
సాక్షి, ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతు బీజేపీకి అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్ మద్దతు బీజేపీకి ఇవ్వాలని తాము అడగలేదున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్‌లో కేంద్రం తెచ్చిన మూడు బిల్లుల విషయంలో ఇండియా కూటమి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నాయకులు బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తోంది. ఇందు కోసం లోక్‌సభలో బిల్లు పెట్టాం. దీన్ని ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడంలేదు. ఈ బిల్లుపై చర్చ జరపాలని జేపీసీకి పంపాం. లోక్‌సభలో పెట్టిన బిల్లు వల్ల దోచుకున్న వారికి కొంత బాధ కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదు. భవిష్యత్తులో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందుతుంది.
లోక్‌సభలో నిన్ను కాంగ్రెస్ కూటమి తీరు దుర్మార్గం. తీవ్రమైన నేరాలపై అరెస్ట్ అయితే ప్రధాని, సీఎం, మంత్రులు పదవీచ్యుతులయ్యే విధంగా బిల్లు తెచ్చాం. రాజకీయాలతో సంబంధం లేని బిల్లు ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతోంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే అమిత్ షా ఎన్నికల్లో పోటీ చేశారు. నైతిక విలువలు కట్టుబడి నాడు అమిత్ షా రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగి పోవాలి. జేపీసీ ముందు అగ్ని పరీక్ష జరగాలి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలుగా పైగా జైలులో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టారని విమర్శించారు. జైలు నుంచే పాలన చేసి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ జైలు కెళ్లినా రాజీనామా చేయలేదని తెలిపారు.
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మద్దతుపై మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదు. వాళ్ళ మద్దతు ఎవరు అడిగారు. మేం అడగలేదు. 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు పంపుతున్నాం. తమిళనాడు పోర్టు నుంచి రవాణా జరుగుతుంది. ఇఫ్కో నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో యూరియా లేదు అని మంత్రుల ప్రకటన వల్లే చాలా మంది స్టాక్ పెట్టుకున్నారు. ఈ సమస్యకు మంత్రుల ప్రకటనలే కారణం. దిగుమతుల సమస్యల వల్ల యూరియా కొంత ఆలస్యం జరిగింది’ అని చెప్పుకొచ్చారు.