కంది(సంగారెడ్డి): తల్లీ, ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని జుల్కల్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జుల్కల్‌కు చెందిన పట్నం ప్రవీణ్ (30)తో అల్లూరుకు చెందిన మమత(27) వివాహం 8 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి మణికంఠ (5), ప్రళయశ్రీ (2) అనే పిల్లలు ఉన్నారు. కాగా, గత జనవరి 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందాడు. దీంతో పిల్లల పోషణ భారం మమతపై పడింది. అప్పటినుంచి మమత మానసికంగా బాధపడుతోంది.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇరుగు పొరుగువారు పిలిచినా పలకక పోవడంతోపాటు తలుపులు తెరవలేదు. అనుమానం వచ్చి వారు తలుపులను బలవంతంగా తెరిచి చూడటంతో మమత చీరతో దూలానికి ఉరివేసుకొని మృతి చెందగా, పిల్లలు ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లల గొంతు భాగాల్లో గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
భర్త మరణంతో కలిగిన మానసిక వేదనతో మమత తన పిల్లలను గొంతు నులిమి చంపి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ సత్యయ్య గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


