్చిమాసియా యేతర దేశాల నుంచి ఎరువులను ఎక్కువగా దిగుమతి చేసుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను యూరియా ధర ఇప్పటికే 48% పెరిగింది. 2026–27 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ రూ. 1.7 లక్షల కోట్లని కేంద్రం అంచనావేసింది. మారిన పరిస్థితుల్లో ఇది 25% మేరకు పెరిగి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందని క్రిసిల్‌ అంచనా.

నిబంధనలు సడలించాలి!
రసాయనిక ఎరువుల గుళికలను పొడిగా మార్చి వాడితే 20–30 శాతం గుళికల ఎరువులతోనే ఇప్పటికన్నా అధిక దిగుబడి సాధించవచ్చని, 70–80 శాతం ఎరువులను దిగుబడిలో రాజీపడకుండానే ఆదా చేసుకోవచ్చని రోజ్‌మేరీ ఔషధ పంటపై మా పరిశోధనల్లో రుజువైంది. 

నానో ఎరువుల పొడిని నేలపై వెయ్యవచ్చు, పిచికారీ చెయ్యవచ్చు. వరి, టమాటా వంటి ఏకదళ, ద్విదళ పంటలన్నిటికీ ఈ టెక్నాలజీ వాడొచ్చు. రసాయనిక ఎరువుల గుళికలను పొడిగా మార్చి వాడటం వల్ల ఎరువును సమర్థవంతంగా వాడుకోవటం సాధ్యమవుతుంది. నిబంధనల నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇస్తే మాత్రమే నానో ఎరువుల పొడి టెక్నాలజీని రైతులకు సత్వరమే అందుబాటులోకి తేవడం సాధ్యపడుతుంది.  – ప్రొ. వీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్, స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌  

ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? 
»  పొదుపుగా వాడటం: రసాయనిక ఎరువుల అతి వినియోగా న్ని తగ్గించటం, వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఐసీఆర్‌ఐఈఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌) తాజా నివేదిక ప్రకారం సిఫారసు కన్నా యూరియా వినియోగం పంజాబ్‌లో 61%, తెలంగాణలో 54% ఎక్కువగా ఉంది.  
» నానో ఎరువులు: నానో ఎరువుల్లో రెండు రకాలున్నాయి.. ఇఫ్‌కో నానో ద్రవరూప ఎరువుల సాంకేతికత ఒకటి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) రూపొందించిన నానో పొడి ఎరువుల టెక్నాలజీ రెండోది. నానో యూరియా, నానో డీఏపీ వంటి ‘ద్రవ’రూప ఎరువులను రైతుల సహకార సంస్థ ‘ఇఫ్‌కో’అభివృద్ధి చేసి ఇప్పటికే మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధకులు రూపొందించిన మరో రకం ‘నానో పొడి ఎరువుల టెక్నాలజీ’కూడా అందుబాటులో ఉంది. గుళికల రూపంలో రసాయనిక ఎరువులను 100 కిలోలు వాడే బదులు, ఈ టెక్నాలజీ తో ఆ గుళికలను పిండిగా మార్చి వాడుకుంటే 20– 30 కిలోలతోనే సరిపోతుంది. 70–80% ఎరువు ఆదా అవుతుంది. అంతేకాదు, చాలు అధిక దిగుబడి సాధించవచ్చని ప్రొ. వీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 

»  ప్రకృతి సేద్యపు బాట: ప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని నిర్మాణాత్మకంగా ప్రోత్సహించడం. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చెయ్యడం ద్వారా రైతులను రసాయన రహిత సేద్యం వైపు ఆకర్షించవచ్చు. తొలి ఏడాదే దిగుబడి తగ్గకుండా జాగ్రత్తపడే ప్రకృతి సేద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. విధాన విశ్లేషకులు డా. దొంతి నరసింహారెడ్డి ఒక నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను భారత ప్రభుత్వానికి సూచించారు.       

Advertisement
 
Advertisement
Advertisement