రెండో విడత పూలింగ్‌ కోసమే ఈ నాటకం: పేర్ని నాని | YSRCP leader Perni Nani fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

రెండో విడత పూలింగ్‌ కోసమే ఈ నాటకం: పేర్ని నాని

Mar 29 2026 5:38 AM | Updated on Mar 29 2026 5:38 AM

YSRCP leader Perni Nani fires On Chandrababu Govt

రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా?

ఇదంతా ప్రజలను, అమరావతి రైతులను మభ్యపెట్టే పన్నాగం

ఆరుగంటల అసెంబ్లీ సమావేశం.. జగన్‌ను తిట్టడమే బాబు ఉద్దేశం

అమరావతికి న్యాయం చేసింది వైఎస్‌ జగనే..

వెస్ట్‌ బైపాస్‌ తెచ్చిందీ.. గుంటూరు, విజయవాడతో అమరావతిని లింక్‌ చేసింది ఎవరు?.. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అన్నారు.. అప్పుల కుప్పగా మార్చారు

అమరావతిలో పేదలకు స్థానం లేకుండా చేసింది మీరు కాదా?

ఒక్క కార్యాలయమైనా కట్టారా? రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదే..?

తొలివిడత రైతులను దగా చేసి ఇప్పుడు మళ్లీ పూలింగా?

వైఎస్సార్‌సీపీ నేత,మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

సాక్షి, అమరావతి: అమరా­వతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్ర­బాబు ప్రభుత్వం.. అమ­రావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా నడిపించిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘రెండోదశలో మరో 50వేల ఎకరాలు తీసుకునేందుకే తీర్మానం పేరిట అసెంబ్లీలో డ్రామా ఆడారు. అసెంబ్లీలో ఆరుగంటల పాటు కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవ సరం లేదా?. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను, అమ­రావతి రైతులను మోసగించటానికి, మభ్యపెట్టడానికే చంద్రబాబు ఈ డ్రామాలు, నాటకాలు’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అమరావతి రాజధాని అని చెప్పేందుకు ఒక్క అధికారిక పత్రం లేదని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి చెప్పింది. ఈ విషయం ఈనాడు పత్రికే రాసింది. (ఈ సందర్భంగా ఈనాడు ప్రతిని పేర్ని నాని చదివి వినిపించారు) అందుకే హడావిడిగా కేబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టారు. నిజంగానే అమరావతికి చట్ట బద్ధత కల్పించాలంటే శాసనమండలి అవసరం లేదా? మండలిని ఎందుకు సమావేశ పరచలేదు? ఒక చట్టం కావాలంటే శాసన వ్యవస్థలో భాగమైన మండలి అనుమతి అక్కర్లేదా? ఉభయ సభలు ఆమోదం తెలపకుండా చట్టం ఎలా అవుతుంది? వాస్తుకోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. 

మరి అలాంటప్పుడు రెండో దశ విస్తరణలో వాస్తు వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తున్నారు? ఇది అరిష్టంకాదా? అమరావతి ఆలోచనను చంద్రబాబు చేసినప్పుడే ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్నారు. ఈ ప్రశ్నలంటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే విజయవాడలో బస్సులో పడుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ఉండడానికి ఇళ్లు, హోటళ్లు ఉన్నాయి, కాని బస్సులో పడుకున్నారంటే అదికూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన డ్రామానే. బస్సులో పడుకునే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్తున్నారు, అది నిజమే, ఎందుకంటే మిగతావాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉండేది, డ్రామా చేసేది చంద్రబాబు మాత్రమేనని పేర్ని నాని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కాదు. మొత్తం అప్పులకుప్ప..
అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి? 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. 

దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–25లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్‌ఫిడ్‌ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్‌ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. 

ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్‌ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్‌ని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా?

రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా...
రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్‌ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొప్పున∙కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది.

అమరావతికి న్యాయం చేసింది జగన్‌...
అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది మాజీ సీఎం జగనే. పశ్చిమ బైపాస్‌ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్‌ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్‌ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకులు ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. 

దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా? రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ తీర్మానం పెడితే జగన్‌  ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా?, (అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు.

ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి..
ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్‌లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్‌ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు గనుల్ని కేటాయించాలని కేబినెట్‌ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్‌ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయించాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement