చదువు పూర్తి అయినా ఉద్యోగాలు దొరక్క యువత నానా పాట్లు పడుతోంది. దీంతో చైనాలోని "యీయాంగ్ సీనియర్ హౌస్" వినూత్నంగా ఆలోచించింది. ఈ ప్లాన్‌తో చైనాలో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, ఇటు నిరుద్యోగ యువతకు కూడా భారీ ఉపశమనం లభిస్తోంది. ఏంటా ప్లాన్? తెలుసుకోవాలని ఉందా? పదండి మరి,
చైనాలోని సుజౌ (Suzhou) నగరానికి చెందిన 25 ఏళ్ల జాంగ్ జిన్ (Zhang Jin) అనే యువతి, నేటి తరం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని, ఒంటరితనాన్ని అధిగమించేలా సరికొత్త నిర్ణయం తీసుకని వార్తల్లో నిలిచింది. నెలకు కేవలం 200 యువాన్ల (సుమారు రూ.2,820) మాత్రమే అద్దె చెల్లిస్తోంది. సాధారణంగా అక్కడి మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 10 రెట్లు తక్కువ. దీనికి ఆమె చేయాల్సిందల్లా ఏమిటంటే వృద్ధాశ్రమంలో నివసిస్తూ, అక్కడి వృద్ధులకు తోడుగా ఉండటమే.

తూర్పు చైనాలోని తూర్పు జియాంగ్జీ ప్రావిన్స్ నుండి కొత్తగా పట్టభద్రురాలైన జాంగ్, అక్కడ ఉద్యోగం సంపాదించిన తర్వాత జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌకు మారింది.జాంగ్ వారంలో ఐదు రోజులు ఆఫీసుకి వెళ్తుంది. సాయంత్రం వేళల్లో ,వారాంతాల్లో (Weekends) వృద్ధులతో కలిసి డ్యాన్స్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్‌లో పాల్గొంటుంది. తద్వారా తక్కువ అద్దెకు ఇల్లు, పెద్దవారితో అనుబంధంతోపాటు, మానసిక ఉల్లాసాన్ని బోనస్‌గా అందుకుంటోంది.
ఈ ఆశ్రమం స్వచ్ఛంద సేవ కోసం దరఖాస్తు చేసుకునే వారు 35 ఏళ్లలోపు వారై ఉండాలి, నగరంలో సొంత ఇల్లు ఉండకూడదు . పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రతి మూడు నెలలకు కనీసం 45 గంటల పాటు వృద్ధులకు సేవ చేయాల్సి ఉంటుంది.
పెద్దలతో ఆత్మీయ అనుబంధం
ఈ క్రమంలో ఆశ్రమంలోని పెద్దవాళ్లతో యువతకు అనుబంధం, ఇటు వృద్ధులకు కూడా మంచి కాలక్షేపం తద్వారా చక్కటి ఆరోగ్యం కూడా అంటుంది జాంగ్. ఆశ్రమంలో ఆమెకు 89 ఏళ్ల వృద్ధుడిని పార్ట్నర్‌గా కేటాయించారు. ఆయన ఆమెను తన సొంత మనవరాలిలా చూసుకుంటారు. ఒకసారి జాంగ్ అనారోగ్యానికి గురైతై, ఆయన తెల్లవారుజామున 5 గంటలకే లేచి ఆమె కోసం వేడి వేడి సూప్ తయారు చేసి ఇచ్చారట. "ఈ నగరంలో నాకు ఎవరూ తెలియదు. కానీ ఈ ఆశ్రమం నాకు సొంత ఇల్లులా అనిపిస్తోంది. ఇక్కడ నాకు లభించే ప్రేమాభిమానాలు నా ఒత్తిడిని తగ్గిస్తున్నాయి," అంటుంది సంతోషంగా.

ఇదీ చదవండి: ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి
ఎందుకు ఈ నిర్ణయం?
చైనాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా మరియు యువతపై ఉన్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ "యీయాంగ్ సీనియర్ హౌస్" (Yiyang Senior House) ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనివల్ల యువతకు అద్దె భారం తగ్గుతుంది. వృద్ధులకు ఒంటరితనం పోయి కొత్త ఉత్సాహం లభిస్తుంది. అలాగే నగరంలో ఒంటరిగా ఉండే యువతకు ఒక కుటుంబం దొరికినట్లు అవుతుంది.ప్రస్తుతం ఆ ఆశ్రమంలో ఉన్న ఏకైక వాలంటీర్ జాంగ్ మాత్రమే (మిగిలిన వారు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు). అందుకే యాజమాన్యం మరికొంత మంది వాలంటీర్లను చేర్చుకోవాలని భావిస్తోంది.

ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు


