సోషల్‌ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది! : కిషన్‌రెడ్డి | BJP Leader Kishan Reddy on petrol and gas shortage rumors | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది! : కిషన్‌రెడ్డి

Mar 29 2026 2:21 AM | Updated on Mar 29 2026 2:21 AM

BJP Leader Kishan Reddy on petrol and gas shortage rumors

సాక్షి, హైదరాబాద్‌: గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ కొరత ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో అనేక రకాలు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో ఒక్క కుటుంబమో, ఒక వ్యక్తి ఇబ్బంది పడడం లేదని, యావత్‌ దేశం ఇబ్బంది పడేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయిల్‌ కంపెనీలు, డీలర్లతో కలిసి కిషన్‌రెడ్డి సీజీజీ టవర్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొందన్నారు. 

కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని చెప్పారు. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్, డీజిల్‌ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని దేశాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. 

అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్‌ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కొరత పేరుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ఎక్కువ ధరకు అమ్మినా, స్టాక్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులకు కావాల్సిన వాటిని సకాలంలో చేర్చేలా కంపెనీలు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం గతంలో గ్యాస్‌ బుక్‌ చేసుకున్నట్టుగా ఇంటి దగ్గరకి వచ్చి ఇస్తారని చెప్పారు. 

ఇతర రాష్ట్రాలతో పొల్చితే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, కొంతమేర ధరల తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలిగించినట్టు అవుతుందన్నారు. ప్రజలకు భారం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించద్దని చెప్పారు. ఈ సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, సుశీల్‌కుమార్‌ రాయ్, నిలేశ్, పీయూష్‌ మిత్తల్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement