జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన
రూ.397 కోట్ల పరిహారం చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన వచి్చంది. ఒకేరోజు 11,19,079 కేసులను పరిష్కరించారు. వీటిలో 85,231 ప్రిలిటిగేషన్ కేసులు, 10,31,317 క్రిమినల్ కేసులు, 2,531 సివిల్ కేసులున్నాయి. లబి్ధదారులకు రూ.397 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో 2, రుణ రికవరీ ట్రిబ్యునల్ 2 సహా మొత్తం 341 బెంచ్‌లను అందుబాటులో ఉంచారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ పాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శామ్ కోషి మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జస్టిస్ శామ్ కోషి లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో కేసులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో 1987లో లోక్ అదాలత్‌లు ప్రారంభించారన్నారు. ముఖ్యంగా కుటుంబ వివాదాలు, మోటారు వాహన ప్రమాదాల క్లెయిమ్‌లు, చెక్‌బౌన్స్ కేసులు ఎక్కువగా పరిష్కారం లభిస్తోందన్నారు.
తొలుత జాతీయ లోక్ అదాలత్‌లను సంవత్సరానికి ఒకసారి నిర్వహించేవారని.. ఆదరణ పెరగడంతో ఇప్పుడు ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి లోక్ అదాలత్‌లో పరిష్కార కేసుల సంఖ్య పెరగడం, ఈ యంత్రాంగంపై ప్రజల విశ్వాసం, ఆమోదం పెరుగుతోందని చెప్పారు. లోక్ అదాలత్‌లతోపాటు మధ్యవర్తిత్వం, ప్రత్యేక లోక్ అదాలత్‌ల వంటి ఇతర ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను కూడా ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఇవి కక్షిదారులకు వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి బహుళ మార్గాలను అందిస్తాయని.. న్యాయవ్యవస్థకే కాకుండా సమాజానికి వినియోగపడతాయన్నారు.
కక్షిదారులు.. తమ విభేదాలను పక్కనపెట్టి, శాంతియుత సహ జీవనాన్ని పెంపొందించుకోవడం ద్వారా తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ సూచించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యకలాపాలను, లోక్ అదాలత్‌లతో కలిగే ప్రయోజనాలను టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబి్ధదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
హైకోర్టులో..
హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో జస్టిస్ వాటికి రామకృష్ణారెడ్డి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. 129 కేసులను పరిష్కరించి, రూ.11 కోట్లు కక్షిదారులకు చెల్లించాలని ఆదేశించారు. రెండు బెంచ్‌లు మొత్తం 241 కేసులను విచారణకు స్వీకరించగా, వీటిలో 185 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.10,57,63,800 పరిహారం చెక్కులను కక్షిదారులకు పంపిణీ చేశారు.


