breaking news
-
సచివాలయం వద్ద ఉద్రికత్త.. బీజేపీ నేతలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ నేతల నిరసనల నేపథ్యలంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు.ఇక, హైదరాబాద్‌లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనకు దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్‌సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్‌లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్‌లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్‌కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్‌కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్‌లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘తెలంగాణ ఇచ్చిన పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీనా?’
హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ గ్రేడ్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెసేనని, మీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎటువంటి పార్టీనో మీ తండ్రి కేసీఆర్‌ను అడిగితే చెబుతారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూఫ్ పోటో దిగింది మర్చిపోయారా? అని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. ‘మా పార్టీ పెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని దేశం మొత్తం హర్షిస్తుంది. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అవ్వడం మీకు ఇష్టం లేదు..మీ తెలంగాణ వాదం పై సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బు ఉందని కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పై మాట్లాడుతున్నావ్. అహంకారపూరితమైన మాటలు ఇక మాట్లాడకు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై చులకనగా మాట్లాడడం..అమెరికాలో చదివిన మీ విజ్ఞతకు వదిలేస్తున్న. నాడు ప్రపంచలోనే ద బెస్ట్ పిఎం అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ. రాజకీయంతో సంబంధం లేకుండా దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. యూరియా ఎందుకు రావట్లేదో అంత మాత్రం తెలియదా?, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేస్తుంటే అది మాట్లాడక పోగా.. అజ్ఞానంతో మాట్లాడుతున్నావ్’ అని ప్రశ్నించారు. -
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఇవ్వాలని తాము అడగలేదున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్లో కేంద్రం తెచ్చిన మూడు బిల్లుల విషయంలో ఇండియా కూటమి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నాయకులు బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తోంది. ఇందు కోసం లోక్‌సభలో బిల్లు పెట్టాం. దీన్ని ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడంలేదు. ఈ బిల్లుపై చర్చ జరపాలని జేపీసీకి పంపాం. లోక్‌సభలో పెట్టిన బిల్లు వల్ల దోచుకున్న వారికి కొంత బాధ కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదు. భవిష్యత్తులో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందుతుంది.లోక్‌సభలో నిన్ను కాంగ్రెస్ కూటమి తీరు దుర్మార్గం. తీవ్రమైన నేరాలపై అరెస్ట్ అయితే ప్రధాని, సీఎం, మంత్రులు పదవీచ్యుతులయ్యే విధంగా బిల్లు తెచ్చాం. రాజకీయాలతో సంబంధం లేని బిల్లు ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతోంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే అమిత్ షా ఎన్నికల్లో పోటీ చేశారు. నైతిక విలువలు కట్టుబడి నాడు అమిత్ షా రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగి పోవాలి. జేపీసీ ముందు అగ్ని పరీక్ష జరగాలి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలుగా పైగా జైలులో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టారని విమర్శించారు. జైలు నుంచే పాలన చేసి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ జైలు కెళ్లినా రాజీనామా చేయలేదని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మద్దతుపై మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదు. వాళ్ళ మద్దతు ఎవరు అడిగారు. మేం అడగలేదు. 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు పంపుతున్నాం. తమిళనాడు పోర్టు నుంచి రవాణా జరుగుతుంది. ఇఫ్కో నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో యూరియా లేదు అని మంత్రుల ప్రకటన వల్లే చాలా మంది స్టాక్ పెట్టుకున్నారు. ఈ సమస్యకు మంత్రుల ప్రకటనలే కారణం. దిగుమతుల సమస్యల వల్ల యూరియా కొంత ఆలస్యం జరిగింది’ అని చెప్పుకొచ్చారు. -
‘‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మద్దతు.. ఎన్డీయే అభ్యర్థికా? ఇండియా కూటమి అభ్యర్థికా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నవేళ.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉపరాషష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా. బీసీలపై ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండవా. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మేం ఏ కూటమిలో లేం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని కచ్చితంగా వ్యతిరేకిస్తాం..రాహుల్ గాంధీ మా బాస్ కాదు.. మోదీ మా బాస్ కాదు. ఢిల్లీలో మాకు ఏ బాస్ లేరు. మమ్మల్ని నడిపించేవారెవరూ లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్. అందుకే మేం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణం మా నిర్ణయం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్.. రెండూ దౌర్భాగ్యమైన పార్టీలే. కానీ, తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది. సెప్టెంబర్ 9 లోపు ఎవరు ఎరువులు ఇస్తామంటే వారికి మద్దతిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు. అయితే.. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. -
అప్పుడు లేని యూరియా కొరత.. ఇప్పుడే ఎందుకొచ్చింది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన నందినగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.‘‘తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మా పాలనలో యూరియా కష్టాలు రాకుండా సరఫరా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. రేవంత్ ప్రభుత్వానికి పరిపాలనపై అవగాహన లేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.‘‘వర్షంలో తడుచుకుంటూ ఎరువుల కోసం రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. రైతులకు మాత్రం ఎరువుల కొరత లేదని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రేవంత్‌కు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. -
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడు అయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు.రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వగానే 21ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతాం. దేశ కలలు సహకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. సిలికాన్ వ్యాలీని ఈరోజు మహిళలలు నడుపుతున్నారు అంటే రాజీవ్ ఘనతే. నేటి యువతకు ఆయన స్పూర్తి ప్రదాత. రాజీవ్ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, మూసీ ప్రక్షాళనను మన ప్రభుత్వం చేయబోతోంది అని చెప్పుకొచ్చారు. -
అదిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కలవడానికి సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి పూర్తి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కలవడానికి సిద్ధమన్నారు. మంగళవారం(ఆగస్టు 19వ తేదీ) మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన సీఎం రేవంత్.. ‘ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అదిష్టానం ఆదేశిస్తే కేసిఆర్‌ను కలవడానికి సిద్దం. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తడో లేదో.. ఆయనకు నా మొఖం చూడటం ఇష్టం ఉందో లేదో. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో నా నిర్ణయం ఏం లేదు ఇండియా కూటమి నిర్ణయం. నేను రెగ్యులర్ ఆయన్ను కలుస్తాను.. మన ఊరాయనా. నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్‌కు వెళతాను’ అని పేర్కొన్నారు. -
‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు’
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. తమకు ఇంకా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమ ప్రాధాన్యమన్నారు. తెలంగాణ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదుమరోవైపు సివిల్ సప్లై కమిషనర్ ఎస్ చౌహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పై డిఓపిటి మంత్రి జితేందర సింగ్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ భక్తులుగా బానిసలుగా,కొందరు అధికారులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రికి ఫిర్యాదు చేశాం. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పై డిఓపిటి మంత్రికి ఫిర్యాదు చేశాం. భారత రాజ్యాంగాన్ని కాపాడేది బ్యూరోక్రాట్సే. ఈ నెల 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది, ఆ కార్యక్రమంలో అధికారులు గత ప్రభుత్వ తీరును విమర్శించారు. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టే విధంగా వ్యవహరించారు. రేషన్ కార్డులు గతంలో ఇవ్వలేదు....ఇప్పుడు ఇస్తున్నారని అబద్ధాల ప్రచారం చేశారు. ఐఏఎస్, ఐపిఎస్, ప్రతిష్టల దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించారు.. భారత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కేంద్ర డిఓపిటి మంత్రిని కోరాం. ఐఏఎస్ ఐపిఎస్, అధికారులు పార్టీ కండువాలు మార్చుకున్న విధంగా మాట్లాడుతున్నారు.కొందరు తెలంగాణ అధికారుల తీరు మార్చుకోవాలి’ అని సూచించారు శ్రవణ్. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి -
అడ్డుకుంటున్నది వారే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కసరత్తు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రతిపాదనలకు మతం రంగు పులిమి బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 2018లో చట్టాన్ని చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే ఆ చట్టం అడ్డంకిగా మారిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ట్యాంక్‌బండ్‌కు సమీపంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రవీంద్రభారతిలో సభికులనుద్దేశించి మాట్లాడారు. పర్యాటక ప్రాంతంగా ఖిలా షాపూర్ అభివృద్ధి ‘బహుజనుల సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తి నిర్మించిన ఖిలా షాపూర్ కోటను బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. మేం ఆనాడు కోటపైకి వెళ్లి చూసి.. దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టాం..’అని సీఎం తెలిపారు. బీజేపీకి ఆ ధైర్యం ఉందా? ‘రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా కుల సర్వే చేపట్టి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కులాల గణాంకాలను తేల్చింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించాం. ఐదు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో బిల్లులు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశాం. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు బీజేపీ మతం రంగు పులిమింది. మోదీ, కిషన్‌రెడ్డి వీటిని అడ్డుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ముస్లింలు బీసీ జాబితా ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించే ధైర్యం బీజేపీకి ఉందా? రాహుల్‌గాం«దీపై కోపం ఉంటే ఆయనపై చూపాలి కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు..’అని రేవంత్ అన్నారు. తెలంగాణలోనూ ఓట్లు చోరీ చేసే కుట్ర.. ‘దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ ఓట్ల కుట్రను రాహుల్‌గాంధీ బట్టబయలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేడ్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో డిప్యూటీ సీఎంతో కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేస్తా. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర జరుగుతోంది. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బహుజనుల పిల్లలు రాజ్యాధికారం సాధించాలి ‘బహుజనుల పిల్లలంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు.. వర్థంతులు, జయంతుల కోసం కాదు. ప్రతి ఒక్కరిలో వారి స్ఫూర్తిని రగిలించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం..’అని రేవంత్ అన్నారు. తెలంగాణ నిర్ణయాలు దేశానికే ఆదర్శం: భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక విప్లవానికి కూడా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కుల సర్వేను కేంద్రం నమూనాగా తీసుకుని కులగణనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల తరఫున భట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సర్వాయిపేట కోటను రూ.4.5 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని, బహుజనులందరితో కలిసి ఉద్యమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ చేతకానితనం వల్లే పరిశ్రమలు పారిపోతున్నాయి: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధత, సీఎం రేవంత్ రెడ్డి చేతకాని పాలనతో పరిశ్రమలు తెలంగాణ నుంచి పారిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ చేతకాని పాలనతో రూ. 2,800 కోట్ల కేన్స్ పెట్టుబడి గుజరాత్‌కు తరలిపోయిందని విమర్శించారు. ప్రత్యక్షంగా 2 వేలమంది తెలంగాణ యువత ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ గండికొట్టిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ శ్రమ.. రేవంత్ చేతకానితనం వల్ల బూడిదలో పోసిన పన్నీరుగా మారిందన్నారు. ఢిల్లీకి ఏటీఎంలా రాష్ట్రాన్ని వాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అని కేటీఆర్ మండిపడ్డారు. ఇదొక "చెత్త" సర్కారు! రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు కేటీఆర్ ‘‘ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం "ఆర్ఆర్ ట్యాక్స్" వసూళ్లలో బిజీగా ఉన్నారు! ’ అని విమర్శించారు.ఇదొక "చెత్త" సర్కారు!రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025 -
‘తెలంగాణాలోనూ ‘ఓట్ చోరీ’.. వారి భరతం పడతాం‘
సాక్షి,హైదరాబాద్: ‘బీహార్లోనే కాదు.. తెలంగాణలో ఓటు చోరీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర చేసేవారి భరతం పడదాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఓట్ చోరీ అంశంలో తప్పు చేసినవారిని వదిలేసి..తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రవీంద్ర భారతి వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్..రాహుల్ గాంధీ ఆరోపణలకు ఏడురోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలన్న ఈసీ ఆదేశాలపైవిధంగా స్పందించారు. ‘ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనంరాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం.గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది.అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు.ఐదు నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం.బహుజనుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదు? బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా?.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు.ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు?.నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించగలరా?. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు.రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపండి.. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు.రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి.విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది.విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకే.అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీది. దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది.అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది.బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి…తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది.ఇది ఎంతవరకు న్యాయం. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం’ అని వ్యాఖ్యానించారు. -
ఇదొక ‘చెత్త’ సర్కారు!.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసిన మురుగు నీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఇదొక ‘చెత్త’ సర్కారు!. రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీగా ఉన్నారు!’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక "చెత్త" సర్కారు!రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025అలాగే, అంతకుముందు.. రామంతాపూర్‌లో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్..‘రామంతపూర్ గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని అన్నారు.రామంతపూర్ గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా…— KTR (@KTRBRS) August 18, 2025 -
కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే అధికార కాంగ్రెస్ కూడా 3 ఆప్షన్లను పరిశీలించనుంది. ఈ మూడు ఆప్షన్లలో ఎటువైపు మొగ్గుచూపాలనే అంశాన్ని తేల్చేందుకు ఈనెల 23న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో 3 అంశాలపై చర్చించి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని యోచిస్తోంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. ఎలా ముందుకెళ్దాం? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదు. పీసీసీ చీఫ్‌తో పాటు పార్టీలోని బీసీ ముఖ్య నేతలు ఓ వాదన వినిపిస్తుండగా, కొందరు మంత్రులు, మరికొందరు నేతలు మరో వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే బీసీలకు 42 %రిజర్వేషన్ల కల్పనే పార్టీకి ప్రధానమని, అవసరమనుకుంటే ఈ విషయంలో మరికొంత సమయం తీసుకుందామని ఆయన అంటున్నారు. ఆదివారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు మంత్రులు, నాయకులు మాత్రం ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మరింత జాప్యం చేయడం మంచిది కాదని, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పీఏసీని సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. ఈ మూడు ఆప్షన్లు పీఏసీ ముందుకు.. పీఏసీ సమావేశంలో మూడు అంశాలపై చర్చ జరగనుండగా.. రిజర్వేషన్ల విషయం ఎటూ తేలనందున కోర్టును మరింత సమయం కోరుదామని, వీలుకాదంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మరోమారు ఢిల్లీకి వెళదామనే ప్రతిపాదన ఇందులో మొదటిది. మరోమారు అసెంబ్లీని సమావేశపరిచి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టాలనేది రెండో ప్రతిపాదన. ఈ రెండూ కాదంటే నేరుగా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడం మూడోది. వీటిపై అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీఎంతో ముఖ్యుల భేటీ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌తో మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియన్ నేత వి.హనుమంతరావులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు గాం«దీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా 22న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జరిగే అమరవీరుల స్థూపావిష్కరణకు హాజరు కావాలని రేవంత్‌ను వీహెచ్ కోరారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా పీసీసీ చీఫ్‌కు సూచించిన ముఖ్యమంత్రి.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని వీహెచ్‌కు చెప్పినట్టు సమాచారం. -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు.ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన కేటీఆర్.. ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే రెండేళ్ల క్రితం హెచ్చరించానన్నారు. విజన్ లేని రేవంత్ వలన ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. వేల కోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసిందన్నారు. -
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్‌రెడ్డిపై యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే చాన్స్ ఉంది.అంతకుముందు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..‘వరంగల్ పంచాయతీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. వారు ఎవరెవరు అనేది పార్టీ సూచిస్తుంది. నేను మంటలు పెట్టడానికి లేను. చల్లార్చే పనిలో ఉన్నాను. నా పని ఫైరింజన్ చేసే పని. పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ నాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లపై చర్చ చేశారు.. పరిశీలిస్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, కానీ మాట తప్పారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. -
కాళేశ్వరంపై మరో కుట్ర.. మోటర్లే టార్గెట్: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోటర్లను నాశనం చేసి అది.. బీఆర్ఎస్పై నెపం వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంది. నీళ్లను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నేను వారం రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్‌కు లేఖ రాశాను. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్‌కు నీళ్ల విలువ తెలియదు. ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.. ఎందుకు ప్రాజెక్టుల నీళ్లను వృథా చేస్తున్నారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపాలి. వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మీరు ఆన్ చేయకుంటే మేమే ఆన్ చేస్తాం.కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడడని బీహెచ్ఈఎల్ ఇప్పటికే హెచ్చరించింది. మోటర్లను నాశనం చేసి.. అది బీఆర్ఎస్పై వేయాలని కుట్ర చేస్తున్నారు. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే మీరే చూసుకోండి. దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్‌కు నష్టం జరుగుతోంది. కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు ఎన్డీయే ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి మరీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంను.. ‘కూలవరం’అనే ధైర్యం ఉందా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్పై బీజేపీ నేతలు బురదజల్లారు. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయినా పోలవరం కాఫర్ డ్యామ్‌పై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అని నిలదీశారు. ‘ఏపీలో ఏకంగా పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్‌కు గుట్టుచప్పుడు కాకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బరాజ్ వద్ద మరమ్మతులు లేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకూ, పలుకూ లేదు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ అడ్రస్ లేదు. పంజాబ్‌నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్ర రైతును తీర్చిదిద్దిన కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుమీద కాంగ్రెస్, బీజేపీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
చంద్రబాబు స్క్రిప్ట్‌నే రేవంత్ వినిపించారు
సూర్యాపేట టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనని, గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందని, ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే.. కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందని ఆరోపించారు.ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. రేవంత్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని ఇక్కడ వినిపించారని విమర్శించారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డ్‌లో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్‌లను ప్రారంభించారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే కదా అని అన్నారు.కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం అని రుజువైందని చెప్పారు. -
‘కాళేశ్వరం’ పేల్చివేత కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసేందుకు జరి గిన కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్ ఆరోపించారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నాయన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2022లో రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు తట్టుకున్నాయ న్నారు. కానీ ఎవరో స్క్రిప్టు రాసినట్లుగా మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి‘మేడిగడ్డ కుంగితే పిల్లర్లకు ఎక్కడా పగుళ్లు రావని ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నారు. మేడిగడ్డలో 20వ నంబర్ పిల్లర్‌ను ఎవరో పేల్చే కుట్రచేశారు. కుట్ర వెనుక ఉన్న అసాంఘిక శక్తులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తేల్చాలి. ఘటన జరిగిన వెంటనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి మొబైల్ ఫోన్ డేటా చెక్ చేస్తే వెంటనే దొరికేవాళ్లు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఉన్నారా? లేదా? అనేది సిట్ ఏర్పాటు చేసి తేల్చాలి. లేదా అక్కడ తక్కువ స్థాయిలో ఏమైనా భూకంపాలు వచ్చాయా లేదా అనేది తేల్చాలి’ అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.కాగా, 2023 అక్టోబర్ 21న రాత్రి మేడిగడ్డ బరాజ్ వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్లు మరుసటి రోజు మహదేవ్పూర్ పోలీసు స్టేషన్లో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారని ప్రవీణ్‌కుమార్ గుర్తు చేశారు. అయితే పేలుళ్ల కోణంలో పోలీసులు విచారణ జరపకపోగా, ఇప్పటి వరకు ఎవరి వద్దా స్టేట్మెంట్లు రికార్డు చేయలేద న్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాసిన వెంటనే వచ్చిన ఎన్డీఎస్ఏ మేడిగడ్డ పేలుళ్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. -
‘రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది’
హైదరాబాద్: తనకు మంత్రి పదవిని ఆశజూపి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలపై పదే పదే విమర్శల చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిఓణ కమిటీకి చేరింది. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను టార్గెట్ చేసి మాట్లాడటం సీఎం రేవంత్‌కు తగదని, దీన్ని తెలంగాణ సమాజం సహించదన్నారు. ఈ విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ‘ రాజగోపాల్‌రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించా. రాజగోపాల్ రెడ్డి వ్యవహరాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది’ అని స్సష్టం చేశారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. ఇక మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై మహేష్ గౌడ్ స్పందించారు. మార్వాడీలు మనలో ఒక భాగమని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు.మంత్రి పదవిపై ఉన్న మోజు అభివృద్ధిపై లేదుయాదాద్రి భువనగిరి జిల్లా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న మోజు నియోజకవర్గం అభివృద్ధిపై లేదని విమర్శించారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. ‘ 20 నెలల్లో మునుగోడులో ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదు. కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మేమే. ప్రభుత్వం సహకరిస్తలేదని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక్కసారైనా నియోజకవర్గం తీసుకొచ్చావా. మునుగోడుకు రాజగోపాల్ నేనే మంత్రి.. నేనే రాజు అని అనుకుంటున్నాడు. మంత్రులను ఎంపీలను ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నాడు..కలలో కూడా మంత్రి పదవి కోసం రాజగోపాల్ కలవరిస్తున్నాడు. మంత్రి పదవి ఫై ఉన్న మోజు ఈ ప్రాంత అభివృద్ధిపై లేదు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్నే విమర్శిస్తే నీకు నిధులు ఎవరు ఇస్తరు’ అని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. సూర్యాపేటలో మరోసారి రప్పా రప్పా ఫీవర్ మొదలైంది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్‌గా తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ ఫొటోతో ఎదురొస్తే రప్పా.. రప్పా అంటూ రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌పై తెలంగాణ బెబ్బులి పులి - ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. -
అయ్యా రేవంత్ రెడ్డి పదవులూ మీకే.. పైసలూ మీకేనా?
సంస్థాన్ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు. పదవులు మీకే.. పైసల్ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్‌రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?’
హైదరాబాద్: బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి, బండి సంజయ్. ఈరోజు(ఆగస్టు 15వ తేదీ) యూసఫ్‌గూడాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి తిరంగా ర్యాలీని ప్రారంభించారు బండి సంజయ్, దీనిలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్,. ‘ మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే.. మేం హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తాం. రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం అనేది హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివి. పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు?, హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు?, రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాలు చేస్తాం. ఓట్ల చోరీకి, బీజేపీకి ఏం సంబంధం?మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?, ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా?, కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి?, రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది’ అని మండిపడ్డారు. -
‘హైడ్రా’ అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా.. హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ అని ప్రశంసించారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోల్కోండ కోటలో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం.ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పని చేస్తోంది. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది. హైడ్రా.. హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకుందామని నేను మీ అందరికి పిలుపునిస్తున్నా. అలాగే, శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు.ఇదే సమయంలో మాకు విల్ ఉంది.. విజన్ ఉంది.. తెలంగాణ రైజింగ్-2047 మా విజన్. ఆ విజన్ నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టడమే మా విజన్. ఇందుకు ప్రజలందరి సహకారం, ఆశీర్వాదం అవసరం అని వ్యాఖ్యలు చేశారు.