
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి, తుమ్మల, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, మహేశ్‌కుమార్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, జాజుల తదితరులు
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోదీ, కిషన్‌రెడ్డి మోకాలడ్డుతున్నారు
మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై కేంద్రం స్పందించడం లేదు
నాడు కేసీఆర్ చేసిన చట్టం రిజర్వేషన్లకు ఆటంకంగా మారింది
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కసరత్తు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రతిపాదనలకు మతం రంగు పులిమి బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 2018లో చట్టాన్ని చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే ఆ చట్టం అడ్డంకిగా మారిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంతకుముందు ట్యాంక్‌బండ్‌కు సమీపంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రవీంద్రభారతిలో సభికులనుద్దేశించి మాట్లాడారు.
పర్యాటక ప్రాంతంగా ఖిలా షాపూర్ అభివృద్ధి
‘బహుజనుల సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తి నిర్మించిన ఖిలా షాపూర్ కోటను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. మేం ఆనాడు కోటపైకి వెళ్లి చూసి.. దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టాం..’అని సీఎం తెలిపారు.
బీజేపీకి ఆ ధైర్యం ఉందా?
‘రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా కుల సర్వే చేపట్టి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కులాల గణాంకాలను తేల్చింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించాం.
ఐదు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో బిల్లులు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశాం. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్‌ఎస్ దూరంగా ఉన్నాయి. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు బీజేపీ మతం రంగు పులిమింది. మోదీ, కిషన్‌రెడ్డి వీటిని అడ్డుకుంటున్నారు.
అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ముస్లింలు బీసీ జాబితా ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించే ధైర్యం బీజేపీకి ఉందా? రాహుల్‌గాం«దీపై కోపం ఉంటే ఆయనపై చూపాలి కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు..’అని రేవంత్ అన్నారు.
తెలంగాణలోనూ ఓట్లు చోరీ చేసే కుట్ర..
‘దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ ఓట్ల కుట్రను రాహుల్‌గాంధీ బట్టబయలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేడ్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో డిప్యూటీ సీఎంతో కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేస్తా. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర జరుగుతోంది. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
బహుజనుల పిల్లలు రాజ్యాధికారం సాధించాలి
‘బహుజనుల పిల్లలంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు.. వర్థంతులు, జయంతుల కోసం కాదు. ప్రతి ఒక్కరిలో వారి స్ఫూర్తిని రగిలించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం..’అని రేవంత్ అన్నారు.
తెలంగాణ నిర్ణయాలు దేశానికే ఆదర్శం: భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక విప్లవానికి కూడా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కుల సర్వేను కేంద్రం నమూనాగా తీసుకుని కులగణనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల తరఫున భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సర్వాయిపేట కోటను రూ.4.5 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని, బహుజనులందరితో కలిసి ఉద్యమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.